కరోనా లాక్‌డౌన్‌ : మీరే.. మీకు రక్ష | Coronavirus Lockdown Continues In Vijayawada | Sakshi
Sakshi News home page

కరోనా లాక్‌డౌన్‌ : మీరే.. మీకు రక్ష

Published Tue, Mar 24 2020 8:35 AM | Last Updated on Tue, Mar 24 2020 8:37 AM

Coronavirus Lockdown Continues In Vijayawada - Sakshi

‘కోవిడ్‌’ కర్ఫ్యూ.. లాక్‌డౌన్‌ నేపథ్యంలో విజయవాడ బందరు రోడ్డులో బారికేడ్లు పెట్టి ట్రాఫిక్‌ను కట్టడి చేసిన పోలీసులు

జనతా కర్ఫ్యూ, లాక్‌ డౌన్‌.. జిల్లా ప్రజానీకం ఎప్పుడూ వినని సరికొత్త పదాలను వింటోంది. ఎండాకాలం ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ ఉంటుంటే.. సమాజంలో కరోనా వైరస్‌పై ఆందోళన కూడా అదే స్థాయిలో వ్యాపిస్తోంది. ఈ నేపథ్యంలో మాయదారి వైరస్‌ బారి నుంచి జిల్లాను తప్పించేందుకు యంత్రాంగం శతవిధాలా ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగా ప్రభుత్వం ప్రకటించిన లాక్‌ డౌన్‌ను పకడ్బందీగా అమలు చేసేందుకు కృషి చేస్తోంది. అంతర్రాష్ట్ర సరిహద్దులను మూసి వేసి.. వాహనాలు, ప్రజలు బయటకు రాకుండా ఎక్కడికక్కడ కట్టడి చేస్తోంది. మరోవైపు ప్రజల నిత్యావసరాలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రజలు కూడా స్వీయ నిర్బంధం పాటించి తమని తాము వైరస్‌ బారిన పడకుండా కాపాడుకోవాలని అధికారులు కోరుతున్నారు.

గడప దాటొద్దు
లాక్‌ డౌన్‌ నిబంధనలను అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ ఏఎండీ ఇంతియాజ్‌ హెచ్చరించారు. జిల్లాలో 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నామని చెప్పారు. నిర్ణయించిన సమయాల్లో తప్ప ఇళ్లను వదిలి బయటకు రావద్దని సూచించారు.

ప్రతిక్షణం అప్రమత్తం
జిల్లాలో ఇప్పటి వరకు 1,199 మంది విదేశాల నుంచి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ప్రతి ప్రది మందికీ ఒక స్పెషల్‌ ఆఫీసర్‌ను నియమించి, వారి ఆరోగ్యాన్ని పరిశీలిస్తున్నారు. వలంటీర్లు ఇంటింటికీ తిరిగి ఇటీవల విదేశాల నుంచి వచ్చిన 
వారిని గుర్తిస్తున్నారు.  

సాక్షి, మచిలీపట్నం: కరోనా కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌ను జిల్లాలో పగడ్బందీగా అమలు చేసేందుకు జిల్లా యంత్రాంగం నడుంబిగించింది. లాక్‌డౌన్‌ను ఉల్లంఘించే వారిపై కేసులు నమోదు చేసేందుకు సన్నద్ధమవుతోంది. తొలుత అంతరాష్ట్ర సరిహద్దులను స్తంభింపజేయడమే కాక.. పొరుగు జిల్లాలైన పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాల నుంచి రాకపోకలపై నిఘా పెట్టారు. ఇప్పటికే తెలంగాణ నుంచి జిల్లాకు వచ్చే మార్గాల్లో 52 చెక్‌పోస్టులు 24 గంటలూ పనిచేస్తున్నాయి. తాజాగా గుంటూరు,  పశి్చమ గోదావరి జిల్లాలకు దారితీసే మార్గాల్లో కూడా చెక్‌ పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు.  

  • విజయవాడ, మచిలీపట్నం కార్పొరేషన్లతో పాటు జిల్లా వ్యాప్తంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో  ప్రజల కదలికలపై నిఘాపెట్టారు. సాధారణ రోజుల్లో రద్దీ ఎక్కువగా ఉండే ప్రధాన మార్గాలు, కూడళ్లలో నిఘా పెట్టారు. ప్రత్యేక పోలీస్‌ బృందాలతో పహారా కాయాలని నిర్ణయించారు. పట్టణాలు, మండల కేంద్రాల్లో ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను పూర్తిగా నియంత్రించనున్నారు.  
  • రానున్న వారం రోజులు ఉదయం ఆరు నుంచి 9 గంటల వరకు మాత్రమే ప్రజలు బయట తిరిగేందుకు అనుమతినివ్వనున్నారు. అదీ కూడా నిత్యావసరాల కొనుగోలుకు మాత్రమే. అవసరం లేకుండా ఏ ఒక్కరు రోడ్లపై కని్పంచినా చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. వాహనాలను లాక్‌డౌన్‌ ముగిసే వరకు సీజ్‌ చేయనున్నారు. 
  • రైతు మార్కెట్లలో రద్దీ ఎక్కువగా ఉంటుందని గుర్తించిన జిల్లా యంత్రాంగం విజయవాడ, మచిలీపట్నంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న పట్టణ ప్రాంతాల్లో కూరగాయలు, ఇతర నిత్యావసరాలు ప్రజలకు సమీప ప్రాంతాల్లో అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. ఇందుకోసం మచిలీపట్నంలో 12, విజయవాడలో కనీసం 20కు పైగా ప్రాంతాల్లో కూరగాయలు విక్రయించుకునేందుకు తాత్కాలిక మార్కెట్లు రేపటి నుంచి అందుబాటులో ఉంచనున్నారు. అలాగే మిగిలిన పట్టణాలు, నగర పంచాయతీలు,మండల కేంద్రాల్లో కూడా ఇదే రీతిలో కూరగాయల మార్కెట్ల సంఖ్యను పెంచా లని నిర్ణయించారు.    
  • నిత్యావసర సరుకులు కృత్రిమ కొరత సృష్టిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేసే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. దీని కోసం జిల్లాలో ప్రత్యేక టాస్క్‌ ఫోర్స్‌ బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement