కరోనా: థానే కలకలం.. కోయంబేడు కలవరం | Thane Return 37 People Are Have Coronavirus Positive In Kurnool District | Sakshi
Sakshi News home page

కరోనా: థానే కలకలం.. కోయంబేడు కలవరం

Published Thu, May 14 2020 8:28 AM | Last Updated on Thu, May 14 2020 8:28 AM

Thane Return 37 People Are Have Coronavirus Positive In Kurnool District - Sakshi

కోసిగి క్వారంటైన్‌లో వలస కూలీలకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్న దృశ్యం

కర్నూలు(సెంట్రల్‌): కరోనా కట్టడికి పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు సాగుతున్న జిల్లా అధికార యంత్రాంగానికి మరో కొత్త చిక్కు వచ్చి పడింది. మహారాష్ట్రలోని థానే నుంచి జిల్లాకు తిరిగొచ్చిన వలస కూలీల్లో 37 మందికి కరోనా పాజిటివ్‌ రావడం, చెన్నైలోని అతిపెద్ద కూరగాయల హోల్‌సేల్‌ మార్కెట్‌ ‘కోయంబేడు’కు వెళ్లొచ్చిన వారిలో 104 మంది ఆచూకీ గల్లంతు కావడంపై అధికారుల్లో టెన్షన్‌ మొదలైంది. దీంతో వెంటనే అలర్ట్‌ అయ్యి.. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, రాజస్థాన్‌ తదితర రాష్ట్రాల నుంచి వస్తున్న వలసదారులపై గట్టి నిఘా వేయాలని నిర్ణయించారు. మహారాష్ట్రలోని థానే నుంచి ప్రత్యేక రైలులో 930 మంది వలస కూలీలు మంగళవారం రాత్రి  గుంతకల్లు రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. (అందరి ఆర్యోగానికి భరోసా)

వీరిలో అత్యధిక మంది కర్నూలు, అనంతపురం జిల్లాలకు చెందిన వారే. వీరిలో ఇప్పటివరకు 250 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 38 మందికి పాజిటివ్‌ వచ్చింది. ఇందులో 37 మంది కర్నూలు జిల్లావాసులు కాగా.. మిగిలిన ఒక్కరూ కడప వాసి. మిగిలిన వారందరికీ పరీక్షలు కొనసాగుతున్నాయి.  పాజిటివ్‌ వచ్చిన వారిని జిల్లాలోని కోవిడ్‌ ఆసుపత్రులకు తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. మహారాష్ట్రలో దేశంలోనే అత్యధికంగా కరోనా కేసులు, మరణాలు సంభవిస్తున్నాయి. ప్రస్తుతం పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారు థానే సమీపంలోని చేపల మార్కెట్‌లో  కూలీలుగా పని చేసినట్లు గుర్తించారు. కాగా, రెండు వారాల క్రితం ముంబై నుంచి జిల్లాకు 254 మంది వలస కూలీలు తిరిగొచ్చారు. వీరిలో ఒక్కరూ కరోనా బారిన పడకపోవడం విశేషం. (కువైట్‌ నుంచి వలస కార్మికులను రప్పించండి)

అంతటా అప్రమత్తం 
వలస కూలీలను ప్రభుత్వమే స్వస్థలాలకు తీసుకొస్తుండడంతో వారిని ముందుగా క్వారంటైన్లకు తరలించి.. కరోనా పరీక్షల్లో నెగిటివ్‌ వచ్చిన తరువాతే ఇళ్లకు పంపుతున్నారు. అయితే.. కొందరు అనధికారికంగా ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి వస్తున్నారు.  వీరు ఎలాంటి పరీక్షలు చేయించుకోకుండానే నేరుగా వస్తుండడంతో అధికారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వీరు ఇప్పటికే కరోనా బారిన పడి ఉంటే వ్యాప్తి పెరిగే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామాల్లోకి గానీ, పట్టణాల్లోకి గానీ ఎక్కడి నుంచైనా వలసదారులు వస్తే సమాచారం సేకరించాలని ఆశవర్కర్లు, ఏఎన్‌ఎంలు, వలంటీర్లు, సచివాలయ సిబ్బందిని అప్రమత్తం చేశారు. ప్రజలు కూడా నేరుగా రాష్ట్ర హెల్ప్‌లైన్‌ నంబర్‌ 104 లేదా 1902కు ఫోన్‌ చేయొచ్చని సూచిస్తున్నారు. (ఆత్మబంధువులైన అన్నదాతలకు: సీఎం జగన్‌ లేఖ)

104 మంది ఎక్కడ? 
చెన్నైలోని కోయంబేడు కూరగాయల మార్కెట్‌ ప్రస్తుతం కరోనా హాట్‌స్పాట్‌గా మారింది. అక్కడ పనిచేసేందుకు జిల్లాకు చెందిన కూలీలు 494 మంది వెళ్లారు. ప్రస్తుతం మార్కెట్‌ను మూసేయడంతో వారందరూ తిరిగొచ్చారు. వారిలో 390 మందిని మాత్రమే క్వారంటైన్‌ చేశారు. మిగిలిన 104 మంది ఆచూకీ తెలియడం లేదు. వీరు ఎక్కడున్నారో కనుగొనాలని అధికార యంత్రాంగం పోలీసులకు కాల్‌ డేటా అంద జేసింది.  

ఎక్కడి నుంచి వచ్చినా క్వారంటైన్‌లో ఉండాల్సిందే.. 
వలస కూలీలు ఎక్కడి నుంచి వచ్చినా 14 రోజులు క్వారంటైన్‌లో ఉండేలా  కలెక్టర్‌ వీరపాండియన్‌  చర్యలు చేపట్టారు. అక్కడ వారికి భోజనం, ఇతర సదుపాయాలు, వైద్యసేవలను కల్పిస్తున్నారు. కరోనా పరీక్షలో నెగిటివ్‌ వచ్చిన తరువాతే ఇళ్లకు పంపేలా ఏర్పాట్లు చేశారు.  

ఆదోని  డివిజన్‌పై ప్రత్యేక శ్రద్ధ  
ఆదోని రెవెన్యూ డివిజన్‌లోని 16 మండలాలకు చెందిన వారు ఎక్కువగా ముంబై, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు తదితర ప్రాంతాలకు వలస వెళ్లారు. ప్రస్తుతం వీరు తిరిగొస్తుండడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే  కలెక్టర్‌ రెండుసార్లు ఆదోనిలో పర్యటించారు. టిడ్కో హౌసింగ్‌         సొసైటీలో ఏర్పాటు చేస్తున్న కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ను త్వరగా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.    

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement