సికింద్రాబాద్‌లో నివాళులర్పిస్తున్న మాజీ మంత్రి జానారెడ్డి, (ఇన్‌సెట్‌లో) గంగాధర్ (ఫైల్)
సాక్షి, మిర్యాలగూడ టౌన్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తిరునగరు గంగాధర్(89) అనారోగ్యంతో సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందారు. కాంగ్రెస్ పార్టీలో మంచి గుర్తింపు పొందిన నాయకుల్లో గంగాధర్ ఒకరు. 1971 నుంచి 1979 మార్చి వరకు సర్పంచ్‌గా పని చేశారు. అదే సమయంలో త్రిపురారం మండలం పెద్దదేవులపల్లి రిజర్వాయర్ నుంచి మిర్యాలగూడకు పైపులైన్ ద్వారా ప్రజలకు మంచినీటిని అందించారు. 40 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పని చేశారు. 14 ఏళ్ల వయస్సులోనే మిలట్రీ పరిటాల క్యాంపులో పని చేస్తుండగా గంగాధర్ గురువు అయినా వంగాల మధుసూదన్‌రెడ్డి తీసుకువచ్చాడు.
అదే సయయంలో స్వాతంత్రోద్యమంలో పాల్గొని కొన్నాళ్ల పాటు జైలు జీవితాన్ని గడిపారు. ఆ తరువాత మిర్యాలగూడ ప్రాంతంలో యువజన కాంగ్రెస్‌ను బలోపేతం చేయడంతో పాటు హామాల సంఘాన్ని ఏర్పాటు చేసి 30 ఏళ్ల పాటు ఆ యూనియన్‌కు అధ్యక్షులుగా కొనసాగారు. 1995లో మున్సిపల్ చైర్మన్‌గా ప్రత్యక్ష ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గార్లపాటి నిరంజన్‌రెడ్డి చేతిలో, 1996లో నల్లగొండ పార్లమెంటు సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు. 2007 కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మిర్యాలగూడ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా సంవత్సరం పాటు బాధ్యతలను నిర్వర్తించారు.
2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి మిర్యాలగూడ అసెంబ్లీకి పోటీ చేసి రెండు వేల ఓట్ల మెజార్టీతో ఓడిపోయారు. ఆర్యవైశ్య సంఘంలో కూడా గంగాధర్‌కు మంచి గుర్తింపు ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో మాజీ సీఎం కొణిజేటి రోశయ్యతో మంచి సంబంధాలు ఉన్నాయి. మిర్యాలగూడ రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా పని చేశారు. చకిలం శ్రీనివాస్‌రావు 1983 నుంచి 1985వరకు ఉన్న కాలంలో పార్టీ కార్యక్రమాలు గంగాధర్ నివాసం నుంచే నిర్వహించేవారు. కాగా గంగాధర్ అంత్యక్రియలను మంగళవారం అన్నపూరెడ్డిగూడెంలో గల వారి సొంత పొలంలో నిర్వహించనున్నారు.
మాజీ మంత్రి, మంత్రి సంతాపం
తిరునగరు గంగాధర్ మృతిచెందిన విషయం తెలుసుకున్న మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి హుటాహుటిన సికింద్రాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లారు. అనంతరం పూలమాలలు వేసి నివాళులర్పించారు. గంగాధర్ మృతి పార్టీకి తీరని లోటన్నారు. తిరునగరి గంగాధర్‌కి మంత్రి జగదీశ్‌రెడ్డి తీవ్ర సంతాపం ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment