ప్రభుత్వ పథకాలపై నృత్య రూపకం (ఫైల్),ఓ వేడుకలో నృత్యం చేస్తున్న డ్యాన్సర్లు (ఫైల్ )
ఆడిందే ఆట.. పాడిందే పాట బ్రేక్‌డ్యాన్సు.. షేక్ డ్యాన్సు.. మిక్స్ చేస్తే బ్రేషే డ్యాన్సు లేదంటే బెల్లీ.. గిల్లీ.. పేరు ఏదైనా డీజే మ్యూజిక్ ప్లే అయితే కాళ్లు, చేతులకు కరెంటు పెట్టినట్లు యమ స్పీడ్‌గా కదులుతాయి చూసేవాళ్లకు కనుల విందు వారిని చూస్తుంటే డ్యాన్సర్లకు పసందు అయితే వారేవా.. అంటూ మోగే చప్పట్లకు ఇప్పుడు లాక్‌డౌన్ పడింది కొరియోగ్రాఫర్ల ఉపాధి గ్రాఫ్‌కు గండి పడింది! ఇప్పుడు ఓన్లీ ఆడియో ప్లే అవుతోంది వీడియో ఎప్పటికి రిలీజ్ అవుతుందో.. ఈ కళాకారులకు ఉపాధి ఎప్పుడు దొరుకుతుందో!!!
ఒంగోలు మెట్రో: గతంలో పెళ్లో మరేదో శుభకార్యమో అయితే అర్కె్రస్టాతో నెట్టుకొచ్చేవారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. డ్యాన్సర్లు ఓ టీంగ్‌గా ఏర్పడి ఈవెంట్‌లు చేయడం నడుస్తోంది. ఇలాంటి వారు నృత్యాలు చేసి కూలీతో పొట్టపోసుకుంటారు. అయితే లాక్‌డౌన్ వల్ల గడచిన మూడు నెలలుగా ఎలాంటి కార్యక్రమాలు జరగకపోవడంతో ఉపాధి లేక కొరియోగ్రాఫర్లు ఇబ్బందులు పడుతున్నారు.
జిల్లాలోని నాలుగు డివిజన్‌లలో వివిధ డ్యాన్స్ ట్రూపులు, గ్రూపుల్లో దాదాపు వెయ్యిమందికి పైగా డ్యాన్సర్లు ఉన్నారు. ఒంగోలులోనే 120 మంది వరకూ ఉన్నారు. ఈవెంట్స్ సమయాల్లో సినిమా పాటలకు స్టెప్పులు వేస్తూ తమ కుటుంబాలను పోషించుకుంటుంటారు. వేర్వేరు తరగతుల నుంచి డ్రాపవుట్లుగా మారి, ఉన్న కొద్దిపాటి అర్హతలకు ఏ ఉద్యోగమూ రాక తమకు వచ్చిన కళతో ఉపాధి పొందుతుంటారు. ఈ క్రమంలో కొందరు తెలివైన వాళ్లు ‘ఈవెంట్ మేనేజ్‌మెంట్’ సంస్థలు ఏర్పాటు చేసుకుని చిన్నా చితకా డ్యాన్సర్లను ఏకం చేసి కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. వచ్చే డబ్బులో ఒక్కో డ్యాన్సర్‌కు రు. 500 వరకు ఇస్తారు. పెళ్లి ఫంక్షన్‌లు, రిసెప్షన్‌లు తదితర పలు కార్యక్రమాల ఆధారంగా వీరు జీవనం సజావుగా సాగేది.
అయితే మార్చి రెండో వారం నుంచి దేశవ్యాప్తంగా మొదలైన లాక్‌డౌన్ వీరి పాలిట శాపంగా మారింది. చేద్దామంలే కూలి పనుల్లేక, పోదామంటే ఈవెంట్స్ లేక కష్టాల సుడిగుండంలో బతుకులీడుస్తున్నారు. కళాకారుల పట్ల ఉదారంగా ఉండి ఆదుకుంటున్న అనేక సేవా సంస్థలు వీరి ఊసే మరచిపోయాయి. కళాకారుల గుర్తింపు కార్డులు కూడా లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. అన్ని వర్గాలను ప్రభుత్వం ఆదుకుంటున్నట్టుగానే తమనూ ఆదుకోవాలని కోరుతున్నారు. డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ మాస్టర్స్ అసోషియేషన్ ప్రతినిధుల కోసం 9391781212 నంబర్‌ను సంప్రదించి ఆదుకోవాలని కోరుతున్నారు.
అనారోగ్యంతో బాధపడుతున్నా
డ్యాన్స్ కార్యక్రమాలు లేక కూలీకి వెళ్లాను, అక్కడ కాలుజారి పడిపోయాను. వెన్నెముక సమస్యతో ఇబ్బందులు పడుతున్నా. ప్రభుత్వం దయతో ఆదుకోవాలని విన్నవించుకుంటున్నా.
-రఘునాథ్
జగనన్నకు రుణపడి ఉంటాం..
ప్రభుత్వానికి సంబధించి అనేక ఈవెంట్స్ నిర్వహించాం. డ్యాన్స్ ద్వారా ఉపాధి పొందుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాం. ఇప్పుడు అవస్థలు పడుతున్నాం. అన్ని వర్గాల పేద ప్రజలను జగనన్న ఆదుకుంటున్నారు. అలాగే డ్యాన్సర్లుగా ఉపాధి పొందుతున్న మమ్మల్ని ఆదుకుంటే జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటాం.
– సురేష్ ఆరిగ
ప్రభుత్వం ఆదుకోవాలి
వివిధ ప్రభుత్వ కార్యక్రమాల ప్రచార సందర్భాల్లో కూడా మేము ఈవెంట్స్ నిర్వహించాం. అన్ని వర్గాల్లోని పేదలను ఆదుకుంటున్న మాదిరిగానే ప్రభత్వం మమ్మల్ని కూడా ఆదుకుని కాపాడాలి.
-వరుణ్
Comments
Please login to add a commentAdd a comment