కోయంబేడు మార్కెట్‌లో పని చేసే కుర్రాళ్ల ఇతివృత్తమే గోలీ సోడా అని ఆ చిత్ర దర్శకుడు విజయ్ మిల్టన్ తెలిపారు. ప్రముఖ ఛాయాగ్రహకుడైన ఈయన తొలిసారిగా మెగాఫోన్ పట్టి తెరకెక్కించిన చిత్రం గోలీ సోడా. ఇందులో పసంగ చిత్రం ద్వారా జాతీయ అవార్డులు గెలుచుకున్న బాలనటులు శ్రీరామ్, కిషోర్‌తో పాటు పాండి, మురుగేశ్ ప్రధాన పాత్రలు పోషించారు. వీరితో చాందిని, సీత నటించారు. ఈ చిత్రం ఈ నెల 24న తెరపైకి రానుంది. చిత్రం గురించి దర్శకుడు విజయ్ మిల్టన్ తెలుపుతూ చెన్నైలోని కోయంబేడు కూరగాయల మార్కెట్ మన దేశంలోనే అతిపెద్దదని తెలిపారు.
ఇక్కడకు నిత్యం వేలాది మంది వచ్చి పోతుంటారని పేర్కొన్నారు. అలాంటి మార్కెట్‌లో పని చేస్తూ మగ్గిపోయే నలుగురు కుర్రాళ్లు తమకంటూ ఒక గుర్తింపు కోసం చేసే ప్రయత్నమే గోలీసోడా అని తెలిపారు. చిత్రంలోని ఏడు నిమిషాల 49 సెకన్లు ఉండే ఫైట్ సన్నివేశాన్ని స్టంట్ మాస్టర్ సుప్రియ సుందర్ కంపోజ్ చేయగా ఒక షాట్‌లో చిత్రీకరించినట్లు చెప్పారు. దర్శకుడు పాడిరాజా మాటలు రాశారని పేర్కొన్నారు. అరుణగిరి సంగీతాన్ని అందించారని, చిత్రాన్ని దర్శకుడు లింగుస్వామి సంస్థ తిరుపతి బ్రదర్స్ విడుదల చేయడం సంతోషంగా ఉందని దర్శకుడు తెలిపారు.
కోయంబేడు మార్కెట్ కుర్రాళ్ల కథే గోలీసోడా
Published Sat, Jan 18 2014 1:37 AM | Last Updated on Sat, Sep 2 2017 2:43 AM
Advertisement