అల్లిపురం(విశాఖ దక్షిణ): కరోనా వైరస్ ప్రభావం వల్ల పడిపోయిన చికెన్ ధరకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. మొన్నటి దాకా కరోనా ప్రభావంతో జనాలు చికెన్ తినాలంటేనే భయపడ్డారు. కనీస ధర లేక పోవడంతో యజమానులు ఫారాల్లో కోళ్లను గోతుల్లో పూడ్చిపెట్టారు. మరికొన్ని చోట్ల కోళ్లను ఉచితంగా పంచిపెట్టారు. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇలా కోళ్ల ఫారాల యజమానులు కోళ్లను బాగా తగ్గించుకోవడంతో పాటు కోడిపిల్లల ఉత్పత్తి కూడా తగ్గించుకున్నారు. మరో వైపు చికెన్ తినటం వల్ల కరోనా రాకపోగా వ్యాధినిరోధక శక్తి పెరుగుతుందని ప్రచారం సాగటంతో చికెన్‌కు డిమాండ్ పెరిగింది.
నెలరోజుల కిందట కిలో రూ.80
కిలో చికెన్ నెల కింద రిటైల్‌లో రూ.80, హోల్ సేల్‌గా రూ.30 కూడా పలికింది. అదే సమయంలో కోళ్లకు వ్యాధి సోకడంతో చాలా చోట్ల అవి చనిపోయాయి. చికెన్ తినటంతో కరోనా వస్తుందని వదంతులు ప్రచారం సాగడంతో అమ్మకాలు తగ్గాయి. తర్వాత చికెన్‌కు కరోనాకు సంబంధం లేదని ప్రచారం జరగడంతో ఇప్పుడు చికెన్ ధర అమాంతంగా పెరిగిపోయింది. వారం రోజుల కిందట కిలో చికెన్ రూ.320 కూడా అమ్మకాలు జరిగాయి. ప్రస్తుతం రూ.250 పలుకుతుంది. చికెన్ ధరలు అమాంతంగా పెరిగిపోవటంతో వినియోగదారులు విస్మయానికి గురవుతున్నారు.
ప్రభుత్వం చేయూత నివ్వడంతో వెలుగు
45 రోజుల కింద పౌల్ట్రీ పరిశ్రమ పరిస్థితి దిగజారింది. ప్రభుత్వం రవాణా సదుపాయాలు కల్పించడంతో పుంజుకుంది. రైతు బజార్లు, మార్కెట్లలో కోడిగుడ్లు విక్రయాలకు ఏర్పాట్లు చేయడంతో గుడ్ల వ్యాపారం జోరుగా సాగుతోంది.
కోడి గుడ్లుకు డిమాండ్
కోడిగుడ్లకు సైతం డిమాండ్ భారీ పెరిగింది. గుడ్లు అమ్మే దుకాణాల వద్ద సైతం వినియోగదారులు క్యూ కడుతున్నారు. డజను గుడ్లు ప్రస్తుతం రూ.60 పలుకుతోంది.
చికెన్‌కు డిమాండ్ పెరిగింది
చికెన్‌కు డిమాండ్ పెరిగింది. రెండు నిలల కిందట రోజుకు 50 నుంచి 60 కిలోలు మాత్రమే అమ్మకాలు జరిగేవి. ప్రస్తుతం రేటు పెరిగినా ఆదివారం సమయంలో 200 నుంచి 350 కిలోలు అమ్ముతున్నాం. ప్రస్తుతం హోటల్స్ లేక పోవడంతో అందరూ ఇంటి వద్దే చికెన్ వంటకాలు ప్రిపేర్ చేసుకుంటున్నారు. దీంతో చికెన్‌కు డిమాండ్ పెరిగింది.
–భీమవరపు శ్రీనివాస్(సీతంపేట శ్రీను),ఎస్.ఎస్.చికెన్స్
ఎన్నడూ ఈ రేట్లు చూడలేదు
చికెన్ కిలో రూ.100 పలకడం చూశాను. లాక్‌డౌన్ నేపథ్యంలో చికెన్ కిలో రూ.320 అమ్మడం మొదటి సారి చూశాను. ఎన్నడే ఈ రేట్లు చూడలేదు. ప్రభుత్వం పౌల్ట్రీ రంగానికి చేయూత నిస్తున్నా నిర్వాహకులు మాత్రం ధరలు పెంచుతున్నారు.
–మద్దాల వెంకట వర లక్ష్మి, పాతవెంకోజిపాలెం
Comments
Please login to add a commentAdd a comment