నిర్మానుష్యంగా ఇన్నర్ రింగ్ రోడ్డు
జిల్లాలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. రోజు రోజుకీ కరోనా పాజిటివ్ కేసులు పెరగడం కలకలం సృష్టిస్తోంది. సోమవారం కొత్తగా 11 కేసులు నమోదయ్యాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 93కి చేరింది. ఒక్క గుంటూరు నగరంలోనే 69 కేసులుండటం భయాందోళన కలిగిస్తోంది. కోవిడ్–19తో జిల్లాకు చెందిన నలుగురు వ్యక్తులు మృతి చెందారు. ఇంట్లోనే ఉండటం ద్వారా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయొచ్చని, స్వీయ నియంత్రణే మందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలంతా తమ ఇళ్లలోనే ఉంటూ వైరస్ వ్యాప్తి నుంచి రక్షణ పొందాలని సూచిస్తున్నారు.
సాక్షి, గుంటూరు: జిల్లాలో క్రమంగా విస్తరిస్తోన్న కరోనా వైరస్ వల్ల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. జిల్లాలో సోమవారం తాజాగా 11 కొత్త కేసులు నమోదు కాగా, జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 93కు చేరింది. ఆనందపేటలో నాలుగు, బుచ్చయ్యతోట ఒకటి, సూర్యాపేట నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. ఆనందపేటలో ఒకే కుటుంబంలో ముగ్గురికి కరోనా సోకవడం గమనార్హం. నరసరావుపేటలో గతంలో పాజిటివ్ సోకిన వ్యక్తి కుటుంబం సభ్యులకు ఐదుగురికి కరోనా ఉన్నట్లు తేలింది. జిల్లా వ్యాప్తంగా నమోదైన పాజిటివ్ కేసుల్లో పిల్లలు, మహిళలు ఉండటం విశేషం. జిల్లాలో నమోదైన కేసులన్నీ ఢిల్లీ లింకులతో సంబంధం ఉన్నవే. క్లోజ్, ప్రైమరీ కాంటాక్ట్, సెకండరీ కాంటాక్ట్‌లకే కరోనా వచ్చింది.
సరిసంఖ్య తేదీల్లో సరుకులు..
జిల్లా వ్యాప్తంగా డే బై డే సంపూర్ణ లాక్‌డౌన్ అమలు చేయాలని నిర్ణయించినట్లు కలెక్టర్ ఐ. శామ్యూల్ ఆనందకుమార్ తెలిపారు. గుంటూరు కలెక్టరేట్‌లో కరోనా ప్రత్యేక అధికారి బి.రాజశేఖర్, జిల్లా కలెక్టర్ ఐ. శామ్యూల్ ఆనందకుమార్, అడిషనల్ డీజీ ఉజ్వల్ త్రిపాఠి, ఐజీ ప్రభాకరరావు, అర్బన్ ఎస్పీ పి.హెచ్.డి.రామకృష్ణ, రూరల్ ఎస్పీ విజయరావు, జాయింట్ కలెక్టర్ దినేష్‌కుమార్, ట్రైనీ కలెక్టర్ నారపరెడ్డితోపాటు జిల్లా అధికారులతో సమావేశమై కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేకంగా చర్చించారు. ఇందులో ప్రధానంగా డే బై డే సంపూర్ణ లాక్‌డౌన్ అమలు చేయాలని నిర్ణయించారు.
బేసీ సంఖ్య ఉన్న తేదీల్లో పూర్తి లాక్‌డౌన్ అమలు చేస్తామని తెలిపారు. సరిసంఖ్య ఉన్న తేదీల్లో లాక్‌డౌన్‌ను ఉదయం 6 నుంచి 9 గంటల వరకు మినహాయించనున్నట్లు వారు తెలిపారు. ఆ రోజుల్లో దుకాణాలు తెరిచి ఉంటాయని పేర్కొన్నారు. సరుకులు కొనుగోలు చేసుకోవచ్చని పేర్కొన్నారు. పాజిటివ్ వచ్చిన క్లోజ్, ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌ల ను దాదాపుగా 800 మందిని గుర్తించారు. అందులో ఆదివారంనాటికి 600మందిని క్వారంటైన్ సెంటర్‌లకు తరలించారు. మిగిలిన వారిని సోమవారం సాయంత్రానికి తరలించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇద్దరు మృతి..
కరోనా పాజిటీవ్ నిర్ధారణ అయి విజయవాడ కోవిడ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గుంటూరుకు చెందిన ఇద్దరు వ్యక్తులు మృతి చెందినట్లు సమాచారం. దీంతో మొత్తం జిల్లాలో కరోనా మరణాల సంఖ్య నాలుగుకు చేరింది. ఇటీవల నరసరావుపేట చెందిన ఓ వ్యక్తి, దాచేపల్లి మండలానికి చెందిన మరో వ్యక్తి కరోనా పాజిటివ్‌తో మృతి చెందిన విషయం ఆందోళన కలిగిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment