ఈ రోగం పేరు ‘దోపిడీ వైరస్‌’ | Irregularities In Private Hospitals In The Name Of Covid Tests | Sakshi
Sakshi News home page

ఈ రోగం పేరు ‘దోపిడీ వైరస్‌’

Published Tue, Aug 25 2020 11:12 AM | Last Updated on Tue, Aug 25 2020 11:12 AM

Irregularities In Private Hospitals In The Name Of Covid Tests - Sakshi

కరోనా నియంత్రణకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. పాజిటివ్‌ కేసుల సంబంధీకులను కూడా వెంటనే గుర్తిస్తూ పరీక్షలను నిర్వహిస్తోంది. పట్టణ ఆరోగ్య కేంద్రాలు, పీహెచ్‌సీలకు సైతం పరీక్షలను విస్తరించింది. ఇటీవల సంజీవని వాహనం ద్వారా ప్రజల ముంగిటకే పరీక్షల ప్రక్రియను తీసుకు వచ్చింది. తీవ్రతను బట్టి వాహనాన్ని పంపించి టెస్టులు చేస్తున్నారు. కొందరు అవగాహన లోపంతో ఇప్పటికీ కోవిడ్‌ టెస్టులు చేయించుకోకుండా సీటీ స్కాన్‌ వైపు అడుగులు వేస్తున్నారు. ఇది సరికాదని కోవిడ్‌ అధికారులు ఖండిస్తున్నా గోప్యత కోసం కొందరు ప్రైవేట్‌ ఆస్పత్రులను..ఆర్‌ఎంపీలను ఆశ్రయించి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ప్రభుత్వం సకల సదుపాయాలూ కల్పించి క్లిష్టమైన కేసులకుసైతం చికిత్స అందిస్తుంటే మరోవైపు కొందరు అవగాహనా రాహిత్యంతో ఇబ్బంది  పడుతున్నారు. జ్వరమొుస్తే సీటీ స్కాన్‌ తీయించేసుకుంటూ ప్రైవేట్‌ వైద్యులకు కాసులు కురిపిస్తున్నారు.  

సాక్షి కడప: కోవిడ్‌ పరీక్ష చేయించుకుని వైద్యుల పర్యవేక్షణలో తగు జాగ్రత్తలు తీసుకొని మందులు వాడితే కరోనా జలుబు లాంటిదేనని ప్రభుత్వం తొలినాళ్ల నుంచి చెబుతోంది. పైగా చాలామందికి రోగ లక్షణాలు కూడా బయటపడకుండానే కొన్ని రోజులకు నెగెటివ్‌ వస్తోందని వైద్య సర్వే స్పష్టం చేస్తున్నా కొందరు ఇంకా పక్కదారి పడుతున్నారు. పరీక్షలు చేయించుకుంటే కరోనా బయటపడుతుందేమో అనే భయం ఇప్పటికీ చాలా మందిలో ఉంది. దీంతో వారు కొందరు ఆర్‌ఎంపీలను సంప్రదిస్తున్నారు.  మిడిమిడి జ్ఞానం ఉన్న వారు సాధారణ జ్వరాన్ని కూడా కరోనా పేరు చెప్పి చెమటలు పట్టిస్తున్నారు. కనీస దయ చూపించకుండా ప్రజల జేబులను గుల్ల చేస్తున్నారు. సాధారణ జ్వరంతో వెళ్లిన వారిని కూడా సీటీ స్కానింగ్‌ చేయించుకొని రమ్మంటున్నారు. వారు చెప్పిన డయాగ్నటిక్‌ సెంటరుకు పంపిస్తూ సొమ్ము  చేసుకుంటున్నారు. జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో కొందరు పేరు మోసిన ఆర్‌ఎంపీలకు సీటీ స్కానింగ్‌ కమిషన్‌ ఆర్జన విపరీతంగా పెరిగిందని తెలుస్తోంది. జ్వరంతో తమ వద్దకు వచ్చే వారిని అవసరం ఉన్నా.. లేకున్నా అడ్డగోలుగా పరీక్షలు చేయిస్తున్నారు. ఆరోగ్యశ్రీ కింద కరోనాకు వైద్యం అందించడానికి ప్రభుత్వం 

ప్రైవేట్‌ ఆస్పత్రులకు అనుమతి ఇచ్చింది. స్వార్థంతో కొందరు ప్రైవేట్‌ ఆస్పత్రి యాజమాన్యాలు కోవిడ్‌ వైద్యం చేయడానికి ముందుకు రాలేదు. కానీ తెరచాటున వైద్యం చేస్తూ రోగి నుంచి లక్షలు వసూలు చేస్తున్నారు. కొన్ని ఆస్పత్రుల్లో ముందుగా డిపాజిట్‌ చేయించుకొని రోజుకు రూ.20 వేలు చొప్పున వసూలు చేస్తున్నట్లు సమాచారం. వర్షాకాలం కావడంతో జలుబు, జ్వరాలతో జనాలు బాధపడుతున్నారు. కోవిడ్‌ అనే భయంతో కొందరు ముందు జాగ్రత్తగా ప్రైవేట్‌ ఆస్పత్రులకు వెళ్తున్నారు. ఆయాసంతో వెళ్తే చాలు కొందరు వైద్యులు సీటీ స్కానింగ్‌కు సిఫార్స్‌ చేస్తున్నారు. అలా దోపిడీ మొదలవుతోంది. అవసరమైన పక్షంలో స్కానింగ్‌ చేయడం సమంజసమే అయినా ఇది విపరీత ధోరణులకు దారి తీస్తోంది.  

అనుమతి లేకుండా నిర్వహణ 
వైద్య ఆరోగ్యశాఖ రికార్డుల్లో లేని ల్యాబ్‌లు, స్కానింగ్‌ సెంటర్లు ఎన్నో ఉన్నాయి. జిల్లాలో సుమారు 350కి పైగా క్లినికల్‌ ల్యాబ్‌లు, 80 వరకు స్కానింగ్‌ సెంటర్లు ఉన్నాయి. వీటిలో చాలా వరకు అనుమతి లేకుండా నడుస్తున్నట్లు తెలుస్తోంది.  కరోనా నేపథ్యంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ల్యాబ్‌లు, స్కానింగ్‌ సెంటర్లను పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని ప్రజలు సూచిస్తున్నారు. ప్రస్తుత కేసుల తీవ్రత..జనం బలహీనత ఆసరాగా కొన్ని స్కానింగ్‌ సెంటర్లు భారీగా రేట్లు పెంచేశాయి. గతంలో రూ. 2వేలు ఉన్న సీటీ స్కానింగ్‌ ధరలను కొందరు  ఏకంగా రూ. 4500 నుంచి రూ. 6 వేలకు పెంచారు. స్కానింగ్‌ కోసం ప్రజలు చెల్లించే మొత్తంలో సుమారు 60 శాతం రెఫర్‌ చేసిన డాక్టర్లు, ఆర్‌ఎంపీలకు వెళుతుందనే ఆరోపణలున్నాయి. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లోని పల్మనాలజిస్టులు, జనరల్‌ ఫిజీషియన్లకు కరోనా లక్షణాలు, తీవ్రత గురించి నిర్ధారింగలరు. వీరు ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేస్తే పర్వాలేదు. చేయకుంటే ప్రభుత్వ ఆస్పత్రికి రెఫర్‌ చేయాలి. ఇవేమీ చేయకుండా తమ ఆస్పత్రులలోనే వైద్యం చేసి భారీగా ఆర్జిస్తున్నారు.  

ర్యాపిడ్‌ టెస్ట్‌కు రూ.6 వేలు     
కరోనా వ్యాధి నిర్ధారణ కోసం ప్రభుత్వం ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్ట్, ట్రూనాట్‌ టెస్ట్‌లను విస్తృతంగా నిర్వహిస్తోంది. ఈ  మూడింటిలోనూ స్వాబ్‌ తీసి పరీక్ష  చేస్తారు. వీటి ద్వారా వచ్చే ఫలితాల ఆధారంగానే కోవిడ్‌ పాజిటివ్, నెగిటివ్‌గా నిర్ధారణ జరుగుతోంది.  కొన్ని ప్రైవేట్‌ ఆస్పత్రులు, ల్యాబ్‌లలో ర్యాపిడ్‌ టెస్ట్‌ చేస్తున్నారు. రక్త నమూనాలను సేకరించి టెస్టు నిర్వహిస్తున్నారు. దీనివల్ల వచ్చే ఫలితం నమ్మశక్యం కానిదని ప్రభుత్వంతో పాటు సీనియర్‌ వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ తరహా యాంటీ బాడీ టెస్టు చేస్తూ రూ. వేలు దోచేస్తున్నారు. ఇప్పుడిప్పుడే అధికారులు ఇలాంటి వాటిపై దాడులు చేయడం ప్రారంభించారు. కాగా ఇటీవల కడపలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు రాత్రి 11 గంటల ప్రాంతంలో అత్యవసర వైద్యం కోసం వెళ్లిన రోగికి ర్యాపిడ్‌ టెస్ట్‌ చేశారు. 5 నిమిషాల్లో పాజిటివ్‌ అని చెప్పి రూ.5 వేలు తీసుకుని రోగి పరిస్థితి కూడా తెలుసుకోకుండా గేటు నుంచే పంపించేశారు. టెస్ట్‌ చేసినట్లు కాగితం ముక్క ఇవ్వండని సదరు ఆస్పత్రి యాజమాన్యానికి అడిగితే ‘ఇది అనధికారికం ఇచ్చేది లేద’ని చెప్పడం కొసమెరుపు. 

సీటీ స్కాన్‌ ద్వారా కరోనాను నిర్ధారించలేం
సిటీస్కానింగ్‌ ద్వారా కరోనా వైరస్‌ను నిర్ధారించలేమని జిల్లాలోని ప్రముఖ, సీనియర్‌ ప్రభుత్వ వైద్యుడు తెలిపారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తికి  వైరస్‌ తీవ్రత ఎంత ఉందో తెలుసుకోవడానికి స్కానింగ్‌ చేయాల్సి వస్తుందన్నారు.  స్కానింగ్‌ పరీక్షలనే కొలమానంగా తీసుకొని కోవిడ్‌  నిర్ధారణ జరగదని తెలిపారు. ఆర్టీపీసీఆర్, ట్రూనాట్, ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్టుల ద్వారా కరోనాను ప్రాథమిక దశలో గుర్తించవచ్చన్నారు. వీటి ద్వారానే సకాలంలో, కచ్చితమైన ఫలితాలను తెలుసుకోవచ్చని ఆయన తెలిపారు. వైరస్‌ సోకిన 10 రోజుల తర్వాత పూర్తి స్థాయిలో వ్యాధి లక్షణాలు కనిపిస్తే సీటీ స్కాన్‌లో తెలుసుకోవచ్చని, ఒక్కోసారి స్కానింగ్‌లో కూడా తీవ్రత కనిపించదన్నారు. వర్షాకాలం కావడంతో న్యూమోనియో ఉన్నా స్కానింగ్‌లో చూపిస్తుందన్నారు. సీటీ స్కాన్‌ అనేది కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆసుపత్రిలో కోవిడ్‌ నిర్ధారణయినవారికి అవసరమైతే వైద్యులు సూచిస్తారు. అమెరికా లాంటి దేశాల్లో కూడా ఇదే తరహా విధానం అమలులో ఉంది. సీటీ స్కాన్‌ను కోవిడ్‌ నిర్ధారణకు ఎక్కడా చేయడం లేదు. ఇది సరైన ప్రక్రియ కాదు..ఇదో కార్పొరేట్‌ హంగామా అని కోవిడ్‌ స్టేట్‌ అధికారులు కూడా స్పష్టం చేస్తున్నారు. సీఓఆర్‌ఏడీ4..5 అంటూ కరోనా పాజిటివ్‌ అని చెబుతూ వ్యాపారం మొదలెట్టేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

కఠినచర్యలు తప్పవు.. 
కరోనా వైరస్‌ (కోవిడ్‌– 19) కు ఎవరు పడితే వారు వైద్యం అందించకూడదు. అలా అందిస్తే ఆ వైద్యుడు మందుల చీటీ వివరాలను మాకు అందజేయండి. ఆ వివరాల ప్రకారం హాస్పిటల్‌ను తనిఖీ చేస్తాం. నిజమని తేలితే హాస్పిటల్‌ను సీజ్‌ చేస్తాం. చెస్ట్‌ సీటీ స్కాన్‌ ద్వారా కరోనా నిర్ధారణ చేయకూడదు. ర్యాపిడ్‌ టెస్ట్, వీఆర్‌డీఎల్‌ ద్వారా నిర్వహించే కరోనా నిర్ధారణ పరీక్షల ద్వారానే వైరస్‌ ఉందో లేదో నిర్ధారితమవుతుంది. ఈ చెస్ట్‌ సిటీ స్కాన్‌లో చెస్ట్‌ వైరల్‌ న్యుమోనియా, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నాయో..లేవో తెలుస్తాయి. ఛాతిలో అనారోగ్య సమస్యలుంటే  తెలుసుకోవడానికి సీటీ స్కాన్‌ను వినియోగిస్తే తప్పు లేదు. కానీ కరోనా నిర్ధారణకు సిటీ స్కాన్‌ను వినియోగించడం సరికాదు. ప్రభుత్వం కరోనా నివారణకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. వైరస్‌ నివారణకు మంచి వైద్యం అందిస్తోంది. ఎవరైనా కరోనాకు వైద్యం అందిస్తామంటే నమ్మి మోసపోకండి.
 – డాక్టర్‌ కేవీఎన్‌ఎస్‌ అనిల్‌కుమార్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement