
నెల్లూరులోని టీబీ సెంటర్‌లో ట్రూనాట్ యంత్రం ద్వారా పరీక్షలు చేస్తున్న సిబ్బంది
కరోనా మహమ్మారి విస్తరిస్తున్న తరుణంలో వైరస్ నిర్ధారణ శాంపిళ్లను వేగంగా పరీక్షించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కోవిడ్ – 19 కేసులు పెరగకుండా ప్రాథమిక దశలోనే చెక్ పెట్టేందుకు ట్రూనాట్ టెస్ట్ కిట్లను అందుబాటులోకి తీసుకొచి్చంది. ఈ ఆధునిక పరికరాలతో జిల్లాలో పరీక్షలను వేగంగా నిర్వహించి కేసులను త్వరితగతిన గుర్తించే అవకాశం లభించింది. తక్కువ వ్యవధిలో ఎక్కువ మంది శాంపిళ్లను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు జిల్లా అధికారులు. ఇందులో భాగంగా మూడురోజుల్లో వందకుపైగా పరీక్షలు నిర్వహించి ఫలితాలను చూపించారు.
సాక్షి, నెల్లూరు: రాష్ట్రంలో తొలి కరోనా పాజిటివ్ కేసు నెల్లూరులోనే నమోదైంది. అలాగే ఒక మృతి కూడా ఉంది. 50కి పైగా కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటి వరకు కరోనా నిర్ధారణ పరీక్షలకు సంబంధించిన శాంపిళ్లను తిరుపతి, పూణేకు పంపేవారు. అక్కడి నుంచి ఫలితాలు వచ్చేంత వరకు నిరీక్షించాలి్సన పరిస్థితులు ఉండేవి. ఫలితంగా వ్యాధి నిర్ధారణ జాప్యమయ్యేది. దీనికి చెక్ పెడుతూ ప్రభుత్వం ట్రూనాట్ టెస్ట్ కిట్లను అందుబాటులోకి తీసుకొచి్చంది. నెల్లూరులోనే ఎక్కు వ శాంపిళ్లను పరీక్షించి అందులో పాజిటివ్ వచ్చిన వాటిని మాత్రమే తిరుపతికి పంపి అక్కడ కూడా పాజిటివ్ వస్తే కరోనా కేసుగా నిర్ధారిస్తారు. ఇప్పటి వరకు 1,058 అనుమానితుల శాంపిళ్లను పరీక్షించగా, అందులో 56 మాత్రం పాజిటివ్‌గా నమోదయ్యాయి.
జిల్లాకు 300 ట్రూనాట్ కిట్లు
జిల్లాకు కోవిడ్ – 19 నిర్ధారణ (స్క్రీనింగ్ టెస్ట్) చేసే ట్రూనాట్ కిట్లను 300 వరకు పంపించారు. మూడు రోజులుగా 180 శాంపిళ్లు రాగా, అందులో 112 శాంపిళ్లను పరీక్షించగా ఐదుగురికి మాత్రమే పాజిటివ్‌గా వచ్చింది. వీటిని తిరుపతికి పంపించి అక్కడ మరోసారి టెస్ట్ చేసి ఆపై ఫైనల్ చేసి ప్రకటిస్తారు. నెగటివ్ వస్తే మాత్రం నెల్లూరులోనే ప్రకటిస్తారు. ఈ ప్రక్రియ నగరంలోని టీబీ ఆస్పత్రి ల్యాబ్‌లోనే జరుగుతోంది. గతంలో ట్రూనాట్ కిట్ల ద్వారా టీబీ నిర్ధారణ పరీక్షలను నిర్వహించేవారు. నెల్లూరులో 19 కిట్లు ఉండేవి. ఆయా కిట్ల ద్వారానే కరోనా టెస్ట్‌లు చేయాలని ప్రభుత్వం నిర్ణయించి, అందులో సాఫ్ట్‌వేర్‌ను మార్పు చేసి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.
పరీక్ష ఇలా..
ముందుగా కరోనా అనుమానితుల నుంచి సేకరించిన శాంపిళ్లు (స్వాబ్ తీసుకోవడం) వైరల్ లైక్సెస్ మీడియాలో పెట్టి ల్యాబ్‌కు తీసుకొస్తారు. వాటిని ఓపెన్ చేశాక ట్రూనాట్ మిషన్‌లో పెట్టి ఆర్‌ఎన్‌ఏ వైరస్‌ను ఐసొలేట్ చేస్తారు. తర్వాత దాన్ని చిప్‌లో పెట్టి లూసిన్ తయారు చేసి వైరల్ లోడ్ చేస్తారు. అందులో వైరస్ ఉందా.. ఒకవేళ ఉంటే అది ఏ స్థాయిలో ఉందో పరిశీలిస్తారు. పాజిటివ్ వస్తే ఆ శాంపిల్‌ను తిరుపతికి పంపించి స్విమ్స్‌లో పరీక్షిస్తారు. బీఎస్‌ఎల్ సేఫ్టీ ఉన్న చోటే పరీక్షలు నగరంలోని టీబీ కల్చర్ సెన్సివియట్ ల్యాబ్ (బయో సేఫ్టీ టూ) క్యాబిన్ ఉంటుంది. ఇక్కడ బీఎస్‌ఎల్ సేఫ్టీ లెవల్ ఉంటాయి.
112 శాంపిళ్లను పరీక్షించాం
కరోనా అనుమానితుల నుంచి 180 శాంపిళ్లు వ చ్చాయి. ఇందులో 112 శాంపిళ్లను పరీక్షించాం. వారిలో ఐదుగురికి పాజిటివ్ వచ్చింది. వీటిని తిరుపతికి పంపాం. ప్రభుత్వం ట్రూనాట్ కిట్లను 300 వరకు పంపించింది. వీటి ద్వారా నిత్యం వందల్లో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది.
– డాక్టర్ ప్రసాద్‌రావు, జిల్లా టీబీ కంట్రోల్ అధికారి
50 నిమిషాల్లోనే ఫలితాలు
నెల్లూరు(అర్బన్): జిల్లాకు ట్రూనాట్ ల్యాబ్ పరికరాలు రావడంతో ఇక ఇక్కడే పరీక్షలు జరిగి ఫలితాలు 50 నిమిషాల్లో వెల్లడి కానున్నాయి. ర్యాపిడ్ పద్ధతిలో పరీక్షలు నిర్వహించి పాజిటివ్ వచ్చిన వారి శాంపిళ్లను తిరిగి తిరుపతి పంపి ఆర్టీపీసీఆర్ పద్ధతిలో పరీక్షిస్తారు. అనంతరం పాజిటివ్ వచ్చినట్లు ప్రకటిస్తారు. నెగటివ్ వస్తే మాత్రం నూరు శాతం కరోనా లేనట్లే లెక్క. ఈ పరికరాలను మరిన్ని ఏర్పాటుచేసి జిల్లాలోని పలు మండలాల్లో పరీక్షలు చేయనున్నారు. కొత్తగా శిక్షణ పొందడం, ప్రత్యేక పద్ధతిలో నమూనాలను సేకరించాల్సి వస్తుండటంతో ఒక వ్యక్తి రోజుకు 40 మంది కన్నా అదనంగా శాంపిళ్లు సేకరించలేరు.
దీంతో మరింత మందికి శిక్షణ ఇచ్చి, ల్యాబ్ టెక్నీషియన్లను భారీ స్థాయిలో భర్తీ చేసేందుకు జిల్లా అధికారులు నోటిఫికేషన్ ఇచ్చి దరఖాస్తులు స్వీకరించారు. వీరిని రెండు, మూడు రోజుల్లోనే విధుల్లోకి తీసుకోనున్నారు. వీరు విధుల్లోకి వస్తే శాంపిళ్లను పెద్ద మొత్తంలో సేకరించనున్నారు. పెద్దాస్పత్రి, నారాయణలో మాత్రమే కాకుండా మరో 5 సీహెచ్‌సీల్లో పరీక్షలు చేయనున్నారు.