ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకే ఫ్లై ఓవర్ నిర్మాణం
ఎంపీ కేశినేని నాని
విజయవాడ(భవానీపురం) : రాజధాని అవసరాలు, పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ, ఏలూరు రోడ్ ట్రాఫిక్ ఇబ్బందులను తగ్గించేందుకే బెంజి సర్కిల్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణం చేపడుతున్నట్లు విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శ్రీనివాస్(నాని) చెప్పారు. ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌రావు, మేయర్ కోనేరు శ్రీధర్, జాతీయ రహదారుల రీజినల్ ఆఫీసర్ అనిల్ దీక్షిత్, పీడీ సురేష్, మేనేజర్ మధుసూదన్, విద్యావాణిలతో కలిసి ఆయన శనివారం క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. ఎంపీ మాట్లాడుతూ నగరంలో ప్రధాన కూడలి అయిన బెంజి సర్కిల్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణ పనులను జ్యోతి కన్వెన్షన్ నుంచి స్టెల్లా కలాశాల జంక్షన్ వరకు సుమారు 618 మీటర్లకు బదులుగా మరో 820 అడుగులు పెంచి 1.4 కిలోమీటర్ల మేర ఫ్లైఓవర్ నిర్మాణం చేయాల్సి ఉందని తెలిపారు.
ఫ్లైఓవర్ నిర్మాణాన్ని రమేష్ హాస్పటల్ సర్కిల్ వరకు పెంచడం వలన కేంద్రం నుంచి రూ.120 కోట్లు అదనంగా నిధులు సమీకరించాల్సి ఉందని చెప్పారు. క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం నేషనల్ హైవే అధికారుల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి మరొక నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపారు. గతంలో గుండుగొలను బైపాస్ రోడ్ ఏర్పాటు చేసినందున బెంజి సర్కిల్ ఫ్లైఓవర్ నిర్మాణం స్టెల్లా కాలేజి వరకు సరిపోతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపిందని, భవిష్యత్ అవసరాల దృష్ట్యా రమేష్ హాస్పటల్ వరకు పొడగించాలని కోరుతూ గతంలో కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారిని పలుమార్లు కలిశామన్నారు.
కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి అవసరమైన నిధులను త్వరలో సమకూర్చే విధంగా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ అర్బన్ ప్రధాన కార్యదర్శి గన్నె వెంకట నారాయణ ప్రసాద్(అన్న), డెప్యూటీ మేయర్ జి రమణారావు, కార్పొరేటర్లు సీహెచ్ గాంధీ, దేవినేని అపర్ణ, కె.రమాదేవి, జాస్తి సాంబశివరావు, నజీర్, సీనియర్ నాయకులు టి ప్రేమ్‌నాథ్, కె రామామరావు, తెలుగు మహిళ అధ్యక్షురాలు కె సూర్యలత పాల్గొన్నారు.