సాక్షి, తాడేపల్లి : రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రణపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశానికి పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కరోనా వ్యాప్తిని నివారించేలా పటిష్ట చర్యలు చేపట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో ప్రజలను ఆందోళనకు గురిచేయవద్దని సూచించారు. సీఎం వైఎస్ జగన్‌తో భేటీ అనంతరం.. విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. గురువారం నుంచి ఏపీలో స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు, కోచింగ్ సెంటర్లకు సెలవులు ప్రకటించారు.
ఇందుకు సంబంధించి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడుతూ.. గురువారం నుంచి రాష్ట్రంలోని విద్యా సంస్థలకు సెలవులు ఇస్తున్నట్టు తెలిపారు. పదవ తరగతి పరీక్షలు మాత్రం యథాతథంగా జరుగుతాయని అన్నారు. హాస్టల్‌లో ఉన్న విద్యార్థులను దగ్గరుండి ఇళ్లకు పంపిస్తామని చెప్పారు. ఆర్టీసీ అధికారులతో మాట్లాడి బస్సులలో వారిని ఇంటికి చేర్చేలా ఏర్పాట్లు చేస్తామన్నారు.
ఏపీ ప్రభుత్వ చొరవతో స్వదేశానికి తెలుగు విద్యార్థులు..
కరోనా ఆందోళన నేపథ్యం మలేషియాలో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు బుధవారం రాత్రికి విశాఖపట్నం చేరుకున్నారు. ఫిలిప్పీన్స్‌లో మెడిసిన్ చదువుతున్న విద్యార్ధులు ఇండియాకు వచ్చేందుకు బయలుదేరి మలేషియా చేరకున్నారు. అక్కడ కరోనా ఆందోళనతో వారు స్వదేశానికి రావడానికి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విద్యార్థులు మలేషియాలో చిక్కుకుపోవడంతో వారి కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు విద్యార్థుల గోడును కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. తెలుగు విద్యార్థులను స్వదేశానికి తరలించేందుకు వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు చర్చలు జరిపారు.
చదవండి : ‘విదేశీ విమానాలను పూర్తిగా రద్దు చేయాలి’
Comments
Please login to add a commentAdd a comment