సాక్షి ప్రతినిధి, అనంతపురం : రైతుకు అందాల్సిన సబ్సిడీ వేరుశనగ విత్తనం అక్రమదారి పడుతోంది. రైతులకు విత్తనాలు సరఫరా చేయాల్సిన పంపిణీ ఏజెన్సీలు విత్తనాలను అక్రమార్కుల పరం అవుతున్నాయి. వీరంతా అధికారపార్టీ అస్మదీయులు కావడంతో కొందరు వ్యవసాయాధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. శనివారం బ్రహ్మసముద్రంలో టీడీపీ జెడ్పీటీసీ సభ్యురాలి గోడౌన్‌లో జరిగిన సంఘటను నిశితంగా పరిశీలిస్తే... ఈ ఏడాది భారీ సంఖ్యలో సబ్సిడీ విత్తనం పక్కదారిపట్టినట్లు స్పష్టమవుతోంది. ఈ ఏడాది జిల్లాలో 3.28లక్షల క్వింటాళ్ల విత్తనాలను సరఫరా చేయాలని వ్యవసాధికారులు ప్రణాళికలు రచించారు.
అయితే మొదటి విడత పంపిణీ జిల్లాలో వివాదం రేపింది. విత్తనకాయలు నాసిరకంగా ఉన్నాయని వెనక్కి పంపారు. దీనికి బాధ్యుల్ని చేస్తూ ఓ ఏఓపై సస్పెన్షన్ వేటు వేయడం, మరో ఇద్దరు ఏడీలు, ఓఏఓకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దీనికి తోడు సరిపడా విత్తనం జిల్లాలకు చేర్చడంలో అధికారులు విఫలం కావడంతో విత్తనకాయలు రైతులకు అందక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వెరసి విత్తన పంపిణీ వ్యవహారంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని జిల్లాలో ప్రతిపక్షపార్టీలు ఆరోపిస్తున్నాయి. ఇంతలో విత్తనకాయలపై మరో కుంభకోణం బట్టబయలైంది.
గోడౌన్‌లో అక్రమ నిల్వలు:
బ్రహ్మసముద్రం మండలం నాగిరెడ్డిపల్లెలో ఓ పొలంలోని గోడౌన్‌లో 186 బస్లాల విత్తనకాయలను వ్యవసాయాధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ గోడౌన్ జెడ్పీటీసీ సభ్యురాలు గంగమ్మకు చెందింది. పైగా ఆమె కుమారుడు వెంకటేశు ఈ మండలంలో విత్తనకాయల పంపిణీ ఏజెన్సీ నిర్వహిస్తున్నాడు. రైతులకు పంపిణీ చేయకుండా అతను అడ్డదారిలో గోడౌన్‌కు తరలించారు. ఈ కాయలను ఇతర సంచుల్లోకి మార్చి విక్రయించేందుకు రంగం సిద్ధం చేశారు.
కాయలను వేరుసంచుల్లోకి మారుస్తుండగా అధికారులు తనిఖీ చేసి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఒక్క సంఘటన చాలు జిల్లాలో వేరుశనగ విత్తన పంపిణీ ఎలా సాగుతుందనేందుకు. ఇలా మొదటి విడతలో దాదాపు 7.5వేల క్వింటాళ్ల విత్తనకాయలు పక్కదారి పట్టినట్లు వ్వయసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి.
వ్యవసాయాధికారులు విఫలం:
విత్తన పంపిణీలో వ్యవసాయశాఖ అధికారుల వైఫల్యం పూర్తిగా కొట్టొచ్చినట్లు కన్పిస్తోంది. కనీసం వచ్చిన విత్తనకాయలను దుర్వినియోగం కాకుండా రైతులకు పంపిణీ చేయడంలో కూడా విఫలమయ్యారు. రైతులు సబ్సిడీ కాయలకు క్వింటాల్‌కు రూ.4940లు చెల్లించి కొనుగోలు చేస్తారు. వీటిని ఏజెన్సీలు బయటిమార్కెట్లో రూ.6,500లకు విక్రయిస్తున్నారు. అంటే ఒక్క క్వింటాపైన 1500 లాభం ఉంటుందన్నమాట.
ఇంకొందరు ఏజెన్సీ నిర్వహకులు మొదటి విడత విత్తనాలను పంపిణీ చేసినట్లు తప్పుడు రికార్డులు సృష్టించి, తిరిగి సంచులు మర్చేసి రెండో విడతలో పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ముందస్తు వర్షాలతో పంటసాగు చేద్దామని ఆశగా ఎదురుచూస్తే వ్యవసాయాధికారుల చేతుల్లో పూర్తిగా దగా పడుతున్నారు.
దొరికితే శిక్ష తప్పుదు: శ్రీరామమూర్తి, జేడీ, వ్యవసాయశాఖ
తప్పుడు రికార్డులు సృష్టించి మొదటి విడతలో పంపిణీ చేసిన విత్తనాలను రెండో విడతలో కూడా పంపిణీ చేస్తున్నట్లు తేలితే ఏజెన్సీలపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. గోడౌన్లను నిశితంగా తనిఖీ చేస్తాం. అక్రమాలు తేలితే ఎంతటి వారైనా కేసు నమోదు చేస్తాం.
పోరుకు సిద్ధం
అనంతపురం క్రైం : జిల్లాలో ఉన్న రైతులకు ఆదివారం సాయంత్రంలోగా సబ్సిడీ విత్తన వేరుశనగ కాయలు పంపిణీ చేయాలని వైఎస్సార్‌సీపీ రైతు విభాగం రాష్ర్ట కార్యదర్శి జి. కేశవరెడ్డి డిమాండ్ చేశారు. ఈ విషయంపై శనివారం ఆయన ఓ లేఖ విడుదల చేశారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులకు సబ్సిడీ కింద వచ్చే పనిముట్లు ఇవ్వలేదన్నారు. రైతుల విషయంలో బాబు సర్కారు పూర్తిగా నిర్లక్ష్యంగా ఉందన్నారు.
ప్రస్తుతం రైతులు దుక్కిదున్ని వేరుశనగ వేయడానికి సిద్ధంగా ఉన్నారని, ఇలాంటి పరిస్థితులలో రైతులకు విత్తన వేరుశనగ కాయలు సరఫరా చేయకుండా నిర్లక్ష్యంగా ఉన్నారన్నారు. రైతుల అవసరంలో సగం కూడా పంపిణీ చేయలేదని, చేసిన వాటిలోనూ 40 శాతానికి పైగా నాసిరకం ఉన్నాయన్నారు. నాణ్యమైన వేరుశనగ కాయలను నేటి సాయంత్రం లోగా రైతులకు సరఫరా చేయకుంటే కలెక్టరేట్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు.
విత్తన కాయల్లో అవినీతి పురుగులు
Published Sun, Jun 14 2015 1:50 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement