విజయవాడ విద్యాధరపురం వద్ద ఆర్టీసీ బస్సులో ఏర్పాటు చేసిన మొబైల్ రైతు బజార్‌కు బారులు తీరిన జనం .. (ఇన్‌సెట్) కూరగాయలు కొనుగోలు చేస్తున్న దృశ్యం
సాక్షి, కృష్ణా: జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి దిగ్బంధం చేశారు. పూర్తిగా రాకపోకలు నిలిపివేశారు. ప్రజలకు అవసరమైన నిత్యావసరాలు ఇంటికే పంపేలా చర్యలు చేపట్టారు. రెడ్‌జోన్ల వారీగా కాల్‌సెంటర్లను ఏర్పాటు చేశారు. సరుకులు అవసరమైన వారు ఫోన్ చేస్తే చాలు ఇంటికే పంపిస్తున్నారు.
ఇళ్ల వద్దకే నిత్యావసరాలు..
నిత్యావసర సరుకులు ఇళ్ల వద్దకే పంపిణీ చేసేందుకు కిరాణా, కూరగాయలు, పండ్లు, పాల దుకాణాలను ఎంపిక చేశారు. ఒక్కో రెడ్‌జోన్‌లో 15–20 వరకు దుకాణాలను ఎంపిక చేసి వాటి యజమానులకు పాసులు జారీ చేస్తున్నారు. వారు బాయ్స్‌ను ఏర్పాటు చేసుకుని.. ఫోన్ చేసిన వారికి సరుకులు ప్యాక్ చేసి డోర్ డెలివరీ చేస్తున్నారు.
బెజవాడలో టోల్ ఫ్రీ నంబరు..
విజయవాడ నగరంలో రాణిగారితోట, పాయకాపురం, విద్యాధరపురం, కుమ్మరపాలెం, ఖుద్దూస్‌గనర్, ఓల్డ్ రాజరాజేశ్వరీపేట ప్రాంతాలను రెడ్‌జోన్లుగా ప్రకటించారు. కరోనా వ్యాప్తి ప్రబలకుండా ఉండేందుకు ఆయా ప్రాంతాలను బారికేడ్లతో మూసేసి.. రాకపోకలను నిలిపివేశారు. అక్కడ నివసిస్తున్న వారికి ఇళ్ల వద్దకే నిత్యావసరాలు, పాలు, పండ్లు, కూరగాయలను వీఎంసీ అధికారులు అందజేస్తున్నారు. ఇందుకోసం వీఎంసీ 0866–2427485 టోల్ ఫ్రీ నంబరును ప్రజలకు అందుబాటులో ఉంచింది. ఈ నంబరుకు ఫోన్ చేసి తమ కావల్సినవి చెబితే సూపర్‌మార్కెట్ల ద్వారా డోర్ డెలివరీ చేయిస్తున్నారు. అదేకాకుండా ఆయా ప్రాంతాల్లోకి బస్సుల ద్వారా నిత్యావసరాలు, మొబైల్ రైతుబజార్ల ద్వారా కూరగాయలు కాలనీల్లోకి తీసుకెళ్లి విక్రయిస్తున్నారు. అలాగే పాలు, పండ్లు, మెడికల్ సంబంధించినవి కూడా అందజేస్తున్నారు.
రూరల్ జిల్లాలో వలంటీర్లతో..
కృష్ణా రూరల్ జిల్లా మచిలీపట్నం, నందిగామ, నూజివీడు, జగ్గయ్యపేట, పెనమలూరు పట్టణాల్లో ఇంటింటికీ సరుకులు, మందులు వంటివి వలంటీర్లు పంపిణీ చేస్తున్నారు. ∙జగ్గయ్యపేట పట్టణం, నందిగామ నియోజకవర్గంలోని రాఘవాపురం, ముప్పాళ్ల గ్రామాలను రెడ్‌జోన్లుగా ప్రకటించినప్పటి నుంచి ఆయా గ్రామాల్లో వలంటీర్ల ద్వారా ఇళ్ల వద్దకు నిత్యావసరాలు, పాలు, పండ్లు, మందులను అధికారులు పంపిణీ చేయిస్తున్నారు. నూజివీడు పట్టణంలో నిత్యావసర, పాలు, మెడికల్ షాపుల యజమానుల నంబర్లును అందరికీ అందజేశారు. అవసరమైన సరుకులను ఫోన్ చేస్తే వారే డోర్ డెలివరీ చేస్తున్నారు.
కూరగాయలను మున్సిపాలిటీ సిబ్బంది నాలుగు వాహనాల్లో తీసుకొచ్చి ఆయా వార్డుల్లో విక్రయిస్తున్నారు. ∙ఇక నూజివీడులో మాత్రం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఇంటింటికీ పాలు అమ్ముతున్నారు. కూరగాయలు, పాలు, నిత్యావసరాలు మాత్రం ఎంపిక చేసిన దుకాణాల నుంచి డోర్ డెలివరీ చేయిస్తున్నారు. నిత్యావసరాలు డోర్ డెలివరీ జోన్ల వారీగా కాల్ సెంటర్లు కంటైన్మెంట్ ఏరియాల్లో భద్రత కట్టుదిట్టం అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దంటూ హెచ్చరికలు
Comments
Please login to add a commentAdd a comment