సాక్షి, అమరావతి: కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయడంలో రాష్ట్రం గణనీయమైన వృద్ధిని సాధిస్తోంది. మార్చి 1వ తేదీ నాటికి కేవలం 90 టెస్టులతో మొదలు పెట్టిన రాష్ట్రం.. ఇప్పుడు వైరాలజీ ల్యాబొరేటరీల్లోనే 2,200 టెస్టుల సామర్థ్యానికి వెళ్లింది. తమిళనాడు, కేరళ, ఢిల్లీ, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో అప్పటికే ల్యాబొరేటరీలు ఉన్నాయి కాబట్టి వాళ్లు అధిక సంఖ్యలో టెస్టులు చేస్తున్నారని, ఆంధ్రప్రదేశ్ అందుకు భిన్నంగా ఈ నెలన్నర కాలంలోనే కొత్త ల్యాబొరేటరీలను ఏర్పాటు చేసుకుని ముందుకు వెళుతోందని వైద్య వర్గాలు పేర్కొన్నాయి. దేశంలోనే రెండు మూడు రాష్ట్రాల్లో మాత్రమే చేస్తున్న ట్రూనాట్ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటిగా ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. తాజాగా ఏప్రిల్ 17వ తేదీ సాయంత్రానికి మిలియన్ (10 లక్షలు) జనాభాకు 351 టెస్టులు చేసే స్థాయికి ఏపీ చేరుకుంది. ఎక్కువ టెస్టులు చేస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఐదవ స్థానంలో ఉన్నట్టు ఏప్రిల్ 17వ తేదీ ఐసీఎంఆర్ విడుదల చేసిన తాజా గణాంకాలను బట్టి తేలింది.
వివిధ రాష్ట్రాల్లో ఇలా..
► రాష్ట్రంలో ఇప్పటికే 7 ల్యాబ్‌లున్నాయి. మరో రెండు అందుబాటులోకి రానున్నాయి.
► కర్ణాటకలో మిలియన్‌కు 214 మందికే టెస్టులు
► 200 మార్కు దాటని పంజాబ్, ఒడిశా, యూపీ, అస్సాం, బిహార్
► కేంద్రపాలిత ప్రాంతాల్లో ఢిల్లీది అగ్రస్థానం..అక్కడ మిలియన్‌కు 9,886 మందికి
► టెస్టుల్లో బాగా వెనుకబడ్డ పశ్చిమ బెంగాల్.. మిలియన్‌కు కేవలం 42 టెస్టులు మాత్రమే
► 20 కోట్లకు పైగా జనాభా ఉన్న యూపీలో మెరుగు పడని పరిస్థితి
టెస్టుల సంఖ్య పెరుగుతుంది
రానున్న రోజుల్లో టెస్టుల సంఖ్య గణనీయంగా పెరగనుంది. శుక్రవారం ర్యాపిడ్ టెస్ట్ కిట్‌లు భారీగా వచ్చాయి. ఇంకా చాలా రాబోతున్నాయి. ఈ కిట్‌లను ప్రభావిత ప్రాంతాలను బట్టి పంపిణీ చేస్తున్నాం. ఈ టెస్టులను ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం చేయాలి. ఎక్కువ టెస్టుల ద్వారా ఇన్ఫెక్షన్ ఎంత అనేది తెలుసుకుని చికిత్స అందించవచ్చు.
–జేవీఎన్ సుబ్రమణ్యం, కోవిడ్–19 టాస్క్‌ఫోర్స్ సభ్యులు (పరిశ్రమల శాఖ కార్యదర్శి)
Comments
Please login to add a commentAdd a comment