సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మంగళవారం సాయంత్రంనుంచి బుధవారం రాత్రి 7 గంటల వరకు కొత్తగా 42 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 525కు చేరింది. బుధవారం కొత్తగా కర్నూలు జిల్లాలో 19 కేసులు, పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాల్లో 8 కేసుల చొప్పున, వైఎస్సార్ జిల్లాలో 3, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 2, అనంతపురం, కృష్ణా జిల్లాల్లో ఒకటి చొప్పున కేసులు నమోదయ్యాయి. అలాగే ఐదుగురు మరణించగా, నలుగురు డిశ్చార్జి అయ్యారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా వైరస్ సోకి మరణించిన వారి సంఖ్య 14కు చేరగా, కోలుకుని డిశ్చార్జి అయినవారి సంఖ్య 20కి చేరింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 122కి చేరగా, కర్నూలు జిల్లాలో 110, నెల్లూరు జిల్లాలో 58, కృష్ణా జిల్లాలో 45కు చేరాయి. ప్రస్తుతం 491 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
అందుబాటులో 45 ఐసోలేషన్ వార్డులు
కరోనా వైరస్ నేపథ్యంలో ప్రభుత్వాసుపత్రుల్లో పడకల సంఖ్య పెంచడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన ఐసోలేషన్ వార్డులను అందుబాటులోకి తీసుకొచ్చింది. రాష్ట్ర మౌలిక వైద్యసదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్‌ఐడీసీ) పదిరోజుల్లో 45 ఐసోలేషన్ వార్డులను నిర్మించింది. ప్రస్తుతం కొన్ని వార్డుల్లోకి పేషెంట్లు కూడా వచ్చి చేరినట్టు అధికారులు వెల్లడించారు. వీటి వివరాలు చూస్తే...
► కాకినాడ, కర్నూలు, విశాఖపట్నం, విజయవాడ ప్రభుత్వాసుపత్రుల్లో ఇప్పటి వరకూ 45 ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు
► ఒక్కో వార్డు రూ.10 లక్షల వ్యయంతో నిర్మాణం
► పూర్తిగా నెగిటివ్ ప్రెజర్‌తో వార్డుల ఏర్పాటు
► నిర్మాణ దశలో మరో 90 వార్డులు, వీటిని త్వరగా పూర్తిచేసేందుకు కసరత్తు
► ఈ వార్డులన్నీ బోధనాసుపత్రుల్లోనే ఏర్పాటు
► భవిష్యత్తులో కూడా వీటిని ఉపయోగించుకునేలా నిర్మాణం
Comments
Please login to add a commentAdd a comment