కాంగ్రెస్‌వి ఓటుబ్యాంకు రాజకీయాలు
Published Mon, Sep 30 2013 12:40 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
మిర్యాలగూడ, న్యూస్‌లైన్ : రాష్ట్రంలోని తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ ఓటు రాజకీయాలకు పాల్పడుతుందని సీపీఎం శాసనసభాపక్ష నేత, మిర్యాలగూడ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. ఆదివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీడబ్ల్యూసీ నిర్ణయం వెలువడి రెండు నెలలవుతున్నా సమస్య జఠిలమవుతుందే తప్ప పరిష్కారం కావడం లేదన్నారు. అధిష్టానం ఇచ్చిన పదవుల్లో ఉన్న నాయకులే సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రాంతీయ భావాలను రెచ్చగొట్టే విధంగా ప్రకటనలు చేస్తున్నారని అన్నారు. ఇరు ప్రాంతాలలో జరుగుతున్న ఉద్యమాలు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం జరిపిస్తుందనే అనుమానం కలుగుతుందన్నారు. ఇరు ప్రాంతాల్లో జరుగుతున్న ఉద్యమాలపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రేక్షకపాత్ర వహిస్తుందన్నారు. ఇప్పటికైనా సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పట్టించుకునే వారే లేరన్నారు. సమావేశంలో సీపీఎం నాయకులు మాలి పురుషోత్తంరెడ్డి, వీరేపల్లి వెంకటేశ్వర్లు, జదీశ్‌చంద్ర, రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement