సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత రెండు, మూడు రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీలో మత ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారి వల్ల ఎక్కువ పాజిటివ్ కేసులు నమోదైనట్లు నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో ఓ వైపు ల్యాబొరేటరీల సామర్థ్యం పెంచుకుంటూనే.. మరోవైపు వైరస్ అనుమానిత వ్యక్తుల నుంచి సేకరించే నమూనాల నిర్ధారణ సంఖ్యనూ పెంచుకుంటూ వెళుతున్నారు. అన్నిటికీ మించి వీలైనంత త్వరగా కరోనా వైరస్ నిర్ధారణ జరగాలన్న ఉద్దేశ్యంతో ఐసీఎంఆర్ అనుమతి పొందిన ఓ సంస్థతో రెండు గంటల్లోనే ఫలితాలు వచ్చే 30 వేల టెస్ట్‌లకు సరిపడా కిట్‌ల కొనుగోలుకు ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది. రెండు రోజుల్లో టెస్ట్‌లకు అవసరమైన కిట్లు రాష్ట్రానికి రానున్నాయి. ఫిబ్రవరి 10 నాటికి మన రాష్ట్రంలో కేవలం రెండే వైరాలజీ ల్యాబ్‌లు ఉండేవి. ఇప్పుడా సంఖ్య ఏడుకు పెరిగింది. ప్రస్తుతం వస్తున్న నమూనాలకు తగ్గట్టు పరీక్షలు చేసి వైరస్ సోకిందో, లేదో తెలుసుకునే నిర్ధారణ సామర్థ్యం మన రాష్ట్రానికి ఉందని వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ జవహర్‌రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే...
ఎక్కువ మందికి నిర్ధారణ పరీక్షలు
► కరోనా అనుమానితుల నుంచి సేకరించిన నమూనాల పరీక్షలు చేసి ఫలితాలు నిర్ధారించేందుకు ప్రస్తుతం 7గంటల వరకూ సమయం పడుతోంది.
► ర్యాపిడ్ కిట్‌ల ద్వారా 2 గంటల్లోనే ఫలితాలు వస్తాయి. దీనివల్ల ఎక్కువ మందికి నిర్ధారణ పరీక్షలు చేసే అవకాశం ఉంటుంది.
► ఈ దృష్ట్యా ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) అనుమతి ఉన్న ఒక ప్రైవేట్ సంస్థకు 30 వేల టెస్ట్‌లకు సరిపడా కిట్‌లను కొనుగోలు చేస్తున్నాం.
► దీనికి సంబంధించి 10 మందికి శాంపిల్ టెస్ట్‌లు కూడా చేశాం. రాష్ట్రంలో 7 వైరాలజీ ల్యాబొరేటరీలను అందుబాటులోకి తెచ్చాం. గతంలో మన రాష్ట్రంలో ఇవి రెండు మాత్రమే ఉండేవి. ఐసీఎంఆర్ నిబంధనల మేరకు ఇవి పని చేస్తున్నాయి.
► 5 ల్యాబొరేటరీల్లో రెండేసి మెషిన్ల మిషన్ల చొప్పున ఏర్పాటు చేశాం. రెండు మెషిన్లు ఉన్న ల్యాబొరేటరీల్లో రోజుకు 180 చొప్పున 900 పరీక్షలు చేయొచ్చు. మొత్తంగా మన రాష్ట్రంలో రోజుకు 900 పరీక్షలు చేయచ్చు.
► తిరుపతి, విజయవాడ, కాకినాడ, విశాఖపట్నం కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ల్యాబ్‌లలో రెండేసీ మెషిన్లు ఉండగా.. కడప, అనంతపురంలలో ఒక్కో ల్యాబ్ ఉన్నాయి. ఈ రెండు కేంద్రాల్లో రోజుకు 90 చొప్పున పరీక్షలు చేయిస్తున్నాం.
► ల్యాబొరేటరీల్లో 3 షిఫ్టుల్లో 24 గంటలూ సిబ్బంది పని చేస్తున్నారు. వారం రోజుల కిందటే వాక్ ఇన్ పద్ధతిలో సిబ్బందిని నియమించాం.
ఒక్కో టెస్ట్‌కు రూ.1,250
ప్రైవేట్ సంస్థ సరఫరా చేసే ఒక్కొక్క కిట్ 100 మందికి టెస్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఒక్కొక్క కిట్ కొనుగోలుకు జీఎస్టీతో కలిపి రూ.1.34 లక్షలు అవుతోంది. పీసీఆర్ టెస్ట్ కిట్‌లుగా పిలిచే దీని సాయంతో చేసే ఒక్కొక్క టెస్ట్‌కు రూ.1,250 ఖర్చవుతుంది. వీటిని మై ల్యాబ్ అనే సంస్థ సరఫరా చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment