ప్రొద్దుటూరు క్రైం: ‘కరోనాతో దేశం మొత్తం యుద్ధం చేస్తోంది.. మనం పోరాటం చేయాల్సింది రోగితో కాదు వ్యాధితో.. వారిని వివక్షతతో చూడకండి’. ఎవ్వరికి ఫోన్ చేసినా ప్రస్తుతం మనకు వినిపించే మాటలు ఇవి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇవే సూచనలు చేస్తున్నాయి. అయితే కరోనా వైరస్ బారిన పడిన వ్యక్తుల విషయంలో, వైరస్‌తో మృతి చెందిన వారి పట్ల ఎక్కడ చూసినా వివక్షత కనిపిస్తోంది. మనిషికి వైరస్ సోకిందని తెలియగానే అతను ఏదో చేయకూడని నేరం చేసినట్లు, సమాజానికి పనికి రాడన్నట్లుగా చూస్తున్నారు. కరోనా వైరస్ సోకి చనిపోయినవారి మృతదేహాలు అనాథ శవాలుగా మిగులుతున్నాయి. పుట్టి, పెరిగిన చోటే మట్టిలో కలసిపోవాలని ప్రతి ఒక్కరిలోనూ ఒక ఆశ ఉంటుంది. బంధువులు, అయిన వారి చేతుల మీదుగా తమ చివరి మజిలీ జరగాలని చాలా మంది కోరుకుంటారు. అయితే కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ వైరస్ సోకి మృతి చెందితే అయ్యో పాపం అంటున్నారే గానీ మృతదేహాన్ని తమ ప్రాంతానికి తీసుకొచ్చేందుకు కొందరు ససేమిరా అంటున్నారు. ఇలాంటి అమానవీయ సంఘటనలు జిల్లాలోని పలు ప్రాంతాల్లో చోటుచేసుకుంటున్నాయి.
కరోనా వల్ల అనేక కుటుంబాలు సతమతం అవుతున్నాయి.. మన అనుకున్న బంధాలు కూడా దూరమవుతున్నాయి... అవగాహన లేక అపోహలు ఆవహించడమే ఇందుకు కారణం. ఏ కార్యం వెళ్లకపోయినా చివరి మజిలీలో మాత్రం కాటికి చేరిన వారికి కాస్త మట్టి ఇవ్వాలని అంటారు.. మరి ఈ కరోనాతో ఆ సంప్రదాయాలన్నీ మసిబారుతున్నాయి.
చాపాడు మండలానికి చెందిన ఓ గర్భిణి అనారోగ్యంతో బాధపడుతూ కవలలకు జన్మనిచ్చి కడప రిమ్స్‌లో కన్నుమూసింది. ఈమెకు కూడా తర్వాత పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయింది. ఈ పేద మహిళ మృతదేహం స్వగ్రామానికి తీసుకు రావడానికి అక్కడి వారు ఒప్పుకోలేదు. దీంతో అనాథ శవంగా కడప శివార్లలో గుట్టుచప్పుడు కాకుండా అంత్యక్రియలు నిర్వహించారు.
ఐసీఎంఆర్ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే..
►కరోనా సోకిన వ్యక్తులను అంత్యక్రియలు నిర్వహించేందుకు ఐసీఎంఆర్ కొన్ని నిబంధనలను సూచించింది.
►కోవిడ్‌తో మృతి చెందాడా లేదా అనేది ముందుగా నిర్ధారించుకోవాలి.
►ఆస్పత్రి వైద్య సిబ్బంది పర్యవేక్షణలోనే మృతదేహాన్ని ప్యాక్ చేయాలి. ముందుగా మృతదేహంపై సోడియం హైపోక్లోరైట్ ద్రావణం స్ప్రే చేసి, పాలిథిన్ కవర్‌తో భద్రంగా ప్యాక్ చేయాలి.
►అంత్యక్రియలకు వెళ్లే ముందు బట్ట, లేదా తాడు సాయంతో మృతదేహాన్ని పాడె పైకి తరలించారు.
►పాడెను మోసుకొని వెళ్లేవారు మృతదేహాన్ని తాకకుండా చూసుకోవాలి
►20 మందికి మించి అంత్యక్రియల్లో పాల్గొనరాదు. వీళ్లు కూడా మాస్క్‌లు ధరించి, భౌతిక దూరం పాటించాలి.
రెవెన్యూ, పారిశుధ్య సిబ్బంది సహకారంతో..
కడపలోని ఆర్టీసీ డిపోలో పని చేస్తున్న మహిళా ఉద్యోగి దేవుని కడపలో నివాసం ఉంటోంది. కొన్ని రోజుల క్రితం శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు రావడంతో తోటి ఉద్యోగుల సూచన మేరకు స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆస్పత్రిలో చూపించుకోగా మలేరియా అని తేలింది. వ్యాధి తీవ్రం కావడంతో మూడు రోజుల క్రితం కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స కోసం రిమ్స్‌కు తీసుకెళ్లారు. వైద్యులు కోవిడ్ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. కుటుంబ సభ్యుల ద్వారా విషయం తెలుసుకున్న ఆమెకు గుండె పోటు రాగా, ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారి కొన్ని క్షణాల్లో మృతి చెందింది. ఈ క్రమంలో ఆమె స్వస్థలమైన పాత కడపలోని శివారు ప్రాంతంలో అంత్యక్రియలు నిర్వహించాలని భావించగా స్థానికులు అందుకు నిరాకరించారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారికి ఇక్కడ దహన సంస్కారాలు చేయనివ్వమని చెప్పడంతో అంత్యక్రియలకు ఆటంకం ఏర్పడింది. తర్వాత రెవెన్యూ, పోలీసు అధికారులు జోక్యంతో చివరకు ఆమె దహన సంస్కారాలు పూర్తి చేయగలిగారు.
గ్రామస్తులు వద్దన్నారని..
ఆమె స్వగ్రామం చాపాడు మండలంలోని ఖాదర్‌పల్లె. భర్త, సోదరుడు కొన్నేళ్ల క్రితం ఉపాధి కోసం కువైట్‌కు వెళ్లారు. లాక్‌డౌన్ నిబంధనల కారణంగా వారు సకాలంలో ఇండియాకు రాలేకపోయారు. గర్భిణిగా ఉన్న ఆమెను కాన్పు కోసం కుటుంబ సభ్యులు ప్రొద్దుటూరులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి రక్తస్రావం ఎక్కువగా జరగడంతో ఆరోగ్య పరిస్థితి సరిగా లేదని చెప్పారు. దీంతో ఆమెను గత నెల 4న కడపలోని రిమ్స్‌కు తీసుకెళ్లారు. రెండు రోజుల తర్వాత సిజేరియన్ చేయగా కవల పిల్లలకు జన్మనిచ్చింది. అప్పటికే ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఆస్పత్రిలో చేరేముందే ఆమెకు కోవిడ్ పరీక్షలు నిర్వహించగా తర్వాత వచ్చిన రిపోర్టులో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ క్రమంలో ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. గ్రామం నడి»ొడ్డున శ్మశానం ఉండటంతో అక్కడ అంత్యక్రియలు చేసేందుకు కొందరు గ్రామస్తులు అంగీకరించలేదు. దీంతో ఆమె తల్లిదండ్రులను కడపకు పిలిపించి చివరి చూపుగా కుమార్తె మృతదేహాన్ని చూపించారు. తర్వాత రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో కడపలోనే అంత్యక్రియలు నిర్వహించారు. ఊరంతా బంధువులున్నా ఆమె చివరి చూపునకు నోచుకోలేదు.
బంధువులు వద్దని చెప్పడంతో...
ప్రొద్దుటూరులోని దస్తగిరిపేటకు చెందిన 67 ఏళ్ల వృద్ధుడు అతను. వెల్డింగ్ పని చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ముందుగా అతని ఇద్దరు కుమారులకు కరోనా పాజిటివ్ రావడంతో చికిత్స కోసం కడపలోని కోవిడ్ ఆస్పత్రికి తరలించారు. ప్రైమరీ కాంటాక్ట్ కింద వారి తండ్రికి పరీక్షలు చేయగా రెండు రోజుల తర్వాత ఆయనకు కూడా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రిలో ఉన్న అతన్ని కోవిడ్ ఆస్పత్రికి తరలించగా రెండు రోజుల తర్వాత మృతి చెందాడు. మృతదేహాన్ని ప్రొద్దుటూరుకు తీసుకెళ్లాలని భావించగా బంధువులు వద్దని చెప్పారు. దీంతో అతనికి కడపలోనే అంత్యక్రియలు నిర్వహించారు.
వైరస్ సోకుతుందని శాస్త్రీయంగా నిర్ధారణ కాలేదు..
కరోనా వైరస్ గురించి పూర్తిగా ఎవరికీ తెలియదు. అయితే చనిపోయిన వారి నుంచి వైరస్ సోకుతుందనే దానికి శాస్త్రీయ ఆధారాలు ఇప్పటి వరకు ఏమీ లేవు. అలా సోకే అవకాశం కూడా తక్కువే. మృతదేహం నుంచి ఏమైనా స్రావాలు బయటికి వచ్చి, వాటిని ఇతరులు తాకితే మాత్రం వైరస్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
రాజుపాళెం మండలంలో ఇటీవల ఒక వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందాడు. స్థానికంగానూ, చుట్టు పక్కల గ్రామాల్లో బంధువులు ఉన్నా వైరస్ భయంతో చూడటానికి ఎవరూ రాలేదు. దీంతో ఉన్న నలుగురే అతని మృతదేహాన్ని శ్మశానికి మోసుకొని వెళ్లారు. లాక్‌డౌన్ ప్రారంభంలో పరిస్థితులు వేరుగా ఉండేవి. స్థానికంగా కేసులు ఎక్కువగా లేకున్నా చైనా, ఇటలీ దేశాల్లో వచ్చిన కరోనా కేసులను చూసి ఎక్కువగా భయాందోళనకు గురయ్యేవారు. ప్రొద్దుటూరు, కడపలో అనేక చోట్ల సాధారణ మరణాలు సంభవించాయి. అయితే చాలా ప్రాంతాల్లో అయిన వాళ్లు రాకుండానే అంత్యక్రియలు చేశారు.
అడ్డుకోవడం సరికాదు
కరోనా అనుమానాలతో చనిపోయిన వారి భౌతికకాయాలను ఆయా గ్రామాల శ్మశాన వాటికలలో పూడ్చడం లేదా కాల్చడాన్ని అడ్డుకోకూడదు. అడ్డుకుంటే కఠిన చర్యలు తప్పవు. డబ్లు్యహెచ్‌ఓ ప్రోటోకాల్ ప్రకారం కోవిడ్ మృతులను ప్లాస్టిక్ కవర్‌లో ప్యాక్ చేసి దానిని కాల్చడం లేదా పూడ్చడం చేయాలి. ఈ రెండింటికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పూడ్చేటట్లయితే లోతుగా గుంత తీసి పూడ్చాలి. పాజిటివ్ కేసుల మృతదేహాలపై పడి ఏడ్వడం, తాకడం చేయకూడదు. తగిన దూరంలో ఉంటే వైరస్ స్ప్రెడ్ అవ్వదు. అపోహలు, అవగాహన రాహిత్యంతో అడ్డుకోవడంలాంటి చర్యలకు పాల్పడరాదు.
– సి.హరికిరణ్, కలెక్టర్
మానవతా దృక్పథంతో ఆలోచించాలి
కరోనా వైరస్‌తో లేదా ఇతర కారణాలతో చనిపోయిన వ్యక్తి అంత్యక్రియలకు అడ్డుపడటం మంచి పద్ధతి కాదు. ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో ఆలోచన చేయాలి. ఏవైనా అపోహలు పోలీసులు, రెవెన్యూ అధికారులను సంప్రదించి తెలుసుకోవాలి. ఇష్టానుసారం మృతదేహాలను అడ్డుకుంటామంటే కుదరదు. శ్మశాన వాటికల్లోకి రాకుండా అడ్డు కోవాలనిచూస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలి.
– కేకేఎన్ అన్బురాజన్, జిల్లా ఎస్పీ, కడప
Comments
Please login to add a commentAdd a comment