నెల్లూరు కోటమిట్ట ప్రాంతంలోని రెడ్‌జోన్‌లో బ్లీచింగ్ చల్లుతున్న పారిశుధ్య కార్మికుడు
కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వ సూచనలు మేరకు అధికారులు పకడ్బంధీ చర్యలు చేపడుతున్నారు. అక్కడ ప్రజలు ఇంటికే పరిమితమయ్యేలా కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. నిత్యావసర సరుకులు, కూరగాయలు, పాలు తదితరాలు ఇంటి వద్దకే చేర్చేలా అధికారులు చర్యలు చేపట్టారు. రెడ్‌జోన్ కాని ప్రాంతాల్లో ప్రజలకు నిత్యావసరాలు కొనుగోలుకు ఉదయం 6 నుంచి 9 గంటల వరకు అనుమతి ఉన్నా రెడ్‌జోన్ల ప్రాంతాల్లో కనీసం పక్కింటికి కూడా వెళ్లకుండా చర్యలు చేపడుతున్నారు. ప్రజలు లాక్‌డౌన్‌ను పక్కాగా పాటించేలా అధికారులు చర్యలు చేపట్టారు.
సాక్షి, నెల్లూరు(అర్బన్): కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్ అమలు ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నారు. పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల్లో కఠిన ఆంక్షలు విధించారు. జిల్లాలో ఇప్పటి వరకు 48 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఆ ప్రాంతాలను రెడ్‌జోన్లుగా డిక్లేర్ చేసి కంటైన్మెంట్ చేశారు. నెల్లూరు నగరంలో 26 కార్పొరేషన్ డివిజన్లతో పాటు జిల్లా వ్యాప్తంగా 13 మండలాల్లో 17 ప్రాంతాలను రెడ్‌జోన్లుగా విభజించారు. నెల్లూరు నగరంలో వెంకటేశ్వరపురం, మూలాపేట, చిన్నబజారు, ఖుద్దూస్‌నగర్, పెద్దబజారు, చంద్రబాబునగర్, డైకస్‌రోడ్డు, గాంధీనగర్, నవాబుపేట, మాగుంటలేఅవుట్ తదితర ప్రాంతాల్లోని 26 డివిజన్లలో రెడ్‌జోన్ కొనసాగుతోంది.
డివిజన్ల వారీగా చూస్తే 3, 4, 5, 6, 7, 18, 20, 21, 22, 23, 30, 32, 33, 34, 35, 36, 38, 39, 40, 41, 42, 43, 47, 48, 53, 54లను రెడ్‌జోన్లుగా ప్రకటించారు. జిల్లాలో చూస్తే తడ బీవీపాళెం, నాయుడుపేటలోని బీడీకాలనీ, బాలాజీగార్డెన్స్, ముస్లింవీధి, ఎల్‌ఐసీ వీధి, ఓజిలి మండలం నెమళ్లపూడి, వాకాడు మండలంలోని తిరుమూరు, నవాబుపేట, గూడూరులో దర్గావీధి, తోటపల్లిగూడూరు మండలం వరిగొండ, ఇందుకూరుపేట, కోవూరు మండలం పోతిరెడ్డిపాళెం, బుచ్చిరెడ్డిపాళెం మండం రేబాల, అల్లూరు మండలంలోని నార్త్ మోపూరు, ఇస్కపల్లి కుర్రు, బోగోలు మండలంలోని విశ్వనాథరావుపేట, కావలి పట్టణంలోని సౌత్‌జనతాపేట, వెంగళ్‌రావునగర్ ప్రాంతాలను రెడ్‌జోన్లుగా ప్రకటించి ఆయా ప్రాంతాలను కంటైన్మెంట్ చేశారు. చదవండి: అత్యుత్తమ వైద్యంతో కరోనాను జయించా..
పక్కాగా పారిశుధ్య చర్యలు
రెడ్‌జోన్లుగా ప్రకటించిన ప్రాంతాల్లో చుట్టూ 3 నుంచి 5 కి.మీ. పరిధిలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు చేపడుతున్నారు. సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేసి వైరస్ ప్రబలకుండా చర్యలు చేపడుతున్నారు. ప్రజలను ఇంటికే పరిమితం చేస్తున్నారు. బయటకు రాకుండా నిత్యం వైద్యశాఖ సిబ్బంది, పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. కనీసం పక్క ఇళ్లకు కూడా రాకుండా కట్టడి చర్యలు కఠినంగా అమలు చేస్తున్నారు. పాజిటివ్ వచ్చిన వారిని పెద్దాస్పత్రి ఐసొలేషన్ వార్డులో ఉంచారు. నెగెటివ్ వచ్చిన వారి కుటుంబ సభ్యులను, వారితో కలిసి మాట్లాడిన వారిని పలువురిని హోం క్వారంటైన్ చేశారు.
నిత్యావసరాలు ఇంటికే
రెడ్‌జోన్లు ప్రకటించిన ప్రాంతాల్లో కూరగాయలు, ఫల సరుకులు, పాలు, పండ్లు ఇంటి వద్దకే చేర్చే విధంగా అధికారులు చర్యలు చేపట్టారు. ఇందుకోసం అ«ధికారులు ‘మీ బడ్డీ’ యాప్‌ను రూపొందించారు. ప్రజలు ఈ యాప్‌లో తమకు కావాల్సిన సరుకులు ఆర్డర్ చేస్తే సమీప దుకాణాల నుంచి వారే ఇళ్ల వద్దకే వచ్చి సరుకులు అందజేస్తారు. ఈ సరుకులు కూడా ఇంటి నుంచి ఒకరే బయటకు వచ్చి తీసుకోవాల్సి ఉంటుంది.
అధికారులు, మంత్రుల పర్యవేక్షణ
రెడ్‌జోన్ల ప్రాంతాల్లో చేపట్టే చర్యలను అధికారులు, మంత్రులు పర్యవేక్షిస్తూ మైక్‌ల ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. శనివారం మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్ రెడ్‌జోన్లు అయిన జెండా వీధి, చిన్నబజారు ప్రాంతాల్లో పర్యటించారు. ప్రజలు భయపడాల్సిన పని లేదని మరో వారం లాక్‌డౌన్ పక్కాగా పాటిస్తే కోవిడ్ చైన్‌ను తెంచవచ్చని చెబుతున్నారు. దాతల సహకారంతో నిరుపేదలకు, కూలీలకు నిత్యావసరాల సరుకులు అందేలా సైతం చర్యలు చేపడుతున్నారు.
క్వారంటైన్ నుంచి స్వస్థలాలకు మత్స్యకారులు
గూడూరురూరల్: గూడూరు సమీపంలోని ఆదిశంకర ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రంలో ఉన్న 250 మంది మత్స్యకారులను శనివారం కలెక్టర్ ఎంవీ శేషగిరిబాబు సూచనలు మేరకు గూడూరు సబ్‌కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణ వారి స్వస్థలాలకు చేర్చారు. గూడూరు డిపోకు చెందిన 10 బస్సుల్లో అన్ని జాగ్రత్తలు తీసుకుని వారి స్వస్థలాలకు తరలించారు. ఈ సందర్భంగా సబ్‌కలెక్టర్ మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరులో ఉంటున్న జిల్లాకు చెందిన మత్స్యకారులు లాక్‌డౌన్‌తో అక్కడ చిక్కుకుపోయారన్నారు.
ఈ నేపథ్యంలో గత నెల 30న ఆంధ్రా, కర్ణాటక రాష్ట్రాల చొరవతో మత్స్యకారులను ఆదిశంకర కళాశాలలో క్వారంటైన్‌లో ఉంచామన్నారు. వీరందరికి తిరుపతిలోని స్విమ్స్‌లో పరీక్షలు నిర్వహించగా అన్ని రిపోర్టులు నెగెటివ్ రావడంతో వారిని ఇళ్లకు పంపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గూడూరు పురపాలక కమిషనర్ ఓబులేసు, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ అచ్యుతకుమారి, తహసీల్దార్ బాల లీలారాణి, మత్స్యశాఖ ఏడీ చాంద్‌బాషా, రూరల్ సీఐ రామకృష్ణారెడ్డి, సీసీఎస్ సీఐ అక్కేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
పారిశుధ్య పనులు చేపట్టాలి- ఏపీ టిడ్‌కో ఎస్‌ఈ జాన్ సైమన్‌రావు
నాయుడుపేటటౌన్: నాయుడుపేట పట్టణంలో రెడ్‌జోన్ ప్రాంతాల్లో నిరంతరం పారిశుధ్య పనులు చేపట్టి జాగ్రత్త చర్యలు చేపట్టాలని మున్సిపాలిటీల ప్రత్యేక అధికారి, ఏపీ టిడ్‌కో ఎస్‌ఈ జాన్ సైమన్‌రావు తెలిపారు. శనివారం మున్సిపల్ కమిషనర్ లింగారెడ్డి చంద్రశేఖర్‌రెడ్డితో కలిసి పట్టణంలోని రెడ్‌జోన్ ప్రాంతాలను ఆయన పరిశీలించారు. మున్సిపాలిటీ పరిధిలో 9 కరోనా పాజిటివ్ కేసులు నమోదైన నేపథ్యంలో ఉన్నతాధికారులు, సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య సూచనలతో నాయుడుపేట పట్టణంలో పారిశుధ్య పనులు, బ్లీచింగ్, సోడియం హైపో క్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నట్లు తెలిపారు. ఎస్‌ఈ వెంట ఆ శాఖ ఏఈ దామోదర్, మేనేజర్ ఎంకే ఖాజామొహిద్దీ్దన్ ఉన్నారు. చదవండి: కోవిడ్ చికిత్స తీసుకుంటూ పరీక్షలు రాసిన విద్యార్థి
Comments
Please login to add a commentAdd a comment