Koyambedu market
-
1,756 మంది కోలుకున్నారు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో తాజాగా మరో 51 మంది డిశ్చార్జి అయ్యారు. దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్ నుంచి కోలుకున్నవారి సంఖ్య 1,756కు చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కొంది. దీంతో రికవరీ రేటు 65.84 శాతానికి చేరింది. గురువారం ఉదయం 9 గంటల నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల వరకు 8,415 మందికి పరీక్షలు నిర్వహించగా అందులో 62 మందికి పాజిటివ్ లక్షణాలున్నట్లు నిర్ధారణైంది. ఈ 62 కేసుల్లో 18 కేసులు తమిళనాడు కోయంబేడుకు సంబంధించినవే ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో 14, చిత్తూరు జిల్లాలో 4 కేసులు కోయంబేడు మార్కెట్‌కు వెళ్లి వచ్చినవారిగా నిర్ధారించారు. రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,667కు చేరుకుంది. ఇందులో 153 మంది వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలు ఉన్నారు. ఇదిలా ఉండగా, కృష్ణా జిల్లాలో ఒక మరణం నమోదైంది. దీంతో మొత్తం మరణాల సంఖ్య 55కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 856గా ఉంది. -
కరోనా వైరస్: కోయంబేడు టెన్షన్
నెల్లూరు(అర్బన్): జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. చెన్నై కోయంబేడు మార్కెట్ లింక్‌లు ఎక్కువగా ఉండడంతో కొత్త కేసులు వేగంగా వెలుగు చూస్తున్నాయి. మంగళవారం ఒక్కరోజే 19 కేసులు నమోదయ్యాయి. అందులో 17 సూళ్లూరుపేట పట్టణానికి చెందినవి కావడం గమనార్హం. తాజా వాటితో కలిపి కేసుల సంఖ్య 183కి చేరింది. మంగళవారం నిర్ధారణ కేసుల్లో గూడూరు పట్టణంలో ఒకటి, కోట సమీపంలో విద్యానగర్‌లో మరొకటి ఉన్నాయి. మిగిలినవి సూళ్లూరుపేటలోని మహదేవయ్య నగర్, వనంతోపు, వట్రపాళెం, మన్నారుపోలూరుల్లో నమోదయ్యాయి. వారంరోజుల్లోనే సూళ్లూరుపేటలో 60 కేసులు వచ్చాయి. దీంతో ఆ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. (డబ్ల్యూహెచ్ఓలో కేంద్ర మంత్రికి కీలక పదవి) పేటలో కరోనా నిర్ధారణ కోసం పెద్దఎత్తున ట్రూనాట్, ర్యాపిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అనుమానితులను, పాజిటివ్దారులతో కాంటాక్ట్‌లో ఉన్న వారిని క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నారు. కేసులు రోజురోజుకు పెరుగుతుండడంతో సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అధికారులను అప్రమత్తం చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారు. జిల్లాలోని 12 క్వారంటైన్ సెంటర్లకు 489 మంది అనుమానితులను తరలించిన వైద్యులు వారికి అన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తున్నారు. కాగా ప్రస్తుతం 74 మంది ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు. మొత్తంగా చూస్తే పీసీఆర్, ట్రూనాట్ పద్ధతిలో 20,019 మంది నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షించారు. అందులో 19,035 మందికి నెగెటివ్ రాగా మరో 183 మందికి పాజిటివ్ వచ్చింది. ఇక 801 మందికి ల్యాబ్ రిపోర్టు రావాల్సి ఉంది.(కరోనా పాజిటివ్.. ఇదో అవలక్షణం! ) నెల్లూరులోనే కరోనా నిర్ధారణ నెల్లూరు(అర్బన్): కరోనా నిర్ధారణ పరీక్షలు ఇక నుంచి నెల్లూరులోనే చేయనున్నారు. నగరంలోని పెద్దాస్పత్రిలో ఏర్పాటుచేసిన వైరాలజీ ల్యాబ్‌లో మంగళవారం నుంచి పీసీఆర్ పరీక్షలు ప్రారంభించారు. తొలిరోజు 14 పాజిటివ్ కేసులు ప్రకటించారు. కరోనా కేసులకు సంబంధించి జిల్లాలో ఇప్పటి వరకు ప్రాథమిక పరీక్షల్లో పాజిటివ్‌గా తేలినా ఫైనల్‌గా నిర్ధారించేందుకు తిరుపతి స్విమ్స్‌లోని వైరాలజీ ల్యాబ్‌కు పంపేవారు. అక్కడినుంచి ఫలితాలు వచ్చే వరకు ఆగాల్సి వచ్చేది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మెడికల్ కళాశాలలో పీసీఆర్ పరీక్షలు చేసే పరికరాలను పంపించింది. వైరాలజీ విభాగం ఆధ్వర్వంలో పలు దఫాలుగా పరీక్షలు నిర్వహించి వాటిని సరి చూసేందుకు తిరుపతికి పంపారు. ఇలా ఒకటికి మూడుసార్లు పరిశీలించారు. అలాగే ల్యాబ్ టెక్నీషియన్లు ప్రత్యేకంగా శిక్షణ పొందారు. ఇక్కడ చేసిన పరీక్షలన్నీ తిరుపతిలోనూ చేసి ఎటువంటి తేడా లేదని చెప్పడంతో ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పీసీఆర్ పరీక్షలను ప్రారంభించారు. ఇక ఫైనల్ రిపోర్టు కోసం తిరుపతికి పంపాల్సిన అవసరం లేదు. -
కరోనా: కోయంబేడు కలకలం
సాక్షి, ఒంగోలు: జిల్లాలో ఉన్న 63 కోవిడ్–19 పాజిటివ్ కేసులన్నీ కోలుకుని నెగిటివ్ రావడంతో ప్రజలు, అధికారులు ఊపిరి పీల్చుకుంటున్న దశలో మరో మూడు పాజిటివ్ కేసులు శనివారం నమోదయ్యాయి. చెన్నైలోని కోయంబేడు మార్కెట్‌కు వెళ్లి వచ్చిన జిల్లా వాసులకు కోవిడ్–19 పాజిటివ్ రావడం కలకలం రేపుతోంది. ప్రస్తుతం ఈ మార్కెట్ కేంద్రంగానే కరోనా కేసులు విస్తృతంగా వ్యాపించాయి. జిల్లాలోని కొన్ని ప్రాంతాల నుంచి, ఇతర జిల్లాల నుంచి కొంత మంది వలస కూలీలు పనుల కోసం గతంలో చెన్నై వెళ్లారు. వారంతా లాక్డౌన్ నేపథ్యంలో నడక, ఇతర మార్గాల ద్వారా జిల్లాకు, ఇతర జిల్లాల వారు మన జిల్లా మీదుగా వెళ్లిపోయారు. అలా వెళ్లి వచ్చిన వారిలో ప్రస్తుతం ఒంగోలు కమ్మపాలెం నుంచి ఒకరికి, కొత్తపట్నం నుంచి ఇద్దరికి ట్రూనాట్ పరీక్షల్లో పాజిటివ్ రావడంతో, పూర్తి స్థాయి నిర్ధారణ పరీక్ష అయిన వీఆర్‌డీఎల్‌ను నిర్వహించగా పాజిటివ్‌లుగా నిర్ధారించారు. ప్రస్తుతం నిర్ధారణ అయిన మూడు కేసులు కోయంబేడు మార్కెట్‌తో ముడిపడినవిగా అధికారులు తేల్చారు. ఒంగోలు కమ్మపాలేనికి చెందిన 30 సంవత్సరాల వ్యక్తికి, కొత్తపట్నంకు చెందిన 44 సంవత్సరాల వ్యక్తికి, రాజుపాలెంకు చెందిన 31 సంవత్సరాల వ్యక్తులకు పాజిటివ్‌లుగా నిర్ధారించారు. వీరంతా కూరగాయల వ్యాపారస్తులు, డ్రైవర్లు. కూరగాయలను కోయంబేడుకు తరలించిన వారు. మొత్తం 170 మంది.. కోయంబేడు కూరగాయల మార్కెట్‌కు వెళ్లి వచ్చిన వారిలో జిల్లాలో దాదాపు 170 మంది వరకూ ఉన్నారు. వీరిని గుర్తించి క్వారంటైన్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. వీరిలో 130 మంది శాంపిల్స్‌ను వైద్యులు పరీక్షించారు. మరో 40 శాంపిల్స్‌ను పరీక్షించాల్సి ఉంది. అదే విధంగా పాజిటివ్ వచ్చిన వారితో దగ్గరగా ఉన్న 14 మంది స్వాబ్‌లను కోవిడ్ 19 నిర్ధారణ పరీక్షలకు పంపించారు. మరో నలుగురి స్వాబ్‌లను తీసేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నారు. పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారిలో ఇరువురు ఇప్పటికే ట్రిపుల్ ఐటీలో క్వారంటైన్లో ఉండగా, మిగిలిన వ్యక్తి జీజీహెచ్‌లో ఉన్నాడు. వీరందరినీ శనివారం రాత్రి కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ జనరల్ వైద్యశాల, జిల్లా కోవిడ్ వైద్యశాలకు వైద్య చికిత్స నిమిత్తం తరలించారు. జిల్లా కోవిడ్ నోడల్ అధికారి డాక్టర్ ఎల్ జాన్ రిచర్డ్స్ ఆధ్వర్యంలోని వైద్య బృందం పాజిటివ్ వ్యక్తులకు వైద్య చికిత్స అందిస్తున్నారు. మొత్తం మీద వారం రోజులుగా జిల్లాలో ఒక్క కోవిడ్ 19 కేసు నమోదు కాకపోవడంతో వైద్యులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రజలు కూడా ఆనందంగా ఉన్నారు. మూడవ దశ లాక్డౌన్ కూడా ముగుస్తుండటంతో, 4వ దశలో కొన్ని వెసులుబాటులు ఉండవచ్చని భావించారు. అయితే కొత్త కేసులు, కొత్త ప్రాంతాల్లో నమోదవుతుండటంతో ఆ ప్రాంతాలపై కూడా లాక్డౌన్ పడనుంది. -
ఆదోనిలో ‘కోయంబేడు’ కలకలం
ఆదోని: చెన్నై కోయంబేడు మార్కెట్ వెళ్లి వచ్చిన వారు ఆదోనిలో ఉండటంతో కలకలం రేగింది. వ్యవసాయ ఉత్పత్తులను లారీల్లో కోయంబేడు మార్కెట్‌కు తీసుకెళ్లి తిరిగి వచ్చిన డ్రైవర్లలో నలుగురికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు జిల్లా అధికారులు శుక్రవారం నిర్ధారించారు. కరోనా పాజిటివ్‌గా గుర్తించిన వారు మహాత్మాగాంధీనగర్, రాజరాజేశ్వరినగర్, ఖాజీపురకు చెందిన వారు కావడంతో పోలీసులు ఆ ప్రాంతాలను తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. రోడ్లకు అన్ని వైపుల బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలు నిషేధించారు. ఇళ్లలో నుంచి ఎవరూ బయటకు రావొద్దని వన్‌టౌన్, టూటౌన్ సీఐలు చంద్రశేఖర్, లక్ష్మయ్య సూచించారు. డోన్: కోయంబేడు మార్కెట్‌కు ఉల్లిని తరలించి విక్రయించిన డోన్ నియోజకవర్గానికి చెందిన రైతులు, లారీల డ్రైవర్లు 9 మందిని గుర్తించి కర్నూలు క్వారంటైన్‌కు తరలించినట్లు ఇన్సిడెంట్ కమాండెంట్ నరేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. వెల్దుర్తి/కృష్ణగిరి: కోయంబేడు మార్కెట్‌కు వెళ్లొచ్చి, కరోనా పాజిటివ్ వచ్చిన అనంతపురానికి చెందిన వాహనదారులతో కాంటాక్ట్ అయిన మండలానికి చెందిన ఆరుగురిని కర్నూలు క్వారంటైన్ సెంటర్‌కు తరలించినట్లు తహసీల్దార్ రజనీకుమారి, ఎంపీడీఓ సుబ్బారెడ్డి, తెలిపారు. మరో ఇద్దరికి డోన్ క్వారంటైన్లో కోవిడ్ పరీక్షలు నిర్వహించి, హోమ్ ఐసోలేషన్‌లో ఉంచినట్లు వెల్లడించారు. అలాగే కోయంబేడు మార్కెట్‌కు వెళ్లి వచ్చిన కృష్ణగిరి మండలానికి చెందిన మరో ఐదుగురిని కూడా క్వారంటైన్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు. -
కరోనా: సిక్కోలుకు చెన్నై దడ
చెన్నై దడ జిల్లాను వణికిస్తోంది. అక్కడి నుంచి వచ్చిన వారిలో కరోనా లక్షణాలు కన్పిస్తుండటంతో అధికార యంత్రాంగం ఉలిక్కిపడింది. ఇప్పటివరకు చేసిన పరీక్షల్లో ఊహకందని విధంగా అనుమానిత ఫలితాలు వస్తున్నాయి. చెన్నైలో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండటం, ఆ రాష్ట్రంలో కోయంబేడు మార్కెట్ వైరస్ వ్యాప్తికి కేంద్రంగా మారడంతో అక్కడి నుంచి వచ్చే వారితో ముప్పు ఏర్పడింది. సాక్షి, శ్రీకాకుళం: జిల్లాకు చెన్నై నుంచి పెద్ద ఎత్తున వలస కూలీలు వచ్చారు. శ్రామిక రైలు ద్వారా, ప్రత్యేక బస్సుల్లో, కాలినడకన.. ఇలా పలు రకాలుగా 1200మందికి పైగా స్వస్థలానికి చేరుకున్నారు. వారందరినీ క్వారంటైన్లో పెట్టారు. చెన్నైలో ఎక్కువ కేసులు నమోదు కావడంతో అప్రమత్తమైన అధికారులు వచ్చిన వారందరికీ పరీక్షలు చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో ప్రాథమిక పరీక్షల్లో పాజిటివ్ ఫలితాలు కనిపిస్తున్నాయి. శ్రీకాకుళం రూరల్‌లో ఏర్పాటు చేసిన క్వా రంటైన్ సెంటర్లో 145మందిని ఉంచగా, వా రిలో కొందరికి ట్రూనాట్ పరీక్షల్లో పాజిటివ్ వ చ్చింది. వీరంతా బస్సుల ద్వారా చెన్నై నుంచి వచ్చినవారే. పూర్తి స్థాయి నిర్ధారణ కోసం వీఆర్డీ ల్యాబ్‌కు వీరి శాంపిల్స్‌ను పంపించారు. తుది ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. ఎచ్చెర్ల, శ్రీకాకుళం రూరల్ మండలాల్లోని క్వారంటైన్ సెంటర్లలో శ్రామిక రైలు, బస్సుల ద్వారా చెన్నై నుంచి వచ్చిన వారుండగా వారిలో 14 మందికి పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తోంది. ఇంకా మరికొంతమందికి పరీక్షలు జరుగుతున్నాయి. ఈ విషయాలను అధికారికంగా ధ్రువీకరించాల్సివుంది. అప్రమత్తం కావల్సిన పల్లెలు, పట్టణాలు చెన్నై నుంచి వచ్చిన వారందరినీ క్వారంటైన్లో పెట్టడంతో వారి ద్వారా జిల్లాలో వైరస్ వ్యాప్తి చెందదు. కానీ అధికారులకు సమాచారం లేకుండా నడక, ఇతరత్రా మార్గాల ద్వారా వచ్చి నేరుగా ఇళ్లల్లోకి వెళ్లిపోయిన వారితోనే ప్రమాదం. అటువంటి వారిని పల్లెలు, పట్టణాల్లో ఉన్న వారు గమనించి, అధికారులను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉంది. పల్లెల్లో ఇలా స్పందిస్తున్నారు గానీ పట్టణాల్లో ఒకరితో ఒకరికి సంబంధం లేకపోవడంతో అధికార యంత్రాంగం దృష్టికి రావడం లేదు. బయటి నుంచి వచ్చిన వారు తప్పనిసరిగా క్వారంటైన్లో ఉండేలా అవగాహన కల్పించాలి. అలాగని వివక్ష చూపించి ఇబ్బందులు పెట్టకూడదు. ప్రత్యేక దృష్టి సారించాం చెన్నై నుంచి వచ్చిన వారిని ప్రత్యేకంగా పరిశీలిస్తున్నాం. శ్రామిక రైలు, బస్సుల ద్వారా వచ్చిన వారిని వెంటనే క్వారంటైన్లో పెట్టాం. నడక, ఇతర మార్గాల ద్వారా వచ్చిన వారిని పట్టుకుని క్వారంటైన్‌కు తరలిస్తున్నాం. ఒక్క చైన్నై వచ్చిన వాళ్లనే కాదు ఇతర ప్రాంతాల నుంచి ఎవరొచ్చినా వెంటనే మాకు సమాచారం అందించండి. – ఆర్.ఎన్.అమ్మిరెడ్డి, జిల్లా ఎస్పీ పునరావాస కేంద్రంలో వైద్య పరీక్షలు ఎచ్చెర్ల క్యాంపస్: ఎచ్చెర్ల వెంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాలలోని వలస కారి్మకుల పునరావాస కేంద్రంలో 324 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. వీరిలో కరోనా లక్షణాలు ఉన్న ఐదుగురిని గురువారం రాత్రి జెమ్స్ ఆసు పత్రికి తరలించారు. ప్రస్తుతం ఈ సహాయ కేంద్రంలో ఉడిపి ప్రాంతం నుంచి వచ్చిన వలస కూలీలు ఉన్నారు. శ్రీశివానీ ఇంజినీరింగ్ కళాశాలలోని క్వారంటైన్ కేంద్రంలో ఆరోగ్య సమస్యలు ఉన్న వారిని ప్రత్యేక గదులు ఉన్న క్వారంటైన్ కేంద్రానికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నట్టు తహసీల్దార్ సుధాసాగర్ చెప్పారు. -
కరోనా : భయపెడుతున్న కోయంబేడు
చెన్నైలోని కోయంబేడు కూరగాయల మార్కెట్ కరోనా వైరస్‌కు నిలయమైంది. ఏపీలోని తమిళనాడు సరిహద్దు జిల్లాలైన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు వైరస్ సెగ తాకింది. ఏపీ నుంచి చెన్నై కోయంబేడు మార్కెట్‌కు సరుకు దిగుమతుల కోసం రాకపోకలు సాగించిన ఆ రాష్ట్రానికి చెందిన కమీషన్ ఏజెంట్లు, హోల్‌సేల్ వ్యాపారులు, డ్రైవర్లు, క్లీనర్లకు వైరస్ వ్యాప్తించింది. ఏపీ సరిహద్దు జిల్లాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. సాక్షి, చెన్నై : తమిళనాడు రాష్ట్రానికే తలమానికంగా అతిపెద్ద కోయంబేడు కూరగాయాల మార్కెట్‌కు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి లారీల్లో రోజూ టమాట, ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, బెండకాయ, వంకాయలు తదితర కూరగాయలు, సపోటాలు, మామిడి, గజనిమ్మ తదితర పళ్లు.. పాలు కూడా వస్తుంటాయి. ప్రధానంగా చిత్తూరు, నెల్లూరు జిల్లాల నుంచి హోల్‌సేల్ వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు ఈ సరుకును కొనుగోలు చేసి తమిళనాడులోని వేలూరు, తిరువళ్లూరు జిల్లాల మీదుగా లారీల్లో తీసుకుని వచ్చి కోయంబేడు మార్కెట్‌కు చేరుస్తారు. కమీషన్ పొందుతుంటారు. చెన్నై కోయంబేడు కూరగాయల మార్కెట్‌కు సాధారణ రోజుల్లో 300లకు పైగా లారీల లోడ్లు వస్తుంటాయి. ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా రోజుకు సుమారు 200 లారీలు మాత్రమే వస్తున్నాయి. ఇలా రోజుకు సుమారు 500 మంది కమిషన్ ఏజెంట్లు, వ్యాపారులు, లారీ డ్రైవర్లు, క్లీనర్ల రాకపోకలు సాగుతుంటాయి. అంచలంచెలుగా.. తమిళనాడులో కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపుతున్న చెన్నై సహా ఐదు జిల్లాల్లో ఏప్రిల్ 26 నుంచి 29 వ తేదీ వరకు పూర్తి స్థాయిలో కఠినమైన లాక్‌డౌన్‌ను అమలుచేయనున్నట్లు అదే నెల 24వ తేదీన ప్రభుత్వం ప్రకటించింది. 25వ తేదీన కోయంబేడు మార్కెట్లో కూరగాయలు, పండ్లు, పూలు కొనుగోలుకు లక్ష మంది జనం పోటెత్తారు. వ్యక్తిగత కొనుగోలుదారుపై నిషేధం ఉన్నా ఎవ్వరూ లెక్కచేయలేదు. మార్కెట్లోని కొత్తిమీర వ్యాపారి, సెలూన్ యజమాని, పూల మార్కెట్లో ఏడుగురికి, ఒక కూలీకి వైరస్ నిర్ధారణయ్యింది. కొత్తిమీర వ్యాపారి ద్వారా చెన్నైలోని మరో 13మందికి వైరస్ సోకినట్లు తేలింది. సెలూన్లో క్షవరం చేయించుకున్న 300 మందిని గుర్తించడం అధికారులకు సవాలుగా మారింది. కొన్ని రోజులుగా మార్కెట్‌కు రాకపోకలు సాగించిన హోల్‌సేల్, రిటైల్ వ్యాపారులు, కమిషన్ ఏజెంట్లు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పరీక్షలు చేయించుకోవాలని తమిళనాడు ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇదిలా ఉండగా నాలుగు రోజుల పూర్తిస్థాయి లాక్డౌన్ 29వ తేదీతో ముగియగా, మరుసటి రోజైన 30వ తేదీన లాక్‌డౌన్‌ను తీవ్రంగా సడలించి ఈ ఒక్కరోజు ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అత్యవసర వస్తువుల దుకాణాలు తెరుచుకోవచ్చని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. మే 1 నుంచి మళ్లీ లాక్డౌన్ యథాతధంగా అమల్లోకి వస్తుంది, దుకాణాలు ఉదయం 6 నుంచి మధ్యా హ్నం 1 గంట వరకే తెరిచి ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. చెన్నై కోయంబేడు కూరగాయాల మార్కెట్‌కు మరోసారి హోల్‌సేల్, రిటైల్ వ్యాపారులు, నగర ప్రజలు పెద్ద సంఖ్యలో పరుగులెత్తారు. భౌతికదూరం పాటించాలనే నిబంధనకు పూర్తిగా నీళ్లొదిలేశారు. కోయంబేడు మార్కెట్ సాయంత్రం వరకు సుమారు 50 వేల మందితో కిటకిటలాడిపోయింది. కరోనా వైరస్ కరాళ నృత్యానికి కారణమైంది. జనాన్ని కట్టడిచేయలేక కోయంబేడు మార్కెట్‌ను ఈనెల 5వ తేదీ నుంచి తాత్కాలికంగా మూసివేశారు. కోయంబేడు కారణంగా వైరస్ దాడి పెరగడంతో అధ్యయనం చేయాల్సిందిగా ఈనెల 4వ తేదీన కేంద్రం ప్రత్యేక వైద్య బృందాన్ని చెన్నైకి పంపింది. -
కరోనా: థానే కలకలం.. కోయంబేడు కలవరం
కర్నూలు(సెంట్రల్): కరోనా కట్టడికి పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు సాగుతున్న జిల్లా అధికార యంత్రాంగానికి మరో కొత్త చిక్కు వచ్చి పడింది. మహారాష్ట్రలోని థానే నుంచి జిల్లాకు తిరిగొచ్చిన వలస కూలీల్లో 37 మందికి కరోనా పాజిటివ్ రావడం, చెన్నైలోని అతిపెద్ద కూరగాయల హోల్‌సేల్ మార్కెట్ ‘కోయంబేడు’కు వెళ్లొచ్చిన వారిలో 104 మంది ఆచూకీ గల్లంతు కావడంపై అధికారుల్లో టెన్షన్ మొదలైంది. దీంతో వెంటనే అలర్ట్ అయ్యి.. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, రాజస్థాన్ తదితర రాష్ట్రాల నుంచి వస్తున్న వలసదారులపై గట్టి నిఘా వేయాలని నిర్ణయించారు. మహారాష్ట్రలోని థానే నుంచి ప్రత్యేక రైలులో 930 మంది వలస కూలీలు మంగళవారం రాత్రి గుంతకల్లు రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. (అందరి ఆర్యోగానికి భరోసా) వీరిలో అత్యధిక మంది కర్నూలు, అనంతపురం జిల్లాలకు చెందిన వారే. వీరిలో ఇప్పటివరకు 250 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 38 మందికి పాజిటివ్ వచ్చింది. ఇందులో 37 మంది కర్నూలు జిల్లావాసులు కాగా.. మిగిలిన ఒక్కరూ కడప వాసి. మిగిలిన వారందరికీ పరీక్షలు కొనసాగుతున్నాయి. పాజిటివ్ వచ్చిన వారిని జిల్లాలోని కోవిడ్ ఆసుపత్రులకు తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. మహారాష్ట్రలో దేశంలోనే అత్యధికంగా కరోనా కేసులు, మరణాలు సంభవిస్తున్నాయి. ప్రస్తుతం పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారు థానే సమీపంలోని చేపల మార్కెట్లో కూలీలుగా పని చేసినట్లు గుర్తించారు. కాగా, రెండు వారాల క్రితం ముంబై నుంచి జిల్లాకు 254 మంది వలస కూలీలు తిరిగొచ్చారు. వీరిలో ఒక్కరూ కరోనా బారిన పడకపోవడం విశేషం. (కువైట్ నుంచి వలస కార్మికులను రప్పించండి) అంతటా అప్రమత్తం వలస కూలీలను ప్రభుత్వమే స్వస్థలాలకు తీసుకొస్తుండడంతో వారిని ముందుగా క్వారంటైన్లకు తరలించి.. కరోనా పరీక్షల్లో నెగిటివ్ వచ్చిన తరువాతే ఇళ్లకు పంపుతున్నారు. అయితే.. కొందరు అనధికారికంగా ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి వస్తున్నారు. వీరు ఎలాంటి పరీక్షలు చేయించుకోకుండానే నేరుగా వస్తుండడంతో అధికారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వీరు ఇప్పటికే కరోనా బారిన పడి ఉంటే వ్యాప్తి పెరిగే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామాల్లోకి గానీ, పట్టణాల్లోకి గానీ ఎక్కడి నుంచైనా వలసదారులు వస్తే సమాచారం సేకరించాలని ఆశవర్కర్లు, ఏఎన్ఎంలు, వలంటీర్లు, సచివాలయ సిబ్బందిని అప్రమత్తం చేశారు. ప్రజలు కూడా నేరుగా రాష్ట్ర హెల్ప్‌లైన్ నంబర్ 104 లేదా 1902కు ఫోన్ చేయొచ్చని సూచిస్తున్నారు. (ఆత్మబంధువులైన అన్నదాతలకు: సీఎం జగన్ లేఖ) 104 మంది ఎక్కడ? చెన్నైలోని కోయంబేడు కూరగాయల మార్కెట్ ప్రస్తుతం కరోనా హాట్‌స్పాట్‌గా మారింది. అక్కడ పనిచేసేందుకు జిల్లాకు చెందిన కూలీలు 494 మంది వెళ్లారు. ప్రస్తుతం మార్కెట్‌ను మూసేయడంతో వారందరూ తిరిగొచ్చారు. వారిలో 390 మందిని మాత్రమే క్వారంటైన్ చేశారు. మిగిలిన 104 మంది ఆచూకీ తెలియడం లేదు. వీరు ఎక్కడున్నారో కనుగొనాలని అధికార యంత్రాంగం పోలీసులకు కాల్ డేటా అంద జేసింది. ఎక్కడి నుంచి వచ్చినా క్వారంటైన్లో ఉండాల్సిందే.. వలస కూలీలు ఎక్కడి నుంచి వచ్చినా 14 రోజులు క్వారంటైన్లో ఉండేలా కలెక్టర్ వీరపాండియన్ చర్యలు చేపట్టారు. అక్కడ వారికి భోజనం, ఇతర సదుపాయాలు, వైద్యసేవలను కల్పిస్తున్నారు. కరోనా పరీక్షలో నెగిటివ్ వచ్చిన తరువాతే ఇళ్లకు పంపేలా ఏర్పాట్లు చేశారు. ఆదోని డివిజన్‌పై ప్రత్యేక శ్రద్ధ ఆదోని రెవెన్యూ డివిజన్లోని 16 మండలాలకు చెందిన వారు ఎక్కువగా ముంబై, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు తదితర ప్రాంతాలకు వలస వెళ్లారు. ప్రస్తుతం వీరు తిరిగొస్తుండడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే కలెక్టర్ రెండుసార్లు ఆదోనిలో పర్యటించారు. టిడ్కో హౌసింగ్ సొసైటీలో ఏర్పాటు చేస్తున్న కోవిడ్ కేర్ సెంటర్‌ను త్వరగా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. -
కరోనా: కోయంబేడు లింకులపై ఆరా
సాక్షి, గుంటూరు: చెన్నైలోని కోయంబేడు మార్కెట్లో 50 మందికి పైగా కరోనా వైరస్ భారిన పడ్డారు. ఈ ప్రభావం చిత్తూరు, నెల్లూరుతో పాటు తాజాగా జిల్లాలో బయటపడింది. ఇప్పటికే తమిళనాడు పోలీసులు సెల్ టవర్ లోకేషన్ల ఆధారంగా పంపిన వివరాల మేరకు అర్బన్ జిల్లాలో 40 మందికిపైగా, రూరల్ జిల్లాలో 80 మంది ఈ మార్కెట్‌తో సంబంధం ఉన్నట్టు తెలిసింది. అయితే అర్బన్ జిల్లాలో ప్రస్తుతం 25 మంది ఉండగా మిగిలిన వాళ్లు వేరే ప్రాంతాల్లో ఉన్నట్టు సమాచారం. (రాష్ట్రంలో ప్లాస్మా థెరపీకి చర్యలు) రూరల్ జిల్లాలో 34 మంది మాత్రమే ఉన్నారని మిగిలిన వాళ్లు ఉపాధి కోసం చెన్నై వెళ్లి అక్కడే నివాసం ఉంటున్నట్టు గుర్తించారు. రూరల్ జిల్లాలో ఉన్న వారిలో తెనాలి సబ్ డివిజన్, నరసరావుపేట, బాపట్ల ప్రాంతానికి చెందిన వారుగా సమాచారం. వీరందరూ లారీ డ్రైవర్లు, క్లీనర్లు. నిత్యం జిల్లా నుంచి కోయంబేడు– జిల్లాకు కూరగాయలు సరఫరా చేస్తుంటారని తెలుస్తోంది. పోలీసులు గుర్తించిన వారందరికి వైద్య పరీక్షలు నిర్వహించి హోం క్వారంటైన్లో ఉంటూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. -
ఆ మార్కెట్‌కు వెళ్లే వర్తకులు అప్రమత్తంగా ఉండాలి
సాక్షి, విజయవాడ : చెన్నైలోని కోయంబేడు మార్కెట్ కు వెళ్లే వర్తకులు , డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం ఒక ప్రకటన లో సూచించింది. ఈ రోజు చిత్తూరు జిల్లాలో నమోదైన 16 కేసుల వివరాల్ని పరిశీలించగా పాజిటివ్ కేసులు కోయంబేడు నుంచి వచ్చిన వారుగా వైద్య ఆరోగ్య శాఖ గుర్తించిందని పేర్కొంది. అలాగే కర్నూలు జిల్లాలో గుర్తించిన కేసులు కూడా కోయంబేడు నుంచి వచ్చిన కేసులే అని తెలిపింది. నెల్లూరు లో కూడా కొన్ని కేసులకు కోయంబేడు మూలాలున్నాయి. భవిష్యత్తులో కూడా ఈ మూడు జిల్లాల్లో మరిన్ని కేసులు కోయంబేడు వెళ్లొచ్చే వారి నుంచి నమోదయ్యే అవకాశాలున్నాయని వైద్య ఆరోగ్య శాఖ భావిస్తోంది. అక్కడికెళ్లే వారిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కోయంబేడు వెళ్లే వర్తకులు , డ్రైవర్లు వైద్య ఆరోగ్య శాఖ సూచనల్ని పాటించాలనీ మాస్కులు , శానిటైజర్లు తప్పనిసరిగా వాడాలనీ విజ్ఞప్తి చేసింది. (చదవండి : కరోనా: కోయంబేడు ముప్పు ముంచుకొస్తోంది) -
కరోనా: కోయంబేడు ముప్పు ముంచుకొస్తోంది
కోయంబేడు మార్కెట్ ఉదంతంతో జిల్లా ఉలికిపడింది. అక్కడి మార్కెట్లో హమాలీల ద్వారా రోజురోజుకు వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయి. ఈ కూరగాయల మార్కెట్ నుంచి జిల్లాకు కూరగాయలు, జిల్లా నుంచి మార్కెట్‌కు పండ్లు ఎగుమతులు, దిగుమతులు జరుగుతుంటాయి. దీంతో వైద్య, ఆరోగ్యశాఖ, పోలీసు యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తమైంది. గడిచిన వారం వ్యవధిలో మార్కెట్‌కు క్రయవిక్రయాల నిమిత్తం వెళ్లిన వారందరిని చెక్‌పోస్టు డేటా ఆధారంగా గుర్తించి వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లా నుంచి సుమారు 130 మందికి పైగా మార్కెట్‌కు వెళ్లినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. సాక్షి, నెల్లూరు: చెన్నైలోని కోయంబేడు కూరగాయల మార్కెట్ అతిపెద్దది. ఇక్కడి నుంచి నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్ కడప, ప్రకాశం జిల్లాలకు సైతం కూరగాయల రవాణా జరుగుతోంది. జిల్లాలోని సూళ్లూరుపేట, గూడూరు, నెల్లూరు నగర మార్కెట్, కావలి మార్కెట్‌కు నుంచి నిత్యం దిగుమతులు జరుగుతుంటాయి. కోవూరు, ఇందుకూరుపేట నుంచి అరటి పండ్లు, అరటి ఆకులు, గూడూరు మార్కెట్ నుంచి నిమ్మ, సూళ్లూరుపేటలోని పలు ప్రాంతాల నుంచి కూరగాయలు ఇలా సుమారు 15కు పైగా లారీల్లో కోయంబేడు మార్కెట్‌కు ఎగుమతులు జరుగుతుంటాయి. లాక్డౌన్ నేపథ్యంలో నెల్లూరు మార్కెట్‌కు మినహా మిగిలిన మార్కెట్లకు రోజుకు సగటున ఐదారు లారీల్లో కూరగాయల దిగుమతి జరుగుతోంది. చెన్నై నగరంలో 2,700కు పైగా కేసులు నమోదు కాగా, కోయంబేడు మార్కెట్ ప్రాంతంలోని హమాలీలు, ఇతర కాంట్రాక్టర్ల ద్వారా 300కు పైగా కేసులు నమోదయ్యాయి. గత రెండు రోజులుగా కోయంబేడు మార్కెట్లో 30కు పైగా కేసులు బయటపడ్డాయి. ఇక్కడి నుంచి జిల్లాలోని తడ, నాయుడుపేట, సూళ్లూరుపేటతో పాటు చిత్తూరు జిల్లా తిరుపతి, సత్యవేడు ప్రాంతాల్లోని వ్యాపారులు నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. సత్యవేడులోనూ కోయంబేడు మార్కెట్‌కు వెళ్లొచ్చిన నలుగురికి పాజిటివ్ వచ్చింది. దీంతో జిల్లా యంత్రాంగం ముందుగానే అప్రమత్తమైంది. శుక్రవారం సూళ్లూరుపేట, నెల్లూరు సిటీ, నాయుడుపేట, గూడూరు, వెంకటగిరి ప్రాంతాల్లో 96 మందికి ట్రూనాట్ కిట్ల ద్వారా వైద్య పరీక్షలు నిర్వహించారు. మరో 40 మందికి పైగా వెళ్లి వచ్చిన వారిని ప్రాథమికంగా గుర్తించారు. తడ చెక్‌పోస్టులోని పోలీస్ డేటా ఆధారంగా వీరిని గుర్తించి వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది పరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్ శనివారం కలెక్టర్ ఎంవీ శేషగిరిబాబు, ఎస్పీ భాస్కర్‌భూషణ్‌తో సమీక్ష సమావేశం నిర్వహించారు. కోయంబేడు మార్కెట్‌కు వెళ్లి వచ్చిన వ్యాపారులు, లారీ డ్రైవర్లు, హమాలీలు, ఇతరులకు పూర్తి స్థాయిలో మరిన్ని పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. నెల్లూరు మార్కెట్ తరలింపు యోచన కోయంబేడు మార్కెట్ ఘటనతో నెల్లూరు కూరగాయల మార్కెట్ పరిస్థితిపై అధికారులు సమీక్షించారు. కలెక్టర్ ఎంవీ శేషగిరిబాబు మార్కెట్ ప్రాంతాన్ని పరిశీలించారు. మార్కెట్లో 400కు పైగా షాపులు ఉండగా ప్రస్తుతం 100 షాపులు మాత్రమే విక్రయాలు సాగిస్తున్నాయి. అవి కూడా పూర్తిస్థాయి ఆంక్షలతో విక్రయాలు జరుగుతున్నాయి. ప్రస్తుత తరుణంలో మార్కెట్లో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయనే యోచనతో నెల్లూరు మార్కెట్‌ను తాత్కాలికంగా మరో ప్రాంతానికి తరలించాలని అధికార యంత్రాంగం యోచిస్తోంది. స్టోన్‌హౌస్‌పేటలో రెండు పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. బాగా రద్దీ ఉండే ప్రాంతం కావడంతో ఈ మార్కెట్‌ను కూడా తరలించాలని యోచిస్తున్నారు. మార్కెట్ సెంటర్లోని ఫ్రూట్ మార్కెట్, హైవే సమీపంలోని వేణుగోపాల స్వామి కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేయడానికి కసరత్తు చేసి ఆదివారం ఖరారు చేయనున్నారు. సరిహద్దులో అలజడి.. తడ: తమిళనాడులో కరోనా కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. చెన్నై నగరంలో కూడా కేసులు ఉధృతంగా ఉన్న నేపథ్యంలో అక్కడి నుంచి వస్తున్న వాహనాలను కట్టడి చేస్తున్నారు. సరిహద్దుల్లో వాహనాలు నిలిపివేయడంతో అలజడి పెరిగింది. భారీస్థాయిలో వాహనాలు వస్తుండడంతో అదుపు చేసేందుకు పోలీసులు సతమతమవుతున్నారు. లాక్‌డౌన్‌తో ఆంధ్రా, ఇతర రాష్ట్రాల వారు పెద్ద సంఖ్యలో తమిళనాడులో చిక్కుకు పోయారు. వారందరూ స్వస్థలాలకు వెళ్లేందుకు యత్నాలు మొదలు పెట్టారు. తమిళనాడులోని ఉన్నతాధికారుల అనుమతులు తీసుకుని స్వస్థలాలకు పయనమయ్యారు. అయితే చెన్నై కోయంబేడులో కేసులు పెరుగుతున్న దృష్ట్యా అటు వైపు నుంచి వస్తున్న వాహనాలను పూర్తిస్థాయిలో తనిఖీ చేయాలని ఎస్పీ భాస్కర్‌భూషణ్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో సూళ్లూరుపేట సీఐ వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో తనిఖీ చేసి అత్యవసరమైన వాటిని మాత్రమే అనుమతిస్తున్నారు. శుక్రవారం తమిళనాడు నుంచి వచ్చిన వందలాది వాహనాలు కిలో మీటర్ల మేర నిలిచిపోయాయి. వందల కిలో మీటర్లు నడిచి వస్తున్న వలస కూలీలకు తడ, సూళ్లూరుపేటల్లో భోజన వసతి కల్పించి రాష్ట్రానికి చెందిన వారిని వసతి కేంద్రానికి తరలించి మిగతా వారిని తమిళనాడు అధికారులతో మాట్లాడి వెనక్కి పంపేస్తున్నారు. -
కరోనా: కొంపముంచిన కోయంబేడు
సాక్షి, చిత్తూరు అర్బన్: జిల్లాలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసులు 85 ఉన్నాయి. ఇందులో 74 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవడం వైద్యుల సేవలకు, అధికారుల ముందస్తు ప్రణాళికలను దర్పం పడుతోంది. ఇదే సమయంలో కరోనా మహమ్మారి ఏదో ఒకదారి నుంచి జిల్లాలోకి ప్రవేశిస్తోంది. మొన్నటి వరకు ఢిల్లీలో జమాత్‌కు వెళ్లి వచ్చిన వారి ద్వారా వైరస్ విస్తరించింది. తాజాగా చెన్నైలోని కోయంబేడు మార్కెట్ కేంద్రంగా పంజా విసురుతోంది. ముందస్తు సమాచారం అందుకున్న ప్రభుత్వం జిల్లా అధికారులను అప్రమత్తం చేసింది. కోయంబేడు సంగతి ఇదీ..! తమిళనాడులోని చెన్నై నగరంలో బస్టాండుకు ఆనుకుని కోయంబేడు మార్కెట్ ఉంది. ఆసియాలోనే అతిపెద్ద కూరగాయల మార్కెట్ ఇదే కావడం గమనార్హం. చెన్నైకి సమీపంలో ఉన్న ఎనిమిది జిల్లాలతో పాటు మన జిల్లా, నెల్లూరు, కర్ణాటక, కేరళ నుంచి కూడా పెద్ద ఎత్తున కూరగాయలు ఇక్కడ లోడింగ్, అన్లోడింగ్ జరుగుతుంటుంది. లాక్డౌన్ నేపథ్యంలో రైతులు పండించిన పంటలను అమ్ముకునే వెలుసుకుబాటు కలి్పంచడంతో ఇటీవల ఇక్కడ పెద్ద సంఖ్యలో వ్యాపారాలు జరిగాయి. అయితే భౌతికదూరం పాటించకపోవడంతో పెద్ద ఎత్తున రద్దీ ఏర్పడింది. ఫలితంగా కరోనా పంజా విసిరింది. తమిళనాడు మొత్తంలో ఇప్పటివరకు 6,009 కేసులు నమోదైతే ఒక్క చెన్నైలోనే 3,043 కరోనా పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. అందులోనూ కోయంబేడు మార్కెట్ ద్వారా 600 మందికి పైగా కరోనా సోకింది. మన జిల్లా చెన్నైకి సరిహద్దు కావడంతో కూరగాయలు లారీల్లో తీసుకెళ్లే డ్రైవర్ల ద్వారా వైరస్ రావచ్చని జిల్లా యంత్రాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. రంగంలోకి యంత్రాంగం ప్రభుత్వ ఆదేశాలతో రంగంలోకి దిగిన జిల్లా యంత్రాంగం కోయంబేడుకు వెళ్లొచ్చినవారి వివరాలు సేకరిస్తోంది. ఇప్పటివరకు 160 మంది కోయంబేడుకు వెళ్లొచ్చినట్లు పోలీసులు గుర్తించారు. వీరిలో 80 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఫలితాలు రావాల్సి ఉంది. మిగిలిన వారిని క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. వీరిలో పలువురికి కరోనా లక్షణాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఈ ఫలితాలు శనివారం వెల్లడికానున్నాయి. ఇంకా ఎవరైనా కోయంబేడుకు వెళ్లినవారున్నారేమోనని వలంటీర్లు, పోలీసుల ద్వారా విచారిస్తున్నారు. 11 మందికి కరోనా లక్షణాలు చిత్తూరు కార్పొరేషన్: కోయంబేడు మార్కెట్‌తో సంబంధం ఉన్న జిల్లా వాసులు 11 మందిలో శుక్రవారం కరోనా లక్షణాలు కనబడ్డాయని కలెక్టరేట్ అధికారులు తెలిపారు. వారిలో వి.కోటకు చెందిన ఐదుగురు ఉన్నారు. దాసరకుప్పంవాసులు ఇద్దరు, బీఎన్‌కండ్రిగ వాసి ఒకరు, వరదయ్యపాళెం వాసి ఒకరు, తిరుపతి రూరల్ వాసి ఒకరు, మదనపల్లెకు చెందిన ఒకరు ఉన్నారు. వారిని అధికారులు ఆస్పత్రులకు తరలించారు. వైద్యశాఖ శనివారం విడుదలచేసే బులెటిన్‌లో ఈ వివరాలను అధికారికంగా నిర్ధారించనుంది. అదేవిధంగా నాగలాపురానికి చెందిన 11 మందికి లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో వారి శాంపిళ్లను వైద్య పరీక్షల కోసం తిరుపతి ఆస్పత్రికి పంపారు. రెడ్ జోన్‌గా వి.కోట వి.కోట: పట్టణంలో ఐదుగురికి కరోనా లక్షణాలు కని్పంచడంతో ఎమ్మెల్యే వెంకటేగౌడతో కలసి కలెక్టర్ నారాయణ భరత్ గుప్త, సబ్ కలెక్టర్ కీర్తి చేకూరి శుక్రవారం సందర్శించారు. వ్యవసాయ మార్కెట్, పట్రపల్లి, ఎంపీడీఓ కార్యాలయం, పట్టణంలో పలు ప్రదేశాల్లో తీసుకోవలసిన జాగ్రత్తలపై అధికారులకు పలు సూచనలు చేశారు. వి.కోట పరిధి నుంచి మూడు కిలోమీటర్ల వరకు రెడ్‌జోన్‌గా ప్రకటిస్తున్నట్లు తెలిపారు. -
కోయంబేడు మార్కెట్ కుర్రాళ్ల కథే గోలీసోడా
కోయంబేడు మార్కెట్లో పని చేసే కుర్రాళ్ల ఇతివృత్తమే గోలీ సోడా అని ఆ చిత్ర దర్శకుడు విజయ్ మిల్టన్ తెలిపారు. ప్రముఖ ఛాయాగ్రహకుడైన ఈయన తొలిసారిగా మెగాఫోన్ పట్టి తెరకెక్కించిన చిత్రం గోలీ సోడా. ఇందులో పసంగ చిత్రం ద్వారా జాతీయ అవార్డులు గెలుచుకున్న బాలనటులు శ్రీరామ్, కిషోర్‌తో పాటు పాండి, మురుగేశ్ ప్రధాన పాత్రలు పోషించారు. వీరితో చాందిని, సీత నటించారు. ఈ చిత్రం ఈ నెల 24న తెరపైకి రానుంది. చిత్రం గురించి దర్శకుడు విజయ్ మిల్టన్ తెలుపుతూ చెన్నైలోని కోయంబేడు కూరగాయల మార్కెట్ మన దేశంలోనే అతిపెద్దదని తెలిపారు. ఇక్కడకు నిత్యం వేలాది మంది వచ్చి పోతుంటారని పేర్కొన్నారు. అలాంటి మార్కెట్లో పని చేస్తూ మగ్గిపోయే నలుగురు కుర్రాళ్లు తమకంటూ ఒక గుర్తింపు కోసం చేసే ప్రయత్నమే గోలీసోడా అని తెలిపారు. చిత్రంలోని ఏడు నిమిషాల 49 సెకన్లు ఉండే ఫైట్ సన్నివేశాన్ని స్టంట్ మాస్టర్ సుప్రియ సుందర్ కంపోజ్ చేయగా ఒక షాట్లో చిత్రీకరించినట్లు చెప్పారు. దర్శకుడు పాడిరాజా మాటలు రాశారని పేర్కొన్నారు. అరుణగిరి సంగీతాన్ని అందించారని, చిత్రాన్ని దర్శకుడు లింగుస్వామి సంస్థ తిరుపతి బ్రదర్స్ విడుదల చేయడం సంతోషంగా ఉందని దర్శకుడు తెలిపారు.