కరోనా పేరుతో కొత్త మోసాలు     | Coronavirus: Virus Related Crime In Kurnool District | Sakshi
Sakshi News home page

కరోనా పేరుతో కొత్త మోసాలు    

Published Sat, May 23 2020 8:28 AM | Last Updated on Sat, May 23 2020 8:30 AM

Coronavirus: Virus Related Crime In Kurnool District - Sakshi

‘కోవిడ్‌–19 సమాచారాన్ని తెలుసుకోండి’ అంటూ మీ సెల్‌ఫోన్లకు సందేశాల రూపంలో ఏవైనా లింకులు వస్తున్నాయా? వాటిని చదివే ప్రయత్నం చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. పొరపాటున  లింక్‌లు టచ్‌ చేస్తే  బ్యాంకు ఖాతాలోని సొమ్ము క్షణాల్లో ఖాళీ అయిపోవచ్చు.  లాక్‌డౌన్‌ వేళ సైబర్‌ నేరగాళ్లు రూట్‌ మార్చి లూటీ చేస్తున్నారు. కర్నూలు నగరానికి చెందిన ఒక వ్యక్తిని ఇదే తరహాలో బురిడీ  కొట్టించారు. తక్కువ ధరలకే మాస్కులు సరఫరా చేస్తామంటూ నమ్మబలికి రూ.1.50 లక్షలు ఖాతాలో వేయించుకుని మోసం చేశారు. అలాగే రోగిని తరలించడానికి  అంబులెన్స్‌ను పంపుతున్నట్లు రూ.15 వేలు ఖాతాలో వేయించుకుని ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసిన సంఘటన కూడా చోటుచేసుకుంది. ఈ ఇద్దరు బాధితులు కూడా కర్నూలు పట్టణానికి చెందినవారే.   

సాక్షి, కర్నూలు: లాక్‌డౌన్‌ ప్రారంభం అయినప్పటి నుంచి జిల్లాలో అన్ని రకాల నేరాలు పూర్తిగా తగ్గాయి. కేసుల నమోదులో 90 శాతం తగ్గుదల కనిపించింది. హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు, దొంగతనాలు, రోడ్డు ప్రమాదాలు, కక్షలు, మహిళలపై వేధింపులు వంటి నేరాలు పూర్తిగా తగ్గినప్పటికీ సైబరాసురులు మాత్రం జిల్లా ప్రజలకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. కోవిడ్‌ను నియంత్రించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నాయి. లాక్‌డౌన్‌ మార్చి 22 నుంచి రెండు నెలలుగా అమలులో ఉంది. ఈ సమయంలో సైబర్‌ నేరగాళ్లు చేతివాటం ప్రదర్శించుతున్నారు. తేలికగా భారీ మొత్తం డబ్బు కొట్టేసేందుకు అలవాటు పడ్డ కేటుగాళ్లు కరోనా నేపథ్యంలో కొత్త ఎత్తులతో వల వేస్తున్నారు. ( మృతదేహంలో కరోనా ఎంతకాలం ఉంటుంది?)

కోవిడ్‌ యాప్, వర్క్‌ ఫ్రం హోం, పీఎం కేర్స్‌ నకిలీ ఖాతాలు తదితర మార్గాల ద్వారా బురిడీ కొట్టిస్తున్నారు. తమ వద్ద ఉన్న యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకుంటే  కరోనా పాజిటివ్‌ ఉన్నవారు మీ సమీపంలోకి రాగానే ఇట్టే తెలిసిపోతుందని చెప్పి మోసం చేస్తున్నారు. జిల్లాకు చెందిన ఓ వ్యక్తిని నమ్మించి రూ.40 వేలు బురిడీ కొట్టించారు. ఈ నెల 2 వ తేదీన డెత్‌ ఇన్‌స్యూరెన్స్‌ ఇస్తామని గోనెగండ్ల పట్టణానికి చెందిన ఒక వ్యక్తిని నమ్మించి రూ.36 వేలు స్వాహా చేసిన సంఘటన సంచలనంగా మారింది. ఇందులో స్థానిక ఎస్‌ఐ కూడా సైబర్‌ నేరగాళ్ల మాటలకు బోల్తా పడడం సంచలనంగా మారింది.        

డబ్బులు కాజేస్తారిలా.. 
కోవిడ్‌– 19 పదజాలంతో సెల్‌ఫోన్‌కు సందేశాల రూపంలో లింక్‌ పంపిస్తారు. సమగ్ర సమాచారం కోసం ఆ లింక్‌ను ఓపెన్‌ చేయాలని సూచిస్తారు. ఇలా చేసిన వెంటనే సెల్‌ఫోన్‌లోకి ఓ మోసపూరిత యాప్‌ (స్పైవేర్‌) వచ్చిపడుతుంది. దీంతో ఫోన్‌ వాళ్ల ఆధీనంలోకి వెళుతుంది. ఫోన్‌ బ్యాంకింగ్‌ యాప్‌ లేదా బ్రౌజర్‌తో నెట్‌ బ్యాంకింగ్‌ లోకి లాగిన్‌ అయితే యూజర్‌ నేమ్, పాస్‌వర్డ్‌ వివరాలు సైబర్‌ నేరగాళ్లకు చేరుతాయి. బ్యాంకు నుంచి వచ్చే ఓటీపీలను ఈ స్పైవేర్‌ కాజేస్తుంది. దాంతో సైబర్‌ నేరగాళ్లు ఖాతాలు కొల్లగొడతారు. క్రెడిట్, డెబిట్‌ కార్డు నెంబర్లు, వాటి సీవీవీ తదితర వివరాలను సెల్‌ఫోన్లలో సేవ్‌ చేస్తే ఆ వివరాలను సైబర్‌ నేరగాళ్ల కాజేసి డబ్బులు దోచుకుంటారు.   

మద్యం పేరుతో మోసం..
లాక్‌డౌన్‌ సమయంలో మద్యం అమ్మకాలు నిలిచిపోవడంతో డోర్‌ డెలివరీ చేస్తామంటూ సైబర్‌ నేరగాళ్లు మోసానికి పాల్పడ్డారు. మీకు కావలసిన మద్యం ఎంఆర్‌పీలో సగం డబ్బులు ముందుగా చెల్లించి, అర్డర్‌ ఇంటికి చేరగానే మిగితా సగం ఇవ్వాలని ప్రకటనలు గుప్పించారు. వీటిని నమ్మి సంప్రదించిన మద్యం ప్రియులకు క్యూఆర్‌ కోడ్‌ లేదా లింక్‌ పంపి నగదు బదిలీ చేయించుకుని మోసాలకు పాల్పడిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఆన్‌లైన్లో వస్తువుల కొనుగోలు పేరుతో కూడా బురిడీ కొట్టిస్తున్నారు. 

కర్నూలులోని బాలాజీ నగర్‌కు చెందిన ఒక వ్యక్తిని ఈ తరహాలోనే మోసం చేశారు. టీవీ కొనుగోలు కోసం ప్రముఖ వెబ్‌సైట్‌ను అతను సంప్రదించగా కొంత మొత్తాన్ని అడ్వాన్స్‌గా చెల్లించాలని నమ్మించి ఖాతాకు డబ్బు జమ కాగానే టీవీని ప్యాకింగ్‌ చేస్తున్నట్లు ఒక ఫొటో, ట్రక్కు నందు పార్సిల్‌ çపంపుతునట్లు మరో ఫొటోను అతనికి పంపి మిగిలిన మొత్తాన్ని సైబర్‌ నేరగాడు ఖాతాలో వేయించుకుని మోసం చేశాడు. వారం రోజులు గడిచినా టీవీ ఇంటికి రాకపోవడంతో మోసపోయినట్లు గ్రహించి బాధితుడు సైబర్‌ పోలీసులను ఆశ్రయించాడు. 

అపరిచితుల లింకులను  అనుమతించొద్దు 
కోవిడ్‌–19 సమాచారం పేరిట వచ్చే తెలియని లింకులు ఎట్టి పరిస్ధితులలో తెరవద్దు. పొరపాటున ఓపెన్‌ చేసినా, దాన్ని ఇన్‌స్టాల్‌ చేయడానికి అనుమతించొదు. తెలియకుండా ఈ రెండు చేస్తే వెంటనే మీ సెల్‌ ఫోన్లో కాంటాక్ట్, ఇతర ముఖ్యమైన సమాచారాన్ని భద్రపరచుకొని ఫ్యాక్టరీ సెట్టింగ్‌లోకి వెళ్లి ఫోన్‌ను రీసెట్‌ చేసుకోవాలి. ఇలా చేస్తే కొంత వరకు సైబర్‌ నేరగాళ్ల బారిన పడకుండా బయటపడవచ్చు.  – ఎస్పీ డాక్టర్‌ ఫక్కీరప్ప      

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement