రెడ్‌జోన్ మంగళదాస్‌నగర్‌లో పీపీఈ కిట్లు ధరించి విధులు నిర్వహిస్తున్న పోలీసులు
సాక్షి, గుంటూరు: కరోనా వైరస్ విస్తరించకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ప్రత్యేకించి రెడ్‌జోన్ ప్రాంతాల నుంచి పాజిటివ్ కేసులు వ్యాప్తిచెందకుడా చూస్తున్నారు. ఈ మేరకు లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. ఆదివారం గుంటూరు జిల్లాలో 13 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో గుంటూరులో ఒకటి, నరసరావుపేటలో 12 కేసులు వచ్చాయి. మరో రెండు విజయవాడకు సంబంధించిన కేసులు రావడంతో మొత్తం సంఖ్య 224కు చేరింది. గుంటూరు నగరంలో కేసుల ఉధృతి కొంత తగ్గినట్లుగా అధికారులు భావిస్తున్నారు. కేసుల నమోదు రెడ్‌జోన్ ప్రాంతాలకే పరిమితమవుతోంది. నగరంలోని ఆరు కంటైన్మెంట్ ప్రాంతాల్లో గత 14 రోజులుగా కొత్త కేసులు రానట్లు సమాచారం. నరసరావుపేటలో కేసుల సంఖ్య పెరుగుతుండటంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ పట్టణంపై ఫోకస్ పెట్టారు.
క్వారంటైన్‌కు కాంటాక్ట్‌ల తరలింపు....
నరసరావుపేటలో కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్న నేపథ్యంలో ఆ కేసులకు సంబంధించిన కాంటాక్ట్‌లను క్వారంటైన్‌లకు తరలిస్తున్నారు. ప్రధానంగా కేసులు అధికంగా నమోదైన వరవకట్ట, రామిరెడ్డిపేట ప్రాంతాల్లో ఇప్పటికే అధికారులు పాజిటివ్ కాంటాక్ట్‌లను గుర్తించారు. వీరిని ట్విడ్‌కో గృహ సముదాయంలో 170 మందిని, నరసరావుపేట ఇంజినీరింగ్ కాలేజీలో 40 మంది, రెడ్డి హాస్టల్‌లో 30 మంది, తిరుమల ఇంజినీరింగ్ కాలేజీలో 15 మంది, నాయుడు సత్రంలో 30 మంది, కమ్మ సత్రంలో 15 మంది, శ్రీచైతన్య హాస్టల్‌లో 15 మంది, దాదాపు 319 మందికిపైగా కాంటాక్ట్‌లను క్వారంటైన్‌లో ఉంచారు. వీరందరికీ కరోనా పరీక్షలు చేస్తున్నారు. అలానే వరవకట్ట ప్రాంతంలో అధికారులు ర్యాపిడ్ టెస్టులు చేస్తున్నారు.
12 వేల మందికి పరీక్షలు చేయాలని లక్ష్యం...
గుంటూరు నగరంలో 126 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనికి సంబంధించి క్లోజ్డ్, ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌లను ఇప్పటికే అధికారులు గుర్తించి క్వారంటైన్‌లకు తరలించారు. వీరందరికీ కరోనా పరీక్షలు చేయడంతోపాటు, ఫలితాలు సైతం వెల్లడయ్యాయి. కరోనా పాజిటివ్ కేసులు నగరంలోని రెడ్‌జోన్ ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాలకే పరిమితమైనట్లు అధికారులు గుర్తిస్తున్నారు. నాల్గో విడత ఇంటింటి సర్వేను వేగవంతం చేశారు. ఇప్పటికే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులను 3,073 మందిని గుర్తించారు. కరోనా అనుమానిత లక్షణాలు కలిగిన వారిని, 60 ఏళ్లకు పైగా వయస్సు ఉన్న వృద్ధులకు పరీక్షలను వేగవంతం చేశారు. శనివారం నాడు జిల్లా వ్యాప్తంగా 918 కరోనా పరీక్షలు చేసినట్లు సమాచారం. వారం రోజుల్లోగా జిల్లా వ్యాప్తంగా దాదాపు 12 వేల మందికి పైగా కరోనా టెస్టులు చేయాలని లక్ష్యంగా అధికారులు నిర్ణయించారు
Comments
Please login to add a commentAdd a comment