ఫైల్ ఫోటో
కోయంబేడు మార్కెట్ ఉదంతంతో జిల్లా ఉలికిపడింది. అక్కడి మార్కెట్‌లో హమాలీల ద్వారా రోజురోజుకు వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయి. ఈ కూరగాయల మార్కెట్ నుంచి జిల్లాకు కూరగాయలు, జిల్లా నుంచి మార్కెట్‌కు పండ్లు ఎగుమతులు, దిగుమతులు జరుగుతుంటాయి. దీంతో వైద్య, ఆరోగ్యశాఖ, పోలీసు యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తమైంది. గడిచిన వారం వ్యవధిలో మార్కెట్‌కు క్రయవిక్రయాల నిమిత్తం వెళ్లిన వారందరిని చెక్‌పోస్టు డేటా ఆధారంగా గుర్తించి వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లా నుంచి సుమారు 130 మందికి పైగా మార్కెట్‌కు వెళ్లినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.
సాక్షి, నెల్లూరు: చెన్నైలోని కోయంబేడు కూరగాయల మార్కెట్ అతిపెద్దది. ఇక్కడి నుంచి నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్ కడప, ప్రకాశం జిల్లాలకు సైతం కూరగాయల రవాణా జరుగుతోంది. జిల్లాలోని సూళ్లూరుపేట, గూడూరు, నెల్లూరు నగర మార్కెట్, కావలి మార్కెట్‌కు నుంచి నిత్యం దిగుమతులు జరుగుతుంటాయి. కోవూరు, ఇందుకూరుపేట నుంచి అరటి పండ్లు, అరటి ఆకులు, గూడూరు మార్కెట్ నుంచి నిమ్మ, సూళ్లూరుపేటలోని పలు ప్రాంతాల నుంచి కూరగాయలు ఇలా సుమారు 15కు పైగా లారీల్లో కోయంబేడు మార్కెట్‌కు ఎగుమతులు జరుగుతుంటాయి. లాక్‌డౌన్ నేపథ్యంలో నెల్లూరు మార్కెట్‌కు మినహా మిగిలిన మార్కెట్లకు రోజుకు సగటున ఐదారు లారీల్లో కూరగాయల దిగుమతి జరుగుతోంది.
- చెన్నై నగరంలో 2,700కు పైగా కేసులు నమోదు కాగా, కోయంబేడు మార్కెట్ ప్రాంతంలోని హమాలీలు, ఇతర కాంట్రాక్టర్ల ద్వారా 300కు పైగా కేసులు నమోదయ్యాయి. గత రెండు రోజులుగా కోయంబేడు మార్కెట్‌లో 30కు పైగా కేసులు బయటపడ్డాయి.
- ఇక్కడి నుంచి జిల్లాలోని తడ, నాయుడుపేట, సూళ్లూరుపేటతో పాటు చిత్తూరు జిల్లా తిరుపతి, సత్యవేడు ప్రాంతాల్లోని వ్యాపారులు నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. సత్యవేడులోనూ కోయంబేడు మార్కెట్‌కు వెళ్లొచ్చిన నలుగురికి పాజిటివ్ వచ్చింది.
- దీంతో జిల్లా యంత్రాంగం ముందుగానే అప్రమత్తమైంది. శుక్రవారం సూళ్లూరుపేట, నెల్లూరు సిటీ, నాయుడుపేట, గూడూరు, వెంకటగిరి ప్రాంతాల్లో 96 మందికి ట్రూనాట్ కిట్ల ద్వారా వైద్య పరీక్షలు నిర్వహించారు. మరో 40 మందికి పైగా వెళ్లి వచ్చిన వారిని ప్రాథమికంగా గుర్తించారు.
- తడ చెక్‌పోస్టులోని పోలీస్ డేటా ఆధారంగా వీరిని గుర్తించి వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది పరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్ శనివారం కలెక్టర్ ఎంవీ శేషగిరిబాబు, ఎస్పీ భాస్కర్‌భూషణ్‌తో సమీక్ష సమావేశం నిర్వహించారు. కోయంబేడు మార్కెట్‌కు వెళ్లి వచ్చిన వ్యాపారులు, లారీ డ్రైవర్లు, హమాలీలు, ఇతరులకు పూర్తి స్థాయిలో మరిన్ని పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.
నెల్లూరు మార్కెట్ తరలింపు యోచన
కోయంబేడు మార్కెట్ ఘటనతో నెల్లూరు కూరగాయల మార్కెట్ పరిస్థితిపై అధికారులు సమీక్షించారు. కలెక్టర్ ఎంవీ శేషగిరిబాబు మార్కెట్ ప్రాంతాన్ని పరిశీలించారు. మార్కెట్‌లో 400కు పైగా షాపులు ఉండగా ప్రస్తుతం 100 షాపులు మాత్రమే విక్రయాలు సాగిస్తున్నాయి. అవి కూడా పూర్తిస్థాయి ఆంక్షలతో విక్రయాలు జరుగుతున్నాయి.
- ప్రస్తుత తరుణంలో మార్కెట్‌లో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయనే యోచనతో నెల్లూరు మార్కెట్‌ను తాత్కాలికంగా మరో ప్రాంతానికి తరలించాలని అధికార యంత్రాంగం యోచిస్తోంది.
- స్టోన్‌హౌస్‌పేటలో రెండు పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. బాగా రద్దీ ఉండే ప్రాంతం కావడంతో ఈ మార్కెట్‌ను కూడా తరలించాలని యోచిస్తున్నారు.
- మార్కెట్ సెంటర్‌లోని ఫ్రూట్ మార్కెట్, హైవే సమీపంలోని వేణుగోపాల స్వామి కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేయడానికి కసరత్తు చేసి ఆదివారం ఖరారు చేయనున్నారు.
సరిహద్దులో అలజడి..
తడ: తమిళనాడులో కరోనా కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. చెన్నై నగరంలో కూడా కేసులు ఉధృతంగా ఉన్న నేపథ్యంలో అక్కడి నుంచి వస్తున్న వాహనాలను కట్టడి చేస్తున్నారు. సరిహద్దుల్లో వాహనాలు నిలిపివేయడంతో అలజడి పెరిగింది. భారీస్థాయిలో వాహనాలు వస్తుండడంతో అదుపు చేసేందుకు పోలీసులు సతమతమవుతున్నారు. లాక్‌డౌన్‌తో ఆంధ్రా, ఇతర రాష్ట్రాల వారు పెద్ద సంఖ్యలో తమిళనాడులో చిక్కుకు పోయారు. వారందరూ స్వస్థలాలకు వెళ్లేందుకు యత్నాలు మొదలు పెట్టారు. తమిళనాడులోని ఉన్నతాధికారుల అనుమతులు తీసుకుని స్వస్థలాలకు పయనమయ్యారు. అయితే చెన్నై కోయంబేడులో కేసులు పెరుగుతున్న దృష్ట్యా అటు వైపు నుంచి వస్తున్న వాహనాలను పూర్తిస్థాయిలో తనిఖీ చేయాలని ఎస్పీ భాస్కర్‌భూషణ్ ఆదేశాలు జారీ చేశారు.
దీంతో సూళ్లూరుపేట సీఐ వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో తనిఖీ చేసి అత్యవసరమైన వాటిని మాత్రమే అనుమతిస్తున్నారు. శుక్రవారం తమిళనాడు నుంచి వచ్చిన వందలాది వాహనాలు కిలో మీటర్ల మేర నిలిచిపోయాయి. వందల కిలో మీటర్లు నడిచి వస్తున్న వలస కూలీలకు తడ, సూళ్లూరుపేటల్లో భోజన వసతి కల్పించి రాష్ట్రానికి చెందిన వారిని వసతి కేంద్రానికి తరలించి మిగతా వారిని తమిళనాడు అధికారులతో మాట్లాడి వెనక్కి పంపేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment