సాక్షి, నెల్లూరు(పొగతోట): కరోనా పాజిటివ్ కేసులు నమోదైన 43 ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా అధికారులు గుర్తించారు. ఇక్కడ లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేయనున్నారు. ఉదయం 6 నుంచి 9 గంటల వరకు నిత్యావసర సరుకులు, కూరగాయల దుకాణాలు తెరిచేందుకు మాత్రమే అనుమతించారు. లాక్‌డౌన్‌ను ఈనెల 31వ తేదీ వరకు పొడిగిసూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో నిబంధనల అమలుపై అధికారులు కసరత్తు చేశారు. జిల్లావ్యాప్తంగా 43 ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో ఆంక్షలు కఠినతరం చేశారు. నాన్ కంటైన్మెంట్ జోన్లలో దుస్తులు, బంగారం, చెప్పుల దుకాణాల మినహా మిగిలిన చోట్ల విక్రయాలు కొనసాగించవచ్చు. షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు, పాఠశాలలకు అనుమతి లేదు. అన్ని ప్రాంతాలల్లో రాత్రి 7 నుంచి ఉదయం 7 గంటల వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. (ఆ డ్రగ్ వాడుతున్నా.. అవన్నీ వట్టి మాటలే: ట్రంప్)
మార్గదర్శకాలు ఇవే..
దుకాణాలు తెరిచే విషయంలో అధికారులు పలు మార్గదర్శకాలను రూపొందించారు. ఒక్కో దుకాణం వద్ద ఐదుగురికి మించి ఉండకుడదు. భౌతిక దూరం పాటించాలి. ప్రజలు మాస్క్‌లు ధరించి బయటకురావాలి. మున్సిపాలిటీల్లో దుకాణాలు రోజు మార్చి తీయాలి. సోమవారం తీసిన షాపు మంగళవారం తెరవకూడదు. మంగళవారం తీసిన దుకాణం బుధవారం మూసివేయాలి. షాపుల మధ్య దూరం పెరిగితే ప్రజలు భౌతిక దూరం పాటించే అవకాశం ఉంటుందని ప్రభుత్వం కొత్త నిబంధనలు తెచ్చింది. దుకాణాల వద్ద తప్పనిసరిగా శానిటైజర్లు అందుబాటులో ఉంచాలి. ఒకరిద్దరు మినహా సిబ్బంది ఉండకుడదు. పనిచేసేవారు మాస్క్‌లు ధరించి తరచూ చేతులను శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలి. లాక్‌డౌన్ సమయంలో అధిక ధరలకు విక్రయించే వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకుంటారు. తనిఖీలు నిర్వహించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
కంటైన్మెంట్ జోన్లు ఇవే..
బోగోలు మండలంలో ఇబ్రహీంపేట, అల్లూరు మండలంలో నార్త్‌మోపూరు, కుర్రులబ్బిపాళెం, కావలి మండలంలో వీఆర్‌నగర్, దగదర్తి మండలంలో ఎల్‌ఎన్‌పురం, కొండాపురం మండలంలో పార్లపల్లి, తడ మండలంలో భీములవారిపాళెం, తడ, అక్కంపేట, నాయుడుపేట మండలంలో బీడీకాలనీ, ఎల్‌ఏ సాగరం, బాలాజీ గార్డెన్స్, పెద్దమసీద్ వీధి, వెల్‌కమ్ స్ట్రీట్, ఎల్‌ఐసీ స్ట్రీట్, ఓజిలి మండలంలో నెమళ్లపూడి, సూళ్లూరుపేట మండలంలో మహదేవయ్యనగర్, మన్నార్‌పోలూరు, వనంతోపు, పెళ్లకూరు మండలంలో శిరసనంబేడు, నెల్లూరు అర్బన్ మండలంలో ఖుద్దూస్‌నగర్, కోటమిట్ట, గాంధీనగర్, మాగుంటలేఅవుట్, మూలాపేట, వెంకటేశ్వరపురం, ట్రంక్‌రోడ్డు, కిసాన్‌నగర్, చంద్రబాబునగర్, స్టోన్‌హౌస్‌పేట, రంగనాయకులపేట, బాలాజీనగర్, ఎన్టీఆర్ నగర్, కోవూరు మండలంలో లక్ష్మీనగర్, లేగుంటపాడు, పోతిరెడ్డిపాళెం, ఇనమడుగు, ఇందుకూరుపేట మండలంలో ఇందుకూరుపేట, టీపీగూడూరు మండలంలో టీపీగూడూరు, బుచ్చిరెడ్డిపాళెం మండలంలో రేబాల, ముత్తుకూరు మండలంలో మల్లూరు, నెల్లూరు రూరల్ మండలంలో కాకుపల్లి, వాకాడు మండలంలో తిరుమూరు, నవాబుపేట, బాలాయపల్లి మండలంలో ఊట్లపల్లి, గూడూరులో 5, 6, 8 వార్డులు.
7 పాజిటివ్ కేసులు
నెల్లూరు(అర్బన్): జిల్లాలో సోమవారం ఏడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సూళ్లూరుపేటలో ఐదు, వింజమూరు మండలం నల్లగొండ్లలో రెండు కేసులు వెలుగు చూశాయి. సూళ్లూరుపేటలో మహదేవయ్యనగర్, వనంతోపుల్లో ఐదుగురికి పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో అక్కడ కేసుల సంఖ్య 44కు చేరింది. వీటితో కలిపి ఇప్పటివరకు మొత్తం 164 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కోయంబేడు మార్కెట్ లింక్‌లతో కలువాయి, కోవూరు, వింజమూరు, తదితర మండలాల్లో ఇప్పటికే ట్రూనాట్ పద్ధతిలో పాజిటివ్ కేసులు వచ్చాయి. వాటిని తిరుపతికి పంపి నిర్ధారించాల్సి ఉంది. ఇదిలా ఉండగా కరోనా వైరస్ సోకి కోలుకున్న మొత్తం 9 మందిని సోమవారం నారాయణ ఆస్పత్రి నుంచి వైద్యులు డిశ్చార్జి చేశారు. అందులో 9 నెలల చిన్నారి, నలుగురు పురుషులు, మరో నలుగురు మహిళలున్నారు. వాకాడు మండలానికి చెందిన ఇద్దరు, నెల్లూరు కోటమిట్ట నుంచి నలుగురు, స్టోన్‌హౌస్‌పేట నుంచి ఇద్దరు, జెండావీధికి చెందిన మరొకరు డిశ్చార్జి అయిన వారిలో ఉన్నారు. ఇప్పటి వరకు 106 మందిని ఇంటికి పంపారు. మరో 58 మంది ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్నారు.
కంటైన్మెంట్ జోన్‌గా మనుబోలు
మనుబోలు: మనుబోలు గ్రామంలో కరోనా కేసు వెలుగు చూసిన నేపథ్యంలో కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. సోమవారం నెల్లూరు ఆర్డీఓ హుస్సేన్ సాహెబ్ మనుబోలులో పర్యటించారు. పాజిటివ్ కేసు నమోదైన ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో మాట్లాడారు. పోలీసులకు సూచనలిచ్చారు. సర్వే చేయాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. 28 రోజులపాటు ప్రజలకు అవసరమైన నిత్యావసరాలు, వైద్య సదుపాయాలను నేరుగా ఇళ్ల వద్దే అందజేసే ఏర్పాటు చేస్తామని తెలిపారు. దుకాణాలు మూసివేయించాలని ఆదేశించారు. ఆయన వెంట సీఐ రామృష్ణారెడ్డి, తహసీల్దార్ ఆనందరావు, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, డాక్టర్ శ్వేత, ఎస్సై సూర్యప్రకాష్‌రెడ్డి, వైద్య సిబ్బంది తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment