కరోనా పాజిటివ్ రోగులకు చికిత్స అందిస్తున్న పిన్నమనేని సిద్ధార్థ కోవిడ్ ఆస్పత్రి
గన్నవరం రూరల్: అవును.. వారు కరోనాను జయించారు. ఒకరిద్దరు కాదు, ఏకంగా పది మంది 17 రోజుల పాటు చిన్న ఆవుటుపల్లిలోని పిన్నమనేని సిద్ధార్థ కోవిడ్ ఆస్పత్రిలో చికిత్స పొంది.. పూర్తిగా కోలుకుని ఆదివారం రాత్రి డిశ్చార్జి అయ్యారు. రెండు సార్లు నిర్వహించిన పరీక్షల్లో నెగిటివ్ రావడంతో వారిని డిశ్చార్జ్ చేశారు. పిన్నమనేని సిద్ధార్థ కోవిడ్ ఆస్పత్రి వైద్య అధికారులు, సిబ్బంది హర్షధ్వానాలతో బాధితులకు వీడ్కోలు పలికారు. కరోనా వ్యాప్తి ఆందోళన కలిగిస్తోన్న ప్రస్తుత తరుణంలో జిల్లాలో 10 మంది వైరస్‌ను జయించడం కొంత ఊరటనిచ్చింది. ప్రభుత్వం ప్రోత్సాహం, వైద్యుల కృషితో తాము కరోనాపై విజయం సాధించామని బాధితులు ఆనందం వ్యక్తం చేశారు. కాగా ఇప్పటి వరకూ జిల్లాలో 75 పాజిటివ్ కేసులు నమోదుకాగా, వారిలో ఇప్పటికే ఐదుగురు డిశ్చార్జి అయ్యారు. ఇప్పుడు మరో పది మంది డిశ్చార్జి అవుతుండగా, ఐదుగురు మృతి చెందారు. ఇంకా మరో 55 మంది విజయవాడ ప్రభుత్వాస్పత్రి, పిన్నమనేని సిద్ధార్థ ఆస్పత్రిల్లో చికిత్స పొందుతున్నారు.
డిశ్చార్జి అయిన వారి వివరాలు..
కరోనాపై విజయం సాధించిన వారిలో జగ్గయ్యపేటకు ఇద్దరు వ్యక్తులు(31),(34), నూజివీడుకు చెందిన ఓ యువకుడు(21), విజయవాడలోని సింగ్‌నగర్‌కు చెందిన వ్యక్తి(47), కేదరేశ్వరపేటకు చెందిన వ్యక్తి (41), లబ్బీపేటకు చెందిన మరో వ్యక్తి (40), విద్యాధరపురం కుమ్మరపాలెం సెంటర్‌కు చెందిన ఇద్దరు చిన్నారులు, మరో ఇద్దరు యువకులు(33), (28) ఉన్నారు. వీరందరూ ఈ నెల 2న కరోనా పరీక్షలో పాజిటివ్ రాగా, అప్పటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారికి నాణ్యమైన వైద్యంతో పాటు పోషక విలువలతో కూడిన ఆహారం అందించడంతో కరోనాపై విజయం సాధించగలిగారు. వారికి రెండు పర్యాయాలు పరీక్షలు జరపగా నెగిటివ్ రావడంతో ఆదివారం డిశ్చార్జి చేశారు.
వైద్యులు, సిబ్బందికి అభినందనలు..
కరోనా పాజిటివ్ వచ్చిన వారికి మెరుగైన వైద్యం అందించిన వైద్యులు, వైద్య సిబ్బందికి కరోనా ప్రత్యేక అధికారి సిద్ధార్థ జైన్, జిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ అభినందనలు తెలిపారు. ఈ విపత్కర సమయంలో రోగులకు మెరుగైన వైద్యం అందించి వారిలో మనోస్థైర్యం పెంచేందుకు కృషి చేయడం అభినందనీయమన్నారు. కరోనాను జయించి ఆరోగ్యంగా డిశ్చార్జి అవుతున్న వారికి కూడా వారు అభినందనలు తెలిపారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బీఎన్ చందర్, మెడికల్ హెడ్ డాక్టర్ జి. ఈశ్వరప్రసాద్, ప్రొఫెసర్ ఆంజనేయ ప్రసాద్, పల్మనాలజిస్ట్ డాక్టర్ భానురేఖ తదితరులు ఉన్నారు.
పూర్తిగా కోలుకున్నారు..
ఆస్పత్రిలో ఈ నెల 2న పది మంది పాజిటివ్ రోగులు చేరారు. ఇప్పుడు వారందరూ పూర్తిగా కోలుకున్నారు. తొలుత 14 రోజుల చికిత్స అనంతరం పరీక్ష చేయగా నెగిటివ్ వచ్చింది, మరలా 16వరోజు పరీక్ష చేయగా నెగిటివ్ రావడంతో ఇప్పుడు వారందరినీ డిశ్చార్జి చేస్తున్నాం. ఆస్పత్రికి వచ్చిన వారినందరికీ మెరుగైన చికిత్స అందించి పూర్తిగా కోలుకున్న తర్వాతే ఇంటికి పంపుతున్నాం.
– డాక్టర్ పీఎస్‌ఎన్ మూర్తి, ప్రిన్సిపాల్, పిన్నమనేని సిద్ధార్థ కోవిడ్ ఆస్పత్రి
Comments
Please login to add a commentAdd a comment