ఎమ్మెల్యే వెంకటేగౌడతో కలసి వి.కోటలో పర్యటిస్తున్న కలెక్టర్ నారాయణ భరత్ గుప్త, సబ్‌కలెక్టర్ కీర్తి చేకూరి
సాక్షి, చిత్తూరు అర్బన్: జిల్లాలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసులు 85 ఉన్నాయి. ఇందులో 74 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవడం వైద్యుల సేవలకు, అధికారుల ముందస్తు ప్రణాళికలను దర్పం పడుతోంది. ఇదే సమయంలో కరోనా మహమ్మారి ఏదో ఒకదారి నుంచి జిల్లాలోకి ప్రవేశిస్తోంది. మొన్నటి వరకు ఢిల్లీలో జమాత్‌కు వెళ్లి వచ్చిన వారి ద్వారా వైరస్ విస్తరించింది. తాజాగా చెన్నైలోని కోయంబేడు మార్కెట్ కేంద్రంగా పంజా విసురుతోంది. ముందస్తు సమాచారం అందుకున్న ప్రభుత్వం జిల్లా అధికారులను అప్రమత్తం చేసింది.
కోయంబేడు సంగతి ఇదీ..!
తమిళనాడులోని చెన్నై నగరంలో బస్టాండుకు ఆనుకుని కోయంబేడు మార్కెట్ ఉంది. ఆసియాలోనే అతిపెద్ద కూరగాయల మార్కెట్ ఇదే కావడం గమనార్హం. చెన్నైకి సమీపంలో ఉన్న ఎనిమిది జిల్లాలతో పాటు మన జిల్లా, నెల్లూరు, కర్ణాటక, కేరళ నుంచి కూడా పెద్ద ఎత్తున కూరగాయలు ఇక్కడ లోడింగ్, అన్‌లోడింగ్ జరుగుతుంటుంది. లాక్‌డౌన్ నేపథ్యంలో రైతులు పండించిన పంటలను అమ్ముకునే వెలుసుకుబాటు కలి్పంచడంతో ఇటీవల ఇక్కడ పెద్ద సంఖ్యలో వ్యాపారాలు జరిగాయి. అయితే భౌతికదూరం పాటించకపోవడంతో పెద్ద ఎత్తున రద్దీ ఏర్పడింది. ఫలితంగా కరోనా పంజా విసిరింది. తమిళనాడు మొత్తంలో ఇప్పటివరకు 6,009 కేసులు నమోదైతే ఒక్క చెన్నైలోనే 3,043 కరోనా పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. అందులోనూ కోయంబేడు మార్కెట్ ద్వారా 600 మందికి పైగా కరోనా సోకింది. మన జిల్లా చెన్నైకి సరిహద్దు కావడంతో కూరగాయలు లారీల్లో తీసుకెళ్లే డ్రైవర్ల ద్వారా వైరస్ రావచ్చని జిల్లా యంత్రాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది.
రంగంలోకి యంత్రాంగం
ప్రభుత్వ ఆదేశాలతో రంగంలోకి దిగిన జిల్లా యంత్రాంగం కోయంబేడుకు వెళ్లొచ్చినవారి వివరాలు సేకరిస్తోంది. ఇప్పటివరకు 160 మంది కోయంబేడుకు వెళ్లొచ్చినట్లు పోలీసులు గుర్తించారు. వీరిలో 80 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఫలితాలు రావాల్సి ఉంది. మిగిలిన వారిని క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. వీరిలో పలువురికి కరోనా లక్షణాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఈ ఫలితాలు శనివారం వెల్లడికానున్నాయి. ఇంకా ఎవరైనా కోయంబేడుకు వెళ్లినవారున్నారేమోనని వలంటీర్లు, పోలీసుల ద్వారా విచారిస్తున్నారు.
11 మందికి కరోనా లక్షణాలు
చిత్తూరు కార్పొరేషన్: కోయంబేడు మార్కెట్‌తో సంబంధం ఉన్న జిల్లా వాసులు 11 మందిలో శుక్రవారం కరోనా లక్షణాలు కనబడ్డాయని కలెక్టరేట్ అధికారులు తెలిపారు. వారిలో వి.కోటకు చెందిన ఐదుగురు ఉన్నారు. దాసరకుప్పంవాసులు ఇద్దరు, బీఎన్‌కండ్రిగ వాసి ఒకరు, వరదయ్యపాళెం వాసి ఒకరు, తిరుపతి రూరల్ వాసి ఒకరు, మదనపల్లెకు చెందిన ఒకరు ఉన్నారు. వారిని అధికారులు ఆస్పత్రులకు తరలించారు. వైద్యశాఖ శనివారం విడుదలచేసే బులెటిన్‌లో ఈ వివరాలను అధికారికంగా నిర్ధారించనుంది. అదేవిధంగా నాగలాపురానికి చెందిన 11 మందికి లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో వారి శాంపిళ్లను వైద్య పరీక్షల కోసం తిరుపతి ఆస్పత్రికి పంపారు.
రెడ్ జోన్‌గా వి.కోట
వి.కోట: పట్టణంలో ఐదుగురికి కరోనా లక్షణాలు కని్పంచడంతో ఎమ్మెల్యే వెంకటేగౌడతో కలసి కలెక్టర్ నారాయణ భరత్ గుప్త, సబ్ కలెక్టర్ కీర్తి చేకూరి శుక్రవారం సందర్శించారు. వ్యవసాయ మార్కెట్, పట్రపల్లి, ఎంపీడీఓ కార్యాలయం, పట్టణంలో పలు ప్రదేశాల్లో తీసుకోవలసిన జాగ్రత్తలపై అధికారులకు పలు సూచనలు చేశారు. వి.కోట పరిధి నుంచి మూడు కిలోమీటర్ల వరకు రెడ్‌జోన్‌గా ప్రకటిస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment