కొర్రీ.. వర్రీ
పక్కా గృహాల మంజూరులో ఎడతెగని జాప్యం
జియోట్యాగింగ్ పేరుతో కొంతకాలం జాప్యం
తాజాగా మరికొన్ని నిబంధనలు
లబ్ధిదారుల సంఖ్య తగ్గించేందుకు యత్నాలు
రెండేళ్లుగా ఒక్క ఇల్లూ మంజూరు చేయని సర్కారు
మరో 6 నెలల వరకు అర్జీల పరిశీలనతోనే సరి
పేదల సొంతింటి ఆశలపై టీడీపీ ప్రభుత్వం నీళ్లు చల్లుతోంది. రైతు రుణమాఫీ మాదిరిగానే పక్కా గృహాల మంజూరుపై సాగదీత ధోరణితో వ్యవహరిస్తోంది. లబ్ధిదారుల ఎంపికలో సవాలక్ష ఆంక్షలు పెడుతోంది. ఇంటి అనుమతి కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు మొండిచేయి చూపే దిశగా అడుగులు వేస్తోంది.
మచిలీపట్నం : అంబేద్కర్ 125వ జయంతిని పురస్కరించుకుని విజయవాడ రూరల్ మండలం జక్కంపూడిలో ఈ నెల 14న నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పేదలకు సొంతింటి కల నెరవేరుస్తామని ప్రకటించారు. దీంతో సొంతింటి కోసం కలలు కంటున్న పేదల్లో ఆశలు చిగురించాయి. ప్రభుత్వం మాత్రం చెప్పేదొకటి, చేసేదొకటి అన్న చందంగా వ్యవహరిస్తోంది. దరఖాస్తు చేసుకున్న పేదలందరికీ పక్కా గృహాలు నిర్మిస్తామని చెబుతూనే తెర వెనుక మరో కథ నడుపుతోంది. గృహాల మంజూరులో ఆంక్షలపై ఆంక్షలు విధిస్తోంది.
రెండేళ్లుగా నాన్చుడే...
టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టి దాదాపు రెండేళ్లు కావస్తున్నా ఇంతవరకు ఒక్క పక్కా గృహాన్ని కూడా నిర్మించలేదు. లబ్ధిదారుల ఎంపిక సమయానికి ఏదోరకంగా ఆంక్షలను విధిస్తూ లబ్ధిదారుల సంఖ్యలో కోత పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. గతంలో పక్కా గృహాల నిర్మాణంలో లోటుపాట్లు జరిగాయని జియో ట్యాగింగ్ ద్వారా వాటిని గుర్తిస్తున్నామని కాలయాపన చేసింది. ఈ ప్రక్రియతో గృహనిర్మాణ సంస్థలో పనిచేసే అధికారులు, సిబ్బందికి అదనపు భారంతో పాటు ఖర్చు తడిసిమోపెడైంది. రెండేళ్లుగా పక్కా గృహాల నిర్మాణంపై దృష్టిసారించని ప్రభుత్వం.. తాజాగా మరిన్ని ఆంక్షలు తెరపైకి తెచ్చింది. నెలకు రూ.500కు మించి కరెంటు బిల్లు వచ్చినా, రేషన్ కార్డు, ఆధార్ కార్డులో పేరు, వివరాలు సక్రమంగా లేకున్నా అలాంటి వారికి పక్కా గృహం మంజూరు చేయబోమని నిబంధనల్లో పేర్కొంది.
మంజూరు ఎన్నో.. ఎప్పటికో!
టీడీపీ అధికారం చేపట్టిన తరువాత ఇందిరమ్మ గృహనిర్మాణ పథకానికి బదులుగా ఎన్టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణ పథకంగా పేరును మార్పు చేసింది. జిల్లాలో 12 నియోజకవర్గాలకు ఒక్కొక్క నియోజకవర్గానికి 1250 గృహాలు చొప్పున 15 వేలు, మచిలీపట్నం రూరల్ మండలానికి మరో 500 కలిపి మొత్తం 15,500 ఇళ్లను 2015-16 ఆర్థిక సంవత్సరంలో మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. వాటిలో ఐఏవై పథకం ద్వారా 4,964, ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం ద్వారా 10,536 గృహాలను మంజూరు చేస్తున్నట్లు పేర్కొంది. అందులో ఎస్సీలకు 3,590, ఎస్టీలకు 1,406, ఇతరులకు 10,504 గృహాలను కేటాయిస్తున్నట్లు తెలిపింది. ఒక్కొక్క ఇంటికి ఎస్సీ, ఎస్టీలకు రూ.1.75 లక్షలు రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీగా, మరో లక్ష రూపాయలు రుణంగా అందజేసేందుకు నిర్ణయించింది. ఇతరులకు రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీగా రూ.1.25 లక్షలు, రుణంగా రూ.1.50 లక్షలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ప్రకటనలు ఆర్భాటంగానే ఉన్నా... అమలయ్యే పరిస్థితి కనిపించటం లేదు. రుణంగా ఇచ్చే సొమ్మును ఎలా ఇవ్వాలనే అంశంపై ఇంతవరకు స్పష్టత లేదని గృహనిర్మాణ సంస్థ అధికారులే చెబుతున్నారు.
వచ్చిన దరఖాస్తులు 1.09 లక్షలు
టీడీపీ అధికారం చేపట్టిన తరువాత జన్మభూమి, మా ఊరు రెండు విడతల్లో గృహనిర్మాణం కోసం 1,09,425 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 1,08,981 దరఖాస్తులను పరిశీలించారు. 64,400 మందిని అర్హులుగా గుర్తించారు. మిగిలిన 44,581 మందిని అనర్హులుగా తేల్చారు. అర్హత కలిగిన వారికి గృహమంజూరు చేస్తే 30 రోజుల వ్యవధిలో నిర్మాణం ప్రారంభించి ఆరు నెలల్లో నిర్మాణం పూర్తి చేయాలని షరతులు విధించారు. అసలు పక్కా గృహాల మంజూరు చేయడానికే అనేక నిబంధనలను ప్రభుత్వం పెడుతుండటంతో ఎప్పటికి గృహాల మంజూరుకు అనుమతులు వస్తాయోనని లబ్దిదారులు వాపోతున్నారు