
నరసరావుపేట పట్టణంలో పర్యటిస్తున్న పోలీసులు, ఇతర అధికారులు
జిల్లాలో తొలి కరోనా మరణం సంభవించింది. నరసరావుపేట పట్టణానికి చెందిన వ్యక్తి కరోనాతో మృతి చెందినట్లు అధికారులు స్పష్టం చేశారు. దీంతో పేట ఒక్కసారిగా ఉలికిపాటుకు గురైంది. నిన్నటి వరకు ఒక్క కేసు కూడా లేకపోవడంతో ఊపిరిపీల్చుకున్న పట్టణ వాసులు ఏకంగా ఓ వ్యక్తి మృతితో భయాందోళన చెందుతున్నారు. అలానే పొన్నూరు పట్టణానికి చెందిన మరో వ్యక్తికి కూడా కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు.
సాక్షి,నరసరావు: నరసరావు పేట పట్టణంలో ఓ వ్యక్తి కరోనా వైరస్ కారణంగా మృతి చెందాడు. దీంతో ఇప్పటివరకు ప్రశాంతంగా ఉన్న నరసరావుపేట ప్రజానీకం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మరణంపై ఆర్డీవో కార్యాలయంలో సమావేశమైన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, జిల్లా నోడల్ అధికారి, డ్వామా పీడీ శ్రీనివాసరెడ్డి, ఆర్డీవో మొగిలి వెంకటేశ్వర్లు, డీఎస్పీ వీరారెడ్డి చర్చించిన మీదట విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఇది చాలా దురదృష్టకరమని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. నరసరావుపేటలో వైరస్ నిర్ధారణ కావటంతో ప్రభుత్వం అప్రమత్తమైందంటూ పూర్వాపరాలను తెలిపారు. వరవకట్ట ప్రాంతానికి చెందిన 45 ఏళ్ళ వ్యక్తి టీబీ వ్యాధితో బాధపడుతూ 7వ తేదీ ఉదయం ఆయాసం, జ్వరం, దగ్గుతో నరసరావుపేట ప్రభుత్వాసుపత్రికి వచ్చాడన్నారు. వైద్యులు అతడి పరిస్థితిపై అనుమానం వ్యక్తం చేస్తూ గుంటూరు ప్రభుత్వాసుపత్రికి సిఫార్సు చేశారన్నారు. గుంటూరు ఫీవర్ ఆసుపత్రిలో ఇతనికి కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించి చికిత్స చేస్తుండగా మృతి చెందాడన్నారు.
గురువారం వచ్చిన రిపోర్టులతో అతడు కరోనా వైరస్‌తోనే మృతి చెందినట్లుగా నిర్ధారౖణెందన్నారు. జిల్లా కలెక్టర్ ఐ.శామ్యూల్ ఆనందకుమార్ ఆదేశాలతో వరవకట్ట ప్రాంతాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించారన్నారు. మృతుడు రామిరెడ్డిపేట, అరండల్‌పేటలలో 300 గృహాలకు కేబుల్ కలెక్షన్లు చేసినందున ఆ ఏరియాను కూడా రెడ్‌జోన్‌గా ప్రకటించారన్నారు. ఇతనికి ఏ విధంగా వైరస్ సోకిందో ఇంకా నిర్ధారణకాలేదన్నారు. అతని కుటుంబ సభ్యులతో పాటు కేబుల్ కార్యాలయంలోని వ్యక్తులతో కలిపి 15 మందిని గుర్తించి వారికి పరీక్షలు చేసి క్వారంటైన్‌కు పంపించామన్నారు. మృతుడి నివాసానికి సమీపంలో నివసించే ఓ హోంగార్డుకు కరోనా లక్షణాలు కనిపించటంతో ముందస్తు చర్యల్లో భాగంగా అతన్ని సైతం క్వారంటైన్‌కు తరలించారు. మృతుడు సెల్‌ఫోన్ కాల్ లిస్ట్, టవర్ లొకేషన్ ఆధారంగా ఇటీవల కాలంలో ఎవ్వరెవ్వరితో సన్నిహితంగా మెలిగాడో పోలీసులు ఆరా తీస్తున్నారు. సుమారు 251 మందిని మృతుడు ఈ మధ్యకాలంలో నేరుగా కలిసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.
కట్టుదిట్టంగా నివారణ చర్యలు
జిల్లాలో కరోనా వ్యాప్తి నివారణకు యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. ఇందు కోసం ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ అధికారి రాజశేఖర్‌ను నియమించింది. ఆయన జిల్లా కలెక్టర్ ఐ.శామ్యూల్ ఆనందకుమార్, జాయింట్ కలెక్టర్ దినేష్‌కుమార్‌తోపాటు, ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమీక్షించారు. గుంటూరు నగరంలో లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేయాలని నిర్ణయించారు. పొన్నూరులోని షరాఫ్ బజారులో ఓ పాజిటీవ్ కేసు నమోదు అయింది. ఇతను ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారితో కలువడంతో కరోనా వ్యాధి సోకినట్లుగా అధికారులు గుర్తించారు.
దీంతో పొన్నూరులోని షరాఫ్‌బజారును రెడ్‌జోన్‌గా ప్రకటించారు. నరసరావుపేట, పొన్నూరులో నమోదైన పాజిటీవ్ కేసులకు సంబంధించి వారు ఎవరెవరిని కలిశారనేదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పెదకాకాని మండలం వెనిగండ్ల గ్రామం నుంచి 8 మందిని క్యారెంటైన్‌కు తరలించారు. జిల్లాలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 51కు చేరాయి. 14 క్వారంటైన్ సెంటర్లలలో 1247 ఐసోలేషన్ బెడ్‌లు సిద్ధం చేశారు. ప్రస్తుతం ఇందులో 514 మంది ఐసోలేషన్‌లో ఉన్నారు. రెడ్‌జోన్‌ప్రాంతాల్లో శాంపిళ్ళ సేకరణకు ఐదు మొబైల్ టీమ్‌లను ఏర్పాటు చేశారు.
క్లస్టర్ కంటైన్‌మెంట్‌లపై ప్రత్యేక దృష్టి....
గుంటూరు నగరంలో వేగంగా విస్తరిస్తున్న కోవిడ్ 19 వైరస్ పాజిటివ్ కేసుల పట్ల ఉన్నతాదికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గడచిన రెండు రోజుల్లోనే సుమారు 17 కేసులు రావడం పట్ల ఆరా తీస్తున్నారు. గురువారం కోవిడ్ 19 రాష్ట్ర ప్రత్యేకాధికారి రాజశేఖర్, అడిషనల్ డి.జి. ఉజ్వల్ త్రిపాఠి, జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్, రేంజ్ ఐ.జి. ప్రభాకరరావు, అర్బన్ ఎస్పీ పి.హెచ్.డి. రామకృష్ణ, జె.సి.దినేష్ కుమార్ క్లస్టర్ కంటైన్‌మెంట్ ప్రాంతాల్లో పర్యటించారు.
పొన్నూరు:జిల్లా రూరల్ ఎస్పీ సిహెచ్ విజయరావు, బాపట్ల డీఎస్పీ అతిన శ్రీనివాసరావు, తహసీల్దార్ దొడ్డకుల పద్మనాభుడు, మున్సిపల్ కమిషనర్ పాయసం వెంకటేశ్వరరావు షరాఫ్ బజారును పరిశీలించారు. పాజిటివ్ కేసు నమోదైన వ్యక్తికి పట్టణంలో ని ఒక వైద్యశాలకు చెందిన వైద్యులు వైద్యం చేసినట్లు తెలటంతో కుటుంబ సభ్యులతోపాటుగా వైద్య శాల సిబ్బందిని మొత్తం 15 మందిని వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు.
గుంటూరు వెస్ట్: నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై తిరిగేవారు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. లాక్‌డౌన్ సమయాల్లో నిభందనలు అతిక్రమించే వారిపట్ల ఇక నుంచి కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ముఖ్యంగా రోడ్లపై మాస్క్‌లు లేకుండా తిరిగితే రూ.1000 జరిమానా విధిస్తామన్నారు.