కొనసాగిన ‘సమైక్య’ జోరు | Continued 'united' pace | Sakshi
Sakshi News home page

కొనసాగిన ‘సమైక్య’ జోరు

Published Fri, Nov 8 2013 1:50 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM

Continued 'united' pace

 

=రోడ్లన్నీ దిగ్బంధనం
 =కొనసాగిన ‘సమైక్య’ జోరు
 =స్తంభించిన రవాణా వ్యవస్థ
 =రోడ్లపైనే వంటావార్పు
 =స్వచ్ఛందంగా సహకరించిన ప్రజలు
 =పలుచోట్ల వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తల అరెస్ట్

 
సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన రోడ్ల దిగ్బంధనం కార్యక్రమం రెండోరోజూ విజయవంతమైంది. రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వ మొండివైఖరిని జనం తీవ్రంగా నిరసించారు. జిల్లా వ్యాప్తంగా చేపట్టిన రోడ్ల దిగ్బంధనం, వంటావార్పు, రాస్తారోకో కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. సమైక్యాంధ్ర ఆకాంక్షను చాటిచెప్పారు.
 
సాక్షి, విజయవాడ : సమైక్యాంధ్రను కాపాడుకోవడం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రెండోరోజు కూడా రహదారుల దిగ్బంధనం కార్యక్రమం విజయవంతంగా జరిగింది. దీంతో జిల్లా వ్యాప్తంగా రవాణా వ్యవస్థ స్తంభించింది. వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. ప్రజలు స్వచ్ఛందంగా ఆందోళనకు సహకరించారు. ఆందోళనకారులు రోడ్లపైనే వంటావార్పు నిర్వహించారు. కొన్ని చోట్ల ఆర్టీసీ సిబ్బంది కూడా వంటావార్పు కార్యక్రమంలో పాల్గొన్నారు. పలుచోట్ల వైఎస్సార్‌సీపీ నాయకులతో పాటు వందమందికి పైగా కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.
 
ఉదయభాను అరెస్ట్...

జగ్గయ్యపేట మండలంలోని గట్టు భీమవరం టోల్‌ప్లాజా సమీపంలో వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో జాతీయ రహదారిని దిగ్బంధించారు. ఎనిమిది గంటల నుంచి దాదాపు 12 గంటల వరకు రహదారిని దిగ్బంధించి సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు భానుతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేసి చిల్లకల్లు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

విజయవాడలో పార్టీ నగర కన్వీనర్ జలీల్‌ఖాన్ ఆధ్వర్యంలో గొల్లపూడి జూతీయరహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దీంతో విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై రెండువైపులా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో జలీల్‌ఖాన్‌తో పాటు 25 మంది కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త పి.గౌతంరెడ్డి ఆధ్వర్యంలో సింగ్‌నగర్ ఫ్లైఓవర్ వద్ద రాస్తారోకో నిర్వహించి, వంటావార్పు చేపట్టారు. రెండు గంటల పాటు రోడ్డుపై ఆటపాట నిర్వహించారు.

తూర్పు నియోజకవర్గంలో పార్టీ అధికార ప్రతినిధి చందన సురేష్ ఆధ్వర్యంలో కృష్ణలంక ఫైర్‌స్టేషన్ వద్ద జాతీయ రహదారిపై కార్యకర్తలు రాస్తారోకో జరిపారు. పోలీసులు 10 మంది కార్యకర్తలను అరెస్టు చేశారు. తిరువూరులో జాతీయరహదారిపై నియోజకవర్గ సమన్వయకర్త బండ్రపల్లి వల్లభాయ్ ఆధ్వర్యంలో రాస్తారోకో, వంటావార్పు కార్యక్రమాలు జరిగాయి. విజయవాడ - జగదల్‌పూర్ జాతీయరహదారిపై రెండుగంటలసేపు రాస్తారోకో నిర్వహించారు. ఈ నేపథ్యంలో పోలీసులు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను బలవంతంగా తొలగించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు జాతీయరహదారిపై కబడ్డీ ఆడారు. ఏకొండూరు మండలం కంభంపాడులో జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.
 
కైకలూరులో వెయ్యిమందితో...

 కైకలూరులో జాతీయ రహదారిపై వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వెయ్యిమందికి పైగా విద్యార్థులు, కార్యకర్తలు గంటపాటు రోడ్డు దిగ్బంధనం చేశారు. విద్యార్థులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాస్కులు ధరించి కార్యక్రమంలో పాల్గొన్నారు. పులిగడ్డలో 216 జాతీయ రహదారి దిగ్బంధనం కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గ సమన్వయకర్త సింహాద్రి రమేష్‌బాబు ఆధ్వర్యంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ కార్యక్రమం కొనసాగింది. రైతువిభాగం రాష్ట్ర కన్వీనర్ ఎంవీఎస్ నాగిరెడ్డి సంఘీభావం తెలిపారు.

రహదారిపై భోజనాలు చేసి నిరసన తెలిపారు. గుడ్లవల్లేరు, నందివాడ మండలాల్లో రహదారుల దిగ్బంధనం జరిగింది.  పామర్రులో రహదారుల దిగ్బంధనానికి పూనుకోగా పోలీసులు ముందుజాగ్రత్త చర్యగా పార్టీ నేతలు ఉప్పులేటి కల్పన, కుక్కల నాగేశ్వరరావులను అరెస్ట్ చేశారు. మైలవరంలో నియోజకవర్గ సమన్వయకర్త జ్యేష్ఠ రమేష్‌బాబు ఆధ్వర్యంలో స్థానిక మార్కెట్ యార్డు వద్ద విజయవాడ-భద్రాచలం జాతీయ రహదారిపై వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు బైఠాయించి రహదారిని దిగ్బంధించారు. వంటవార్పూ కార్యక్రమం నిర్వహించి రోడ్డుపైనే భోజనాలు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు జ్యేష్ఠ రమేష్‌బాబుతో పాటు మరో ఐదుగురు నేతలను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కి తరలించారు.
 
ఇబ్రహీంపట్నంలో వినూత్న నిరసన...

ఇబ్రహీంపట్నంలో నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు రింగ్ సెంటర్‌ను దిగ్బంధనం చేశారు. విభజనకు పాల్పడిన సోనియాగాంధీ, సహకరించిన చంద్రబాబు దిష్టిబొమ్మలను వేర్వేరు మంచాలపై పడుకోబెట్టి చీపుళ్లతో కొడుతూ నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో జోగి రమేష్‌తో పాటు మరో నలుగురు నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.    

కంచికచర్ల మండలం కీసర టోల్‌గేట్ వద్ద 65వ నంబరు జాతీయ రహదారిపై పార్టీ సమన్వయకర్త డాక్టర్ మొండితోక జగన్‌మోహనరావు ఆధ్వర్యంలో రోడ్డు దిగ్బంధనం చేపట్టారు. రోడ్డుపైనే దుస్తులు ఇస్త్రీ చేసి నిరసన తెలిపారు. దీంతో పోలీసులు ఆయనతోపాటు 19 మంది నేతలు, కార్యకర్తలను అరెస్ట్ చేశారు. నూజివీడులో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నూజివీడు-విస్సన్నపేట, నూజివీడు-మైలవరం, నూజివీడు-జంక్షన్, నూజివీడు-విజయవాడ రహదారులను దిగ్బంధించారు. గన్నవరం గాంధీబొమ్మ సెంటర్‌లో జాతీయ రహదారి, గన్నవరం-నూజివీడు రహదారిని దిగ్బంధించారు.

హనుమాన్‌జంక్షన్‌లో పార్టీ నేత దుట్టా రామచంద్రరావు ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై భారీ మానవహారం నిర్మించి రోడ్డు దిగ్బంధనం కార్యక్రమం నిర్వహించారు. బందరు నియోజకవర్గంలోని కోనేరు సెంటరులో నాలుగు వైపులా రోడ్లను దిగ్బంధించారు. మచిలీపట్నం నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

పెడన నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాల రాంప్రసాద్ ఆధ్వర్యంలో గూడూరు మండలంలో విజయవాడ- మచిలీపట్నం జాతీయ రహదారిపై రోడ్డు దిగ్బంధనం చేపట్టారు. ఉయ్యూరులో రోడ్లు దిగ్బంధించారు. గండిగుంట బైపాస్ వద్ద మూడుగంటలపాటు రాస్తారోకో చేశారు. ఉయ్యూరు ప్రధాన సెంటర్‌లో వంటావార్పు నిర్వహించి వినూత్న రీతిలో నిరసన తెలిపారు.  పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు పడమట సురేష్‌బాబు, తాతినేని పద్మావతి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement