నిర్మాణ పనుల వద్దకే ఇసుక
గుంటూరు ఈస్ట్: భవన నిర్మాణాలు చేపట్టిన వారు ఇకపై ఇసుక కోసం ఎక్కడికీ వెళ్లనవసరం లేదని జిల్లా సంయుక్త కలెక్టర్ డాక్టర్ సి.హెచ్.శ్రీధర్ చెప్పారు. మీ సేవలో నిర్ణయించిన ధర, రవాణా చార్జీలు చెల్లించి నిర్మాణ పనుల వద్దే ఇసుక అనులోడ్ చేసుకునే సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని తన చాంబర్‌లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో జేసీ మాట్లాడారు. ఈనెల 26 నుంచి రవాణా చార్జీలు, ఇసుక ధరను తప్పక మీ సేవలోనే చెల్లించాలన్నారు.
జిల్లాలో మొత్తం ఆరు ఇసుక రీచ్‌లు పనిచేస్తున్నాయని, వీటిని గుర్తించిన మహిళా సంఘాలు పర్యవేక్షిస్తాయని తెలిపారు. రాష్ట్రంలోని ఏ ప్రాంతాల నుంచైనా ఈ ఆరు రీచ్‌ల నుంచి ఇసుకను పొందవచ్చని చెప్పారు. మీ సేవలో డబ్బు చెల్లించిన అనంతరం జిల్లా అధికారులు నిర్ణయించిన ధరల ప్రకారం గూగుల్ మ్యాప్‌లో ఉన్న దూరాన్ని బట్టి కంప్యూటర్ సిస్టమ్ మొత్తం ఎంత చెల్లించాలో నిర్ణయిస్తుందన్నారు. జిల్లాలోని 6 రీచ్‌లలో ఒకరోజుకి 5-6 వేల క్యూబిక్ మీటర్ల ఇసుక లభిస్తుందని, దాని ప్రకారం ఇసుకను లోడు చేస్తారన్నారు.
వాహన రిజిస్ట్రేషన్ తప్పనిసరి..
ఇసుక రవాణా చేయదలుచుకున్న వాహనాలు తప్పక రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని, రిజిస్ట్రేషన్ లేని వాహనాలను రీచ్‌ల వద్దకు అనుమతించరని జేసీ చెప్పారు. ఒక్కో క్యూబిక్ మీటర్ ఇసుకకు రూ.600 చెల్లించాలన్నారు. ట్రాక్టర్లకు ప్రతి 5 కి.మీ. వరకు రూ. 400, ప్రతి 10కి.మీ వరకు రూ.600, అంతకు మించితే కి.మీ.కి రూ. 28 అదనంగా చెల్లించాలని తెలిపారు.
ఆరు టైర్ల లారీకి పది కిలోమీటర్ల వరకు రూ. వెయ్యి, అదనంగా ప్రతి కిలోమీటరుకు రూ. 80, పది టైర్ల లారీకి పది కిలోమీటర్ల వరకు రూ. 1400, ఆపైన ప్రతి కిలోమీటరుకు రూ. 100 అదనంగా చెల్లించాలని చెప్పారు. లారీ అసోసియేషన్ నాయకులతో చర్చించి వారి అభీష్టం మేరకే ఈ ధరలు నిర్ణయించామన్నారు. వినియోగదారుడు ముందుగా చెప్పే ఇసుక దిగుమతి చిరునామాకు, నిర్ణయించిన కిలోమీటర్లకు అవసరమైన సమయాల్లో మూడు కిలోమీటర్లు సడలింపు ఇస్తామని వెల్లడించారు.
సబ్ కమిటీ పర్యవేక్షణ
జిల్లా అధికారులు ఇతర సంఘాలతో ఏర్పడే సబ్ కమిటీ ఇసుక రవాణాలో అక్రమాలు జరగకుండా పర్యవేక్షణ చేస్తుందని, ధరల పెరుగుదలపై నిర్ణయాలు తీసుకుంటుందని జేసీ వివరించారు. జిల్లాలో ఇసుక రవాణాను ఆర్గనైజింగ్ సెక్టారులోకి తేవడం వల్ల లారీ ఇసుక ధర రూ.12 వేల నుంచి రూ.6,500 కు తగ్గేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. త్వరలో గుంటూరులో స్టాకు పాయింటును తెరుస్తామని అక్కడ 1-2 క్యూబిక్ మీటర్ల ఇసుకను వినియోగదారులు తీసుకెళ్లవచ్చని చెప్పారు. రెండు నెలల్లో హైదరాబాద్‌లో కాల్ టాక్సీలాగా ఇసుకను వినియోగదారులు పొందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
నోటిఫికేషన్ తర్వాతే భూసేకరణ పనులు..
తుళ్ళూరు తదితర రాజధాని భూసేకరణ గ్రామాల్లో గ్రామ స్థాయిలో ఉన్న సమస్యలు పరిష్కరించడానికి 10 ప్రత్యేక టీములు నియమించామని జేసీ చెప్పారు. రెవెన్యూ రికార్డులన్నీ అప్‌డేట్ చేస్తున్నామన్నారు. భూసేకరణ ఫైలును అప్రూవల్ చే సి, అసెంబ్లీలో చర్చ అనంతరం యాక్ ్ట విడుదల చేస్తామన్నారు. ఆ తర్వాతే ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తుందని అప్పుడే భూసేకరణ అసలు పనులు ప్రారంభం అవుతాయని చెప్పారు. సమావేశంలో పీడీ ప్రశాంతి పాల్గొన్నారు.