ఏలూరు (టూటౌన్) :‘మమ్మల్ని ఎన్నికలు జరపమనే హక్కు డీఆర్‌డీఏ పీడీకి లేదు. మండల సమాఖ్యల ఎన్నికలను సహకార శాఖ ద్వారా జరపాలి. మా పదవీ కాలాన్ని పొడిగించేలా అదేశించాల’ని ఇందిరా క్రాంతిపథం ఆధ్వర్యంలో జిల్లా సమాఖ్య ఉపాధ్యక్షురాలు కె.ధనలక్ష్మి, మరో 30 మంది మండల సమాఖ్య అధ్యక్షులు గత ఏడాది ఆగస్టులో హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై మిహ ళా సమాఖ్యలతోపాటు డీఆర్‌డీఏ అధికారుల వాదనలు విన్న హైకోర్టు తీర్పు వెలువరించింది. న్యాయమూర్తి సీవీ నాగార్జునరెడ్డి 2014 అక్టోబర్ 13న ఆదేశాలు జారీ చేస్తూ జిల్లా సహకార అధికారులకు సూచనలు ఇచ్చారు. సహకార శాఖ ఆధ్వర్యంలో గ్రామ సంఘాలకు, మండల సమాఖ్యలకు, జిల్లా సమాఖ్యకు ఎన్నికలు జరపాలని స్పష్టం చేశారు. దీనిపై అధికారులు ఇంతవరకూ స్పందించటం లేదని డ్వాక్రా మహిళలు ఆరోపిస్తున్నారు. జిల్లాలోని 48 మండలాల్లో 62వేల డ్వాక్రా గ్రూపులు ఉన్నాయి.
వీటికి సంబంధించి 2వేల 29 గ్రామ సంఘాలున్న్డాయి. అధికారులు ముందుగా గ్రామ సంఘాలకు ఎన్నికలు జరిపి, వాటిద్వారా మండల సమాఖ్యలను ఎంపిక చేయాల్సి ఉంటుంది. మండల సమాఖ్యలన్నీ కలిసి జిల్లా సమాఖ్యను ఎన్నుకోవాల్సి ఉంటుంది. వీటి పదవీ కాలం సంవత్సరమే కాగా, ఒక సభ్యురాలు రెండు పర్యాయాలకు మించి పదవిలో ఉండకూడదన్న నిబంధన ఉంది. కానీ.. నిబంధనలకు విరుద్ధంగా జిల్లా సమాఖ్య, మండల సమాఖ్య పదవీ కాలం 3 నుండి 4 సంవత్సరాలు పూర్తి చేశారు. అయినప్పటికీ అధికారులు మాత్రం పట్టించుకోకపోవటం ఆరోపణలు వినవస్తున్నాయి. కాగా, గతంలో డీఆర్‌డీఏ పీడీగా పనిచేసి దీర్ఘకాలం సెలవులో ఉన్న పులి శ్రీనివాసులు నెల రోజలు గడువు ఇచ్చి ఎన్నికలు జరుపుకోవాలని జిల్లా, మండల సమాఖ్యలకు ఆదేశాలు ఇచ్చారు. దీంతో సమాఖ్య ప్రతినిధులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఇటు సహకార అధికారులు గాని, అటు డీఆర్‌డీఏ అధికారులు గానీ తమకు పట్టనట్టు వ్యవహ రిస్తున్నారు.
అంతేకాకుండా జిల్లా, మండల, గ్రామ సమాఖ్యలు వాటి కార్యకలాపాలకు సంబంధించిన ఆడిట్ రిపోర్టులు ఎప్పటికప్పుడు జిల్లా సహకార అధికారి కార్యాలయంలో సమర్పించాల్సి ఉండగా, దీనిని కూడా సజావుగా అమలు చేయటం లేదు. జిల్లాలోని 62వేల గ్రామ సంఘాల్లో చాలా సంఘాలు డిఫాల్ట్ జాబితాలో ఉన్నాయి. జిల్లా సమాఖ్యకు సంబంధించి కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న సభ్యురాలికి సంబంధించి డ్వాక్రా గ్రూపు, గ్రామ సంఘం, మండల సమాఖ్య కూడా ఇదే కోవలో ఉన్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోవడానికి వెనుకాడుతున్నట్టు సమాచారం. జిల్లావ్యాప్తంగా ఇప్పటికే చాలా సంఘాల్లో పెద్దఎత్తున అవినీతి, అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. వీటిపై అధికారులు చర్యలు తీసుకోలేదు.
చర్యలు తీసుకుంటున్నాం
జిల్లాలోని మండల, గ్రామ, జిల్లా సమాఖ్యలకు ఎన్నికలు జరుపుకునేలా చర్యలు తీసుకుంటున్నాం. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో జిల్లా సహకార అధికారుల నేతృత్వంలో ఎన్నికలు జరపాల్సి ఉంది. ఇప్పటివరకూ 9 మండలాల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. ఈ నెల 19న సెర్ప్ అదికారులతో వీడియో కాన్ఫరెన్స్ ఉంది. ఆ సందర్భంలో స్పష్టమైన అదేశాలు వచ్చే అవకాశం ఉంది. జిల్లాలోని చాలావరకూ మండల సమాఖ్యల ఆడిట్ పూర్తయింది.
- ఎంఎస్‌ఎస్ వేణుగోపాల్, డీపీఎం
ఆదేశాలు ఇచ్చాం
హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లాలోని మండల, జిల్లా సమాఖ్యలకు ఎన్నికలు జరపుకోవాలని ఆదేశాలు జారీ చేశాం. అలాగే వీటిని పర్యవేక్షించాలని సంబంధిత డీఆర్‌లకు ఆదేశాలు ఇచ్చాం. దీంతోపాటు డీఆర్‌డీఏ అధికారులు సమాచారం ఇచ్చారు. సకాలంలో ఎన్నికలు జరపకపోతే ఆయా సమాఖ్యలపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. అలాగే ఆడిట్ రిపోర్టులను సక్రమంగా సమర్పించకపోతే కఠిన చర్యలు తీసుకుంటాం.
- డి.వెంకటస్వామి, డీసీవో
బేఖాతర్
Published Wed, Feb 18 2015 3:32 AM | Last Updated on Sat, Sep 2 2017 9:29 PM
Advertisement