నిర్మానుష్యంగా గుంటూరులోని ఏటుకూరు రోడ్డు
సాక్షి, గుంటూరు: జిల్లాలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటి వరకు ఢిల్లీ వెళ్లి వచ్చిన వ్యక్తులకు, వారి క్లోజ్ కాంటాక్ట్‌లకే పరిమితమైన కరోనా ప్రస్తుతం ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌లకు సోకుతుండటంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. నరసరావుపేటలో ఒకే కుటుంబంలో ఐదుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఢిల్లీ వెళ్లి వచ్చిన వ్యక్తులతో కలిసి క్రోసూరులో ప్రార్థనల్లో పాల్గొన్న దాచేపల్లికి చెందిన వ్యక్తి కరోనా సోకి మృతిచెందాడు. ఇప్పడు అతని కుమారుడికి వైద్యం చేసిన ఆర్‌ఎంపీ డాక్టర్‌కు, టీ బంకు యజమాని, సన్నిహితుడికి కూడా పాజిటివ్ నిర్ధారణయ్యింది. ఈ క్రమంలోనే చిన్న పిల్లలు, మహిళలకు సైతం వైరస్ సోకుతుండటంతో జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, వృద్ధుల విషయంలో శ్రద్ధ వహించాలంటున్నారు.
గుంటూరు నగరంలో విజృంభణ
జిల్లాలో మంగళవారం 21 కొత్త కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 114కు చేరింది. వీటిల్లో 85 కేసులు గుంటూరు నగరంలోనే ఉన్నాయి. మంగళవారం కేసుల్లో ఒకరు విజయవాడకు చెందిన వ్యక్తి ఉన్నారు. ప్రధానంగా నగరంలోని ఆనందపేట, సంగడిగుంట, కుమ్మరిబజారు ప్రాంతాల్లో కరోనా వేగంగా వ్యాపిస్తోంది. ఇక్కడ ఇరుకు గదులు, కామన్ బాత్‌రూముల వినియోగం, జన సాంధ్రత అధికంగా ఉండటం కరోనా వ్యాప్తికి కారణాలవుతున్నాయి. ప్రత్యేక పారిశుద్ధ్య పనులు గుంటూరు నగరంలో కరోనా వ్యాధి వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో అధికారులు పారిశుద్ధ్య పనులను ముమ్మరం చేశారు. నగరంలో డిజిన్ఫెక్షన్‌లో భాగంగా డీహెచ్‌ఎల్ కంపెనీకి చెందిన ఇన్‌స్టల్ స్ప్రేయర్‌తో తక్కువ సమయంలో 15 మీటర్ల దూరం మేర సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. ఢిల్లీ, ముంబాయి వంటి మహానగరాల తరహాలో శానిటేషన్ నిర్వహణను చేపడుతున్నారు.
జిల్లాలో వ్యవసాయ పనులకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా నిలిచిపోయిన శనగలు, కందుల ఉత్పత్తుల కొనుగోళ్లను మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ప్రస్తుతం మొక్క జొన్న, జొన్న, వరి ధాన్యానికి సంబంధించి నూర్పుడులు వేగంగా సాగుతున్నాయి. పొలాల్లో మిర్చి కోతలు సైతం మధ్యాహ్నం వరకు సాగిస్తున్నారు. రైతులకు కనీస మద్దతు ధర లభించేలా 68 మొక్కజొన్న, 60 వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పంటలను కొనుగోలు చేయనున్నారు. రైతులు పంట ఉత్పత్తులను అమ్ముకునేందుకు గ్రామాల్లోని అగ్రికల్చర్ అసిస్టెంట్ వద్ద పేర్లు నమోదు చేసుకుంటున్నారు. కంటైన్మెంట్ ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన అన్ని రకాల నిత్యావసర వస్తువులను ఇంటి వద్దకే అందిస్తున్నారు. రెడ్‌జోన్ ప్రాంతాల్లో ప్రజలు ఇంటి నుంచి బయటకు రావడాన్ని నిషేధించారు.
20 బృందాలతో శాంపిళ్ల సేకరణ:
కరోనా వైరస్ సామూహిక వ్యాప్తిని అరికట్టడానికి అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు. డోర్ టు డోర్ సర్వే ద్వారా అనుమానిత లక్షణాలు ఉన్నవారిని గుర్తించి వైద్య అధికారుల సూచన మేరకు శాంపిళ్లు సేకరిస్తున్నారు. ర్యాండమ్‌గా కరోనా పరీక్షలు నిర్వహించేందుకు వీలుగా స్వాగ్ సేకరణకు కియోస్కులను సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో విస్తృతంగా నమూనాల సేకరణకు 20 మొబైల్ బృందాలను ఏర్పాటు చేశారు. రెడ్‌జోన్ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిసారించారు.
మంగళవారం గుంటూరు నగరంలోని ఆనందపేట, శ్రీనివరవుపేట, సంగడిగుంట, కొరిటపాడు, కుమ్మరిబాజార్ సహా, పొన్నూరు, నరసరావుపేట, దాచేపల్లి ప్రాంతాల్లో సుమారు వెయ్యి మందికి పైగా వ్యక్తుల నుంచి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపినట్టు సమాచారం. ప్రాథమికంగా ఒకట్రెండు రోజుల్లో ట్రూనాట్ పరికరం ద్వారా కరోనా వైరస్‌ను సులువుగా నిర్ధారించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ట్రూనాట్ పరీక్ష కేంద్రాలు గుంటూరు, మాచర్ల, నరసరావుపేట, తెనాలిల్లో ఏర్పాటు చేయాలని కలెక్టర్ వైద్యాధికారులను ఆదేశించారు.
దాచేపల్లి బీ అలెర్ట్ :
దాచేపల్లిలో ఆర్‌ఎంపీ డాక్టర్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో అతని వద్ద వైద్యం చేయించుకున్న వారి వివరాలు సేకరించే పనిలో రెవెన్యూ, పోలీస్, వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది నిమగ్నమైయ్యారు. నారాయణపురం, నడికుడి, దుర్గాభవానీ కాలనీ, ఇరికేపల్లి, అలుగుమల్లెపాడు గ్రామాల్లో ఆర్‌ఎంపీ వద్ద గత పది రోజుల నుంచి వైద్యం చేయించుకున్న వారిని ప్రాథమికంగా గుర్తించారు. వీరిలో కొంత మంది స్వచ్ఛందంగా అధికారుల ముందుకు వచ్చారు. నారాయణపురంలో ప్రకటించిన రెడ్‌జోన్ ప్రాంతాల్లో ఆర్డీవో పార్థసారథి, డీఎస్పీ శ్రీహరిబాబు, తహసీల్దార్ గర్నేపూడి లెవీ, కమిషనర్ జాస్తి రామారావు పర్యటించారు.
Comments
Please login to add a commentAdd a comment