ఎంత నిర్లక్ష్యం?
మొద్దు నిద్రలో స్థానిక సంస్థలు
నిధులున్నా ఖర్చుచేయని వైనం
ఐదేళ్లలో ఖర్చు చేసింది 40 శాతమే
మూలుగుతున్న 13వ ఆర్థిక సంఘం నిధులు
15 శాతం నిధులు దారి మళ్లింపు..
నిబంధనలకు విరుద్ధంగా 20 శాతం ఖర్చు
స్టేట్ ఆడిట్ విభాగం ఆడిటింగ్‌లో గుర్తింపు
మౌలిక సదుపాయాల కల్పనలో స్థానిక సంస్థలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. చేతిలో నిధులు ఉన్నా ఖర్చు చేయడంలో మొద్దునిద్ర పాటి స్తున్నాయి. ఆర్థిక సంఘం నిధులను ఖర్చు చేయడంలో స్థానిక సంస్థల నిర్లక్ష్యం.. అలసత్వం స్టేట్ ఆడిట్ నివేదికలో మరోసారి తేటతెల్లమైంది. 13వ ఆర్థిక సంఘం నిధుల్లో కనీసం 40 శాతం కూడా ఖర్చుకాని దుస్థితి విశాఖ జిల్లాలో నెలకొంది. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఏకంగా 60 శాతానికి పైగా నిధులు ఖర్చుకాకుండా మిగిలిపోయాయి. ఖర్చు చేసిన నిధుల్లో కూడా 15 శాతం దారి మళ్లినట్టు గుర్తించిన ఆడిట్ విభాగం.. మరో 20 శాతం నిధులు నిబంధనలకు విరుద్ధంగా ఖర్చుచేసినట్టు లెక్క తేల్చారు.
సాక్షి, విశాఖపట్నం:
స్థానిక సంస్థలైన నగర, పురపాలక సంస్థలు, జెడ్పీ, మండల ప్రజాపరిషత్‌లు, పంచాయతీల్లో ప్రజలకు కనీస మౌలిక సదుపాయాల కల్పనకు ఏటా కేంద్ర ప్రణాళికా సంఘం ఆదేశాల మేరకు ఆర్థిక సంఘం నిధులు జమవుతాయి.13వ ఆర్థిక సంఘం నిధులన్నీ ఆయా స్థానిక సంస్థలకు జనాభా ప్రాతిపదికన నిధులు జమచేసేది. ఈ నిధులను మంచినీటి సరఫరా, అంతర్గత రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ నిర్వహణ, వ్యర్థాల నిర్వహణ, ప్రభుత్వ భవనాల మరమ్మతులు, కార్యాలయాల కంప్యూటరైజేషన్ కోసం ఖర్చు చేసుకునే వీలుంది.
అంతా నిబంధనలకు విరుద్ధమే..
జిల్లాలో 2010-11 నుంచి 2014-15 వరకు స్థానిక సంస్థలకు కేంద్రం విడుదల చేసిన 13వ ఆర్థిక సంఘం నిధుల్లో 40 శాతం ఖర్చుచేస్తే వాటిని కూడా పూర్తిగా మంచినీటి సరఫరా, అంతర్గత సీసీ రోడ్లకే పరిమితం చేసింది. మిగిలిన నాలుగు అంశాల్లో ఏ ఒక్క దానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేసిన పాపాన పోలేదు. పైగా 15 శాతానికి పైగా నిధులను విద్యుత్, టెలిఫోన్ ఇతర బిల్లుల చెల్లింపులకు ఖర్చు చేశారు. మరో 20 శాతం నిధులను ఆర్థిక సంఘం మార్గదర్శకాలకు విరుద్ధంగా హుద్‌హుద్ పునర్నిర్మాణ కార్యక్రమాల కోసం సర్కార్ దారిమళ్లించినట్టు స్టేట్ ఆడిట్ విభాగం గుర్తించింది.
జీవీఎంసీ తీరు ఇలా..
13వ ఆర్థిక సంఘం నుంచి 2010-11 నుంచి 2014-15 వరకు జీవీఎంసీకి రూ.111.29 కోట్లు గ్రాంట్ రిలేజ్ చేస్తే రూ.103.13 కోట్లు నిధులు జమైతే ఖర్చు చేసింది రూ.38.08 కోట్లు మాత్రవే. వడ్డీతో కలుపుకుని ప్రస్తుతం జీవీఎంసీ వద్ద రూ.66.18 కోట్లు మూలుగుతున్నాయి. కొత్తగా ఏర్పడిన యలమంచలి, నర్సీపట్నం నగర పంచాయతీ లకు 2014-15లో రూ.8.06 కోట్లు గ్రాంట్ మంజూరైతే రూ.7.15 కోట్లు జమకాగా రూ.1.47కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఈ రెండు మున్సి పాల్టీల్లో రూ.5.68కోట్లు మూలుగుతున్నాయి.
స్థానిక సంస్థల్లోనూ ఇదే పరిస్థితి
జెడ్పీకి ఐదేళ్లలో రూ.41.36కోట్లు గ్రాంట్ రిలీజ్ అయితే రూ.39.04 కోట్లు జమైంది. కానీ ఖర్చు చేసింది రూ.11.64కోట్లు మాత్రమే. ఇంకా జెడ్పీ వద్ద రూ.27.40 కోట్లు మూలుగుతున్నాయి. మండల పరిషత్‌లకు రూ.20.07 కోట్ల గ్రాంట్ మంజూరైతే, రూ.16.78కోట్లు జమకాగా ఖర్చు చేసింది 5.53 కోట్లు మాత్రమే. ఇంకా మండలాల వద్ద మరో రూ.11.26 కోట్లు ఉన్నాయి. ఇక పంచాయతీలకు ఐదేళ్లలో రూ.193.39కోట్లు విడుదలకాగా రూ.148.64 కోట్లు జమైంది. కానీ ఖర్చు చేసింది రూ.67.47 కోట్లు మాత్రమే. ఇంకా పంచాయతీల వద్ద రూ.81.16 కోట్లు మిగిలిపోయాయి. ఇలా మొత్తం స్థానిక సంస్థలు ఐదేళ్లలో విడుదలైన 13వ ఆర్ధిక సంఘం నిధుల్లో రూ.124.22 కోట్లు ఖర్చు చేస్తే ఇంకా రూ.191.67కోట్లు మూలుగుతున్నాయి.