సంతోషి మీనా
జైపూర్: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ సెంకడ్ వేవ్ తీవ్రంగా విస్తరించడంతో ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్ల వినియోగం పెరిగిపోయింది. నాసిరకమైన ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను కోవిడ్ బాధితులు వాడటంతో శ్వాస సమస్యలు మరింత తీవ్రమై వారి ప్రాణాలకు ముప్పుగా మారుతోంది. నాణ్యతలోపం కారణంగా కాన్సంట్రేటర్లు పేలిన ఘటనలూ వెలుగుచూస్తున్నాయి. తాజాగా ఓ ఇంట్లో ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్ పేలడంతో భార్య మృతి చెందగా, భర్త ప్రాణాపాయస్థితిలో ఉన్నాడు. ఈ ఘటన రాజస్తాన్‌లో చోటు చేసుకుంది. సుల్తాన్ సింగ్, సంతోషి మీనా దంపతులు రాజస్తాన్‌లోని గంగాపూర్‌లో నివాసం ఉంటున్నారు. అయితే కోవిడ్ బారిన పడిన సుల్తాన్ సింగ్ గత రెండు నెలలుగా ఇంట్లోనే ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్ సాయంతో చికిత్స తీసుకుంటున్నాడు.
సుల్తాన్ సింగ్ భార్య ఓ బాలికల హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. అయితే శనివారం ఆమె పాఠశాల నుంచి ఇంటికి వచ్చి లైట్లు ఆన్ చేయడంతో ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్ పెద్ద శబ్దంతో పేలిపోయింది. భారీగా మంటలు చెలరేగాయి. పేలుడు ధాటికి సంతోషి మీనా అక్కడికక్కడే మృతి చెందారు. ప్రాణాపాయ స్థితితో ఉన్న సుల్తాన్ సింగ్‌ను జైపూర్‌లోని ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసులు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్ సప్లై చేసిన దుకాణా యజమానిని విచారించగా అది చైనా నుంచి వచ్చిన సరుకని తేలింది.
Comments
Please login to add a commentAdd a comment