భానుగుడి(కాకినాడ), న్యూస్‌లైన్ : ‘పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ఈ ఏడాది జిల్లాను రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిపి నందుకు అభినందనలు. ఇదే స్ఫూర్తిని కొనసాగించండి’ అని కలెక్టర్ నీతూప్రసాద్ ఉపాధ్యాయలకు సూచించారు. వంద శాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలల ఉపాధ్యాయులను శుక్రవారం కలెక్టర్ నీతూప్రసాద్ సత్కరించారు. జిల్లాలోని ప్రధానోపాధ్యాయుల సమావేశం శుక్రవారం కాకినాడ అంబేద్కర్‌భవన్‌లో డీఈఓ కేవీ శ్రీనివాసులు రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఆ సమావేశంలో కలెక్టర్ నీతూప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
తొలుత ఉపాధ్యాయులు వందేమాతర గీతం ఆలపించారు. జ్యోతి ప్రజ్వలన, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేయడంతో కార్యక్రమం ప్రారంభమైంది. కలెక్టర్ మాట్లాడుతూ క్రమశిక్షణ, సమయపాలనలే జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపాయన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని సూచించారు. నిరంతర మూల్యాంకన విధానంపై శ్రద్ధ వహించాల న్నారు. డీఈఓ కేవీ శ్రీనివాసులు రెడ్డి విద్యావ్యవస్థను ప్రగతిపథంలో నడిపించారని కలెక్టర్ కొనియాడారు.
172మంది ఉపాధ్యాయులకు సత్కారం
వందకు వందశాతం ఉత్తీర్ణత సాధించిన 172 మంది ప్రధానోపాధ్యాయులను కలెక్టర్ ఘనంగా సత్కరించారు. దుశ్శాలువా, మెమెంటోలను అందజేసి అభినందించారు. రాయవరం(137), సామర్లకోట(128), కపిలేశ్వరపురం( 122), ప్రత్తిపాడు(117), సఖినేటిపల్లి( 106), కాజులూరు(104), పిఠాపురం(100), గోకవరం(103) మంది విద్యార్థులు అధికంగా గల పాఠశాలలుగా నిలిచాయి. జిల్లాలో పదికి పదిపాయింట్లు సాధించిన 29మంది విద్యార్థులకు కలెక్టర్ నీతూప్రసాద్ ప్రశంసాపత్రం,మెమెంటోలను అందజేసి సత్కరించారు. కాకినాడ కార్పొరేషన్‌లో 2 పాఠశాలలు, గండేపల్లి మండలంలో 3 జెడ్పీ ఉన్నతపాఠశాలలు, కరప మండలంలో 2 జెడ్పీ పాఠశాలలు, పెద్దాపురం మండలంలో 3, తాళ్లరేవు మండలంలో 3 జెడ్పీపాఠశాలలు, ఏలేశ్వరం మండలంలో 2 జెడ్పీ పాఠశాలల్లో విద్యార్థులు పదికి పదికి జీపీఏ పాయింట్లు సాధించారు.
మారిన సిలబస్‌పై సమీక్ష
మధ్యాహ్నం సెషన్‌లో 9,10 తరగతులకు సంబంధించి మారిన పాఠ్యపుస్తకాల సిలబస్‌కు సంబంధించి ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డీఈఓ కేవీ శ్రీనివాసులు రెడ్డితో సహా పలువురు అధికారులు ఉపాధ్యాయుల సందేహాలను నివృత్తి చేశారు. ఏజేసీ మార్కండేయులు, ఆర్జేడీ ఆర్.ప్రసన్నకుమార్, ఏజెన్సీ డీఈఓ రాజీవ్ తదితరులు పాల్గొన్నారు.
ఇదే స్ఫూర్తిని కొనసాగించండి
Published Sat, Jun 7 2014 1:07 AM | Last Updated on Sat, Sep 2 2017 8:24 AM
Advertisement
Advertisement