♦ వీఆర్‌ఓ, వీఆర్‌ఏలదే బాధ్యత
♦ కలెక్టర్ హెచ్చరిక
నర్సాపూర్: జిల్లాలో ఇసుకను అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రాస్ హెచ్చరించారు. శుక్రవారం సాయంత్రం ఎంపీపీ కార్యాలయంలో అభివృద్ధి, ఇతర అంశాలపై ఆయన సమీక్షించారు. అనుమతులు లేకుండా ఇసుకను రవాణా చేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేంది లేదని హెచ్చరించారు. ఇసుకను అక్రమంగా రవాణ చేసే వాహనాలను సీజు చేస్తామని, రూ. లక్ష వరకు జరిమానా విధిస్తామన్నారు. ఇసుక రవాణాను వీఆర్‌ఓ, వీఆర్‌ఏలు అడ్డుకోవాలని, అక్రమ రవాణా జరిగితే వీరే బాధ్యత వహించాలన్నారు. వాల్టా చట్టం అమలులో భాగంగా కేసులు నమోదు చేయాలని అక్కడే ఉన్న సీఐ తిరుపతిరాజును కలెక్టర్ ఆదేశించారు. ఇసుక ఇష్టానుసారంగా తీయడంతో భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయని, ఇసుక ఉన్న వాగులను అధికారులు గుర్తించారని ఆయా వాగులలో అధికారుల సూచనల ప్రకారం ఇసుకను తీయాలని ఆయన ప్రజలకు సూచించారు.
సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి మాట్లాడుతూ కలెక్టర్ జిల్లా అభివృద్ధికి పాటుపడుతున్నారని కితాబునిచ్చారు. వాటర్‌గ్రిడ్ పథకం ద్వారా డిసెంబరు 31 నాటికి నియోజకవర్గంలోని మూడు మండలాల్లో నల్లాల ద్వారా మంచి నీరు సరఫరా చేస్తామన్నారు. ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ విజయప్రకాష్ మాట్లాడుతూ వాటర్‌గ్రిడ్ పథకం అమలును వివరించారు. జెడ్పీ చైర్‌పర్సన్ రాజమణిమురళీయాదవ్, జెడ్పీ సీఈఓ వర్షిణి, మెదక్ ఆర్‌డీఓ మెంచు నగేష్, ఎంపీపీలు శ్రీనివాస్‌గౌడ్, హరికృష్ణ, పద్మ, జెడ్పీటీసీలు కమల, జయశ్రీ పాల్గొన్నారు.