ర్యాపిడ్ కిట్‌లను పరిశలిస్తున్న కలెక్టర్, డీఎంహెచ్‌ఓ తదితరులు
సాక్షి, గుంటూరు: జిల్లాలో కరోనా పాజి టివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో జిల్లా యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. సోమవారం మరో 20 కొత్త కేసులు నమోదు కావడంతో పాజిటివ్ కేసుల సంఖ్య 149కు చేరింది. తా జా కేసులన్నీ నరసరావుపేటలో నమోదవడం కలకలం రేపుతోంది. శనివారం వరకు ఎనిమిది కేసులకు పరిమితమైన నరసరావుపేటలో కేసుల సంఖ్య 28కి చేరింది. గుంటూరులో అత్యధికంగా 94 కరోనా పాజిటివ్ కేసులు ఉండగా, తరువాత స్థానంలో నరసరావుపేట నిలిచింది. నరసరాపేట కేసులు ప్రభుత్వం అధికారులను మరింత అప్రమత్తం చేశాయి. జిల్లా కోవిడ్ ప్రత్యేక అధికారి రాజశేఖర్, కలెక్టర్ ఐ.శామ్యూల్ ఆనంద్‌కుమార్, జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్‌తోపాటు ప్రత్యేక బృందాల అధికారులు సమావేశమై కరోనా కేసులపై సమీక్షించారు. నరసరావుపేటలో వరవకట్ట, రామిరెడ్డిపేటలో తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు.
కోవిడ్ ఆస్పత్రికి కరోనా రోగులు
నరసరావుపేటలో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణైన 20 మందిని ఎన్నారై కోవిడ్ ఆస్పత్రికి తరలించారు. పాజిటివ్ వచ్చిన వారితో సన్నిహితంగా మెలిగిన ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌లను అధికారులు గుర్తించారు. ప్రైమరీ కాంటాక్ట్‌లకు సంబంధించి గుర్తించిన 89 మందిని క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. సెకండరీ
కాంటాక్ట్‌లకు సంబంధించి గుర్తించిన 69
మందిని హోం క్వారంటైన్‌లో ఉంచారు. సోమవారం కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన వ్యక్తులకు గతంలో కరోనా సోకిన వ్యక్తి నుంచి వచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు. గతంలో కరోనా సోకిన వ్యక్తి నరసరావుపేటలోనే ఓ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఆ ఆస్పత్రి డాక్టర్‌కు, సిబ్బందికి కరోనా సోకింది. వారితోపాటు ఇంటి పక్కన ఉండేవారు, హాస్పిటల్‌లో ఆ రోగితో కలిసి ఉన్న మరో సాధారణ రోగికి సైతం కరోనా సోకడంతో నరసరావుపేటలోని వరవ కట్ట, రామిరెడ్డిపేట ప్రాంతాల్లో ప్రజలు ఆందో ళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో ర్యాపిడ్ టెస్ట్‌లు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాకు 12,590 ర్యాపిడ్ టెస్ట్ కిట్‌లు కూడా వచ్చాయి.
కఠినంగా ఆంక్షలు అమలు
జిల్లాలో లాక్‌డౌన్ నిబంధనలను అధికారులు మరింత పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఇంటి నుంచి ఎవరూ బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల ప్రకారం రెడ్‌జోన్ ప్రాంతాల్లో ఉన్న కార్పొరేషన్, మున్సిపాలిటీలు, మండలాల్లో పూర్తి స్థాయిలో లాక్‌డౌన్ అమలు చేసేందుకు వీలుగా ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశారు. రెడ్‌జోన్ పరిధిలోని మండలాలకు మున్సిపాలిటీలకు వచ్చే రహదారులన్నింటిలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. కంటైన్మెంట్ ప్రాంతాల్లో ఉండే ప్రజల ఇళ్ల వద్దకే నిత్యావసరాలు, కూరగాయలు పంపిస్తున్నారు. గ్రీన్ జోన్ ప్రాంతంలో ప్రజలకు ఆయా మండలాల పరిధిలో నిబంధనల ప్రకారం చిన్న చిన్న పనులు చేసుకునేందుకు మినహాయింపు ఇచ్చారు.
ప్రైవేటు వైద్యుల సేవలు
జిల్లాలో 82 ప్రైవేటు నెట్‌వర్క్ ఆస్పత్రులు ఉన్నాయి. కరోనా రోగులకు చికిత్స అందించేందుకు ఈ ఆస్పత్రుల వైద్యుల సేవలు వినియోగించుకోనున్నారు. రోగులకు సేవ చేసేందుకు చెస్ట్, కార్డియాక్, జనరల్ ఫిజీషియన్, అనస్థియా డాక్టర్ల అవసరం ఉంది. ప్రస్తుతం పాజిటివ్ కేసులకు ఎన్నారై ఆస్పత్రిలో చికిత్స చేస్తున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా గుంటూరు జీజీహెచ్‌లో కూడా కరోనా పాజిటివ్ రోగులకు చికిత్స అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రైవేటు వైద్యుల సేవలను షిఫ్టుల వారీగా వినియోగించుకోనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment