సాక్షి ప్రతినిధి, గుంటూరు
సరస్వతి సిమెంట్స్‌కు చెందిన భూముల విషయంలో జరిగిన వివాదం వెనుక పెద్ద భాగోతమే నడిచింది. భూమి లేకుండా సిమెంట్ కంపెనీ ప్రతినిధులపై దౌర్జన్యానికి దిగి ఒకరు, తనపై తానే కిరోసిన్ పోసుకుని సిమెంట్ కంపెనీ ప్రతినిధులే తనపై కిరోసిన్ పోసి హత్యాయత్నానికి పాల్పడ్డారని మరొకరు తప్పుడు కేసులు పెట్టారు.
రెండు రోజుల తరువాత అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వివరాలు ఇవీ...
మాచవరం మండలం చెన్నాయపాలెం గ్రామంలోని సరస్వతి సిమెంట్స్‌కు భూములు అమ్మిన రైతుల్లో కొందరు పత్తిపంటను వేయగా, దానిని తొలగించేందుకు సిమెంట్ కంపెనీ ప్రతినిధులు ఈనెల 8వ తేదీన ప్రయత్నించారు. దీనిని నిలువరించేందుకు రైతులతోపాటు టీడీపీ నేతలు, కార్యకర్తలు కంపెనీ ప్రతినిధులతో వివాదానికి దిగారు. భూములు అమ్మినవారిలో చెన్నాయపాలెం గ్రామానికి చెందిన బండ్ల గురులక్ష్మి కూడా ఉన్నారు.
ఆమె మూడు ఎకరాలు అమ్మారు. అయితే ఆమె విశాఖపట్నంలోని తన కుమారుల వద్ద ఉంటోంది. పిడుగురాళ్లలో నివసిస్తున్న ఆమె కుమార్తె గద్దె పూర్ణమ్మ టీడీపీ నేతల చెప్పుడు మాటలు విని ఆ భూమిలో పత్తి పంటను సాగు చేసింది. వారానికి ఒకసారి పిడుగురాళ్ల నుంచి వచ్చి పొలాన్ని పరిశీలించి వెళుతోంది. ఈ క్రమంలో 8వ తేదీన సిమెంట్ కంపెనీ ప్రతినిధులు తన భూమిలోని పంటను తొలగిస్తున్నారని తెలుసుకుని పూర్ణమ్మ కిరోసిన్ డబ్బాతో పొలానికి చేరుకొని సిమెంట్ కంపెనీ ప్రతినిధులతో వివాదానికి దిగింది.
ఆ సమయంలో టీడీపీ నేతలు, కార్యకర్తల ప్రోద్బలంతో ఆమె కిరోసిన్‌ను ఒంటిపై పోసుకుని సిమెంట్ కంపెనీ ప్రతినిధులపై బెదిరింపులకు దిగింది. దీనిని అక్కడే ఉన్న కొంత మంది తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించారు. ఈ విషయం తెలియని టీడీపీ నేతలు సరస్వతీ సిమెంట్స్ ప్రతినిధులపై, వారికి మద్దతుగా వచ్చిన వారిపై తప్పుడు కేసును బనాయించేందుకు మాచవరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయించారు.
ఆమెపై సరస్వతి సిమెంట్ కంపెనీ ప్రతినిధులు, వారి మద్దతుదారులు కిరోసిన్ పోసి హత్యాయత్నానికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొనగా 307 సెక్షన్‌కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా, అదే గ్రామానికి చెందిన బచ్చలపూడి రవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు 250 మందిపై అనేక సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఫిర్యాదు చేసిన రవికి సరస్వతీ సిమెంట్స్ యాజమాన్యం కొనుగోలు చేసిన భూముల్లో సెంటు భూమి కూడా లేకపోవడం గమనించదగిన విషయం. భూమి లేని రవి అసలు అక్కడకు ఎందుకు వచ్చాడో టీడీపీ నేతలకే తెలియాలి. ఈ రెండు సంఘటనలు బట్టి చూస్తే సరస్వతి సిమెంట్స్ యాజమాన్యంపై టీడీపీ నేతలు మోపిన కేసులన్నీ తప్పుడు కేసులు, నిరాధారమైవని స్పష్టమవుతోంది.
కుట్ర బట్టబయలు
Published Mon, Oct 13 2014 11:58 PM | Last Updated on Sat, Sep 2 2017 2:47 PM
Advertisement
Advertisement