‘తెలంగాణ’పై వెనకడుగు లేదు: దిగ్విజయ్‌సింగ్
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్న నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ పునఃసమీక్ష చేసే అవకాశం లేనే లేదని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ శుక్రవారం కుండబద్దలు కొట్టారు. టీడీపీతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ ఏర్పాటు నిర్ణయానికి గతంలో మద్దతిచ్చిందని ఆరోపించారు. ‘‘ఆ రెండింటితో పాటు రాష్ట్రంలోని అన్ని పార్టీల సమ్మతి తర్వాతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. టీడీపీ, వైఎస్సార్‌సీపీ (ఇప్పుడు) తమ మనోగతాన్ని మార్చుకోవచ్చు.
కానీ కాంగ్రెస్ మాత్రం అలా మార్చుకోబోదు’’ అని చెప్పుకొచ్చారు. విభజనపై కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని తూచా తప్పకుండా అనుసరించడం జరుగుతుందని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా అక్కడి సంబంధీకులందరికీ తాను స్పష్టం చేశానన్నారు. మోడీ తనపై ఉన్న మతవాద ముద్రను వదిలించుకోజూస్తున్నారన్న దిగ్విజయ్, చిరుత తనపై ఉన్న మచ్చలను మార్చుకోజాలదంటూ ఎద్దేవా చేశారు. కళంకిత ప్రజాప్రతినిధులను కాపాడేందుకు కేంద్రం తేజూసిన ఆర్డినెన్స్‌ను దునుమాడుతూ తానన్న మాటలు తప్పేమో గానీ, వాటి వెనక ఉన్న తన మనోగతం మాత్రం మంచిదేనన్న రాహుల్‌గాంధీ వ్యాఖ్యలు ఆయన నిజాయితీకి నిదర్శమన్నారు.