ఆ ఆరుగురూ ఎంతో ప్రత్యేకం.. డిజిటల్‌ విధానంలో పరీక్ష పాసై చరిత్ర సృష్టించారు | Divyang Students Created History By Passing The Exam In Digital Model | Sakshi
Sakshi News home page

ఆ ఆరుగురూ ఎంతో ప్రత్యేకం.. డిజిటల్‌ విధానంలో పరీక్ష పాసై చరిత్ర సృష్టించారు

Published Sun, May 7 2023 9:01 AM | Last Updated on Sun, May 7 2023 10:36 AM

Divyang Students Created History By Passing The Exam In Digital Model - Sakshi

సాక్షి, అమరావతి: దేశంలోనే తొలిసారిగా డిజిటల్‌ విధానంలో సహాయకులు (స్క్రైబ్‌) లేకుండా పదో తరగతి పరీక్షలు రాసిన దృష్టిలోపం ఉన్న విద్యార్థులందరూ ఉత్తీర్ణత సాధించడంపై విద్యాశాఖ అధికారులు వారికి అభినందనలు తెలిపారు. వీరందరూ ఎంతో ప్రత్యేకమని వారు అభివర్ణించారు. అనంతపురం జిల్లాలోని రూరల్‌ డెవలప్‌మెంట్‌ ట్రస్ట్‌ (ఆర్టీడీ) ఇన్‌క్లూజివ్‌ హైస్కూల్‌లో టెన్త్‌ చదివిన దృష్టిలోపం గల విద్యార్థినులు డిజిటల్‌ విధానంలో 2022–23 విద్యా సంవత్సరంలో పరీక్షలు రాశారు. వీరిలో పొలిమెర చైత్రిక, చెంచుగారి పావని, ఎక్కలూరు దివ్యశ్రీ, మేఖ శ్రీధాత్రి, ఏకుల సౌమ్య, ఉప్పర నాగరత్నమ్మ ఉత్తీర్ణత సాధించారు. వారికి పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రవీణ్‌ప్రకాష్, కమిషనర్‌ ఎస్‌. సురేష్‌కుమార్, సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు విద్యార్థులకు అభినందనలు తెలిపారు.  

తొలి ప్రయోగంతోనే చక్కటి విజయం  
ఏపీ విద్యాశాఖ తొలిసారిగా పదో తరగతి దివ్యాంగ (దృష్టి లోపం) విద్యార్థులను డిజిటల్‌ విధానంలో పరీక్షలు రాయించేందుకు సిద్ధంచేసింది. వారు ల్యాప్‌టాప్‌లో హిందీ మినహా మిగతా సబ్జెక్టులన్నీ స్వయంగా డిజిటల్‌ విధానంలో రాయడానికి కేవలం 45 రోజుల్లో సిద్ధమయ్యారు. ఈ విద్యార్థులకు ప్రత్యేకంగా డిజిటల్‌గా ప్రశ్నపత్రాలను రూపొందించారు. దేశంలో ఇలాంటి విద్యార్థులకు డిజిటల్‌ విధానంలో పరీక్షలు రాసే సౌలభ్యం ఎక్కడా కల్పించలేదు. తొలిసారిగా ఏపీలో ఈ తరహా పరీక్షలు విజయవంతంగా నిర్వహించి, ఉత్తమ ఫలితాలు సాధించి చరిత్ర సృష్టించారు. ఈ విద్యార్థుల కోసం ‘నాన్‌ విజిబుల్‌ డెస్క్‌టాప్‌ యాక్సెస్‌’ (ఎన్‌వీడీఏ) సాఫ్ట్‌వేర్‌తో ప్రశ్నలను విని సమాధానాలు టైప్‌ చేశారు. డిజిటల్‌ పరీక్షల్లో విజయం 
సాధించడంతో భవిష్యత్‌లోను వారు పోటీ పరీక్షలు స్వయంగా రాయడానికి నాంది పలికారు.

అందరికీ ఆదర్శనీయం 
ప్రయత్నమే విజయానికి దారి చూపుతుంది. దివ్యాంగ విద్యార్థులైనా కంప్యూటర్‌ ద్వారా పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించడం ఆదర్శనీయం. మన రాష్ట్రంలో పాఠశాలలను డిజి­టల్‌గా మార్చేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఆలోచన  చేస్తోంది. దివ్యాంగ విద్యార్థులకు సమాన అవకాశాలు కల్పించేందుకు అంకితభావంతో ఈ ప్రభుత్వం పనిచేస్తోంది.  
– బొత్స సత్యనారాయణ, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement