రెడ్ జోన్‌గా ప్రకటించిన గుంటూరు రింగ్‌రోడ్డులోని సాయిబాబా రోడ్డు
సాక్షి, గుంటూరు : జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నాయి. గుంటూరు నగరంలో మొత్తం 27 కేసులు నమోదవ్వగా మంగళగిరి, మాచర్ల మున్సిపాలీ్టలు, అచ్చంపేట, తురకపాలెం, కారంపూడి ప్రాంతాల్లో 14 కేసులు వెలుగు చూశాయి. ఈ క్రమంలో మొత్తంగా జిల్లాలో కేసుల సంఖ్య 41కి చేరింది. మంగళవారం నగరంలో నమోదైన ఎనిమిది కేసుల్లో బుచ్చతోటలో మూడు, శ్రీనివాసరావుతోటలో మూడు, కొరిటెపాడులో ఒకటి, చైతన్యపురి సాయిబాబా కాలనీ రోడ్డులో ఒకటి ఉన్నాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అయితే తాజాగా విదేశాల నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్ధారణయ్యింది. మిగిలినవి ఢిల్లీ వెళ్లి వచ్చిన వారు ఉన్నారు. ఇందులో గతంలో వచ్చిన పాజిటివ్ కేసులకు సంబంధించి వారి కుటుంబ సభ్యులు, క్లోజ్ కాంటాక్ట్స్ ఉండటం కలవర పెడుతోంది.
కంటైన్నెంట్‌లో కఠిన ఆంక్షలు..
గుంటూరు నగరంలో మంగళదాస్‌నగర్, ఆటోనగర్, సంగడిగుంట, ఆనందపేట, దర్గామాన్యం, శ్రీనివాసరావుతోట, బుచ్చయ్యతోట, కుమ్మరిబజారు, నల్లచెరువు ప్రాంతాలను మొత్తం అధికారులు 11 కంటైన్మెంట్ జోన్లుగా విభజించారు. కరోనా పాజిటివ్ కేసులు నమోదైన ఇంటి పక్కన పదివేల గృహాలు ఉండగా, ఒక్క కిలోమీటరు దూరంలో 89వేల కుటుంబాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మొత్తం ఈ ప్రాంతాల్లో ఆంక్షలు కఠినంగా అమలు చేస్తున్నారు.
ఇళ్లల్లో నుంచి ప్రజలు బయటకు రావద్దని కలెక్టర్ ఐ.శామ్యూల్ ఆనంద్‌కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా అనురాధ ఇప్పటికే ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బుధవారం నుంచి లాక్‌డౌన్ మరింత కఠినంగా అమలు చేస్తామని, ప్రజలు అనవసరంగా బయటకు వస్తే కేసులు నమోదు చేస్తామని అర్బన్ ఎస్పీ రామకృష్ణ హెచ్చరికలు జారీ చేశారు. కంటైన్మెంట్ ప్రాంతాల్లో నిత్యవసర వస్తువులు, కూరగాయలు, పాలకు ఇబ్బంది లేకుండా సరఫరా చేసేలా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు.
విస్తృతంగా నమూనాల సేకరణ
జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా నిర్ధారణ కోసం 581 నమూనాలు సేకరించారు. ఇందులో 41పాజిటివ్ రాగా, 116 ఫలితాలు రావాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా క్వారంటైన్ సెంటర్లలో 509 మంది, ఐసోలేషన్‌లో 98 మంది ఉన్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తుల ప్రైమరీ కాంటాక్ట్‌లపైన అధికారులు ప్రధానంగా దృష్టి సారించారు. గుంటూరు జిల్లా రూరల్ పరిధిలో 78 మందిని గుర్తించి 72 మందికి కరోనా పరీక్షలు చేశారు. గుంటూరు నగరంలోనే 27 కేసులు ఉండటంతో కాంటాక్ట్‌ల సంఖ్య దాదాపుగా 200పై ఉంటుందని, దాదాపు 75 శాతానికిపైగా కరోనా పరీక్షలు పూర్తయినట్లు సమాచారం.
ప్రధానంగా రెడ్‌జోన్ ప్రాంతాల్లో ప్రతిరోజూ ఇంటింటి సర్వే చేస్తూ దగ్గు, జలుబు ఉన్నవారిని, విదేశాలు, ఢిల్లీ లింకులు ఉన్నవారిని గుర్తించి వైద్య పరీక్షలు చేసేలా ఏర్పాట్లు చేశారు. రెడ్‌జోన్ ప్రాంతాల్లో ర్యాండమ్‌గా శాంపిళ్ల తీస్తున్నారు. ప్రధానంగా నగరంతోపాటు కరోనా కేసులు నమోదైన హాట్‌స్పాట్ ప్రాంతాల్లో 28 రోజులపాటు లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయాలని నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment