సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆదివారం 81 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 1,097కు చేరుకుంది. తాజాగా కృష్ణా జిల్లాలో 52 కేసులు నమోదు కావడంతో అక్కడ మొత్తం కేసుల సంఖ్య 177కు చేరింది. కర్నూలు జిల్లాలో 4 కొత్త కేసులు నమోదు కాగా.. మొత్తం కేసుల సంఖ్య 279కి, గుంటూరులో 3 కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 214కు చేరింది. కృష్ణా జిల్లా తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యధికంగా 12 కేసులు నమోదయ్యాయి. ఆ జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 51కి చేరింది. శనివారం ఉదయం 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 గంటల వరకు మొత్తం 6,768 శాంపిల్స్ పరీక్షించగా.. 81 కేసులు పాజిటివ్‌గా నమోదయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 68,034 మందికి పరీక్షలు నిర్వహించగా.. 66,937 మందికి కరోనా లేదని నిర్ధారణ అయ్యింది.
ఒకేరోజు 60 మంది డిశ్చార్జి
రాష్ట్రంలో తొలిసారిగా ఆదివారం 60 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 231కు చేరింది. ఆదివారం బులెటిన్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.. కర్నూలు జిల్లా నుంచి 24 మంది, నెల్లూరు జిల్లా నుంచి 15 మంది, ప్రకాశం నుంచి 11 మంది, గుంటూరు నుంచి ఆరుగురు, చిత్తూరు జిల్లా నుంచి ఇద్దరు చొప్పున.. పశ్చిమ గోదావరి, అనంతపురం జిల్లాల నుంచి ఒక్కరు చొప్పున డిశ్చార్జి అయ్యారు. గడచిన 24 గంటల్లో ఒక్క మరణం కూడా నమోదు కాకపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 31 వద్ద స్థిరంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వైరస్‌తో 835 మంది చికిత్స పొందుతున్నారు.
రాష్ట్రంలో పెరుగుతున్న రికవరీ రేటు
ఇప్పటి వరకు 21.05 శాతంగా నమోదు
అత్యధికంగా విశాఖ జిల్లాలో 86.3 శాతం
కరోనా వైరస్ బారిన పడి కోలుకుని, డిశ్చార్జి అయిన వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. తాజా గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 1,097 మంది పాజిటివ్ బాధితులు ఉండగా ఇప్పటివరకూ 231 మంది డిశ్చార్జి అయ్యారు. దీంతో రికవరీ రేటు 21.05 శాతంగా నమోదైంది. జిల్లా వారీగా చూస్తే విశాఖ జిల్లాలో అత్యధిక రికవరీ రేటు (86.3 శాతం) నమోదైంది. ఈ జిల్లాలో మొత్తం 22 మంది పేషెంట్లలో 19 మంది డిశ్చార్జి అయ్యారు.
రికవరీ రేటు ఇలా...
► గడిచిన నాలుగైదు రోజులుగా 17 వరకు ఉన్న రికవరీ రేటు 21.05 శాతానికి పెరిగింది.
► అత్యధికంగా కర్నూలు జిల్లాలో 31 మంది పేషెంట్లు డిశ్చార్జి అయ్యారు.
► గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 29 మంది చొప్పున డిశ్చార్జి అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment