మంచిర్యాల సిటీ, న్యూస్‌లైన్ : 2014-15 విద్యా సంవత్సరం ప్రారంభానికి నాలుగు నెలల ముందే కార్పొరేట్ కళాశాలలు ప్రవేశాలకు తెరలేపాయి. ‘పది’ పరీక్షలే పూర్తికాలేదు కార్పొరేట్ కళాశాల ప్రచారం జోరందుకుంది. ముందస్తుగానే పది చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులను, పాఠశాలల యాజమన్యాలను కలుస్తూ ‘బుక్’ చేసుకుంటున్నాయి. ఇందుకోసం పాఠశాలల నిర్వాహకులకు నజరానాలు ఇస్తామని ప్రకటిస్తున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులకు ఫీజులో రాయితీ ఇస్తామని నమ్మ బలుకుతున్నారు. ఇక పాఠశాలల యాజమాన్యాలకు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా డబ్బులు లేదా బహుమతులు ఇస్తామని చెబుతున్నారు.
జిల్లాలోని కళాశాలతోపాటు కరీంనగర్, వరంగల్లు, హైదరాబాద్, విజయవా డ, నెల్లూరు, గుంటూరు ప్రాంతాలకు చెందిన పలు కా ర్పొరే టు కళాశాలల యాజమాన్యాలు పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్స్(పీఆర్‌వో)లను రంగంలోకి దింపాయి. నిబంధనల కు విరుద్ధంగా అడ్మిషన్లు తీసుకుంటున్నా అధికార యం త్రాంగం చూసీ చూడనట్లు వ్యవహరిస్తోంది. నిబంధనల ప్రకారం పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాక జూన్ లో ప్రవేశాలు తీసుకోవాలి. ఇందుకోసం ఎలాంటి ప్రచారాలు చేయకూడదు. పీఆర్‌వోల ద్వారా నియామకాలు చేసుకోకూడదు.
పీఆర్‌వోలు ఏం చేస్తారు..
కార్పొరేట్ కళాశాలలు ప్రజలతో సంబంధాలు అధికంగా ఉన్న వివిధ సంస్థల ఇన్సూరెన్స్ ఏజెంట్లు, ప్రభుత్వ, ప్రైవేట్ ఉపాధ్యాయులు, లెక్చరర్లు, ట్యూషన్ సెంటర్ల నిర్వాహకులను నియమించుకుంటున్నాయి. వీరు మొదట ప్రైవేటు పాఠశాలలను ఎంపిక చేసుకుంటారు. ఆ పాఠశాలల యాజమాన్యానికి రూ.3 వేల నుంచి రూ.10 వేల వరకు కళాశాలలో చేరిన ఒక్కొక్క విద్యార్థికి కళాశాలల స్థాయిని బట్టి ఇవ్వడానికి ఒప్పందం చేసుకుంటారు. విద్యార్థి వివరాలు, ఇంటి ఫోన్ నంబర్ తీసుకుంటారు. కళాశాల బాగుంటుందని మాయమాటలు చెప్పి విద్యార్థును అడ్మిషన్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. అయితే ఈ పీఆర్‌వోలకు, ఏజెంట్లకు కళాశాల యాజమాన్యాలు నెలకు రూ.8 వేల వరకు ఏడాది పొడవునా జీతం రూపంలో చెల్లిస్తున్నాయి. లేకపోతే విద్యార్థి చొప్పున కమిషన్ ఇస్తున్నారు. కోల్‌బెల్ట్ ప్రాంతంలోనే పీఆర్‌వోలు అధికంగా ఉన్నారు. దాదాపు పదికిపైగా మహిళలు, 50 మందికిపైగా పురుషులు పీఆర్‌వోలుగా పనిచేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది స్థానిక ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసే వారే. అడ్మిషన్ పూర్తయ్యిందంటే మళ్లీ ఏడాది వరకు కనిపించరు.
ఏటా జిల్లాదాటుతున్న 5 వేల మంది విద్యార్థులు
జిల్లా నుంచి ఏటా సుమారు 40 వేల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షకు హాజరైతే 35 వేలకు పైగా ఉత్తీర్ణులు అవుతున్నారు. వీరిలో దాదాపు ఐదు వేల మంది విద్యార్థులు కార్పొరేటు బాట పడుతున్నారు. అయితే వీరిలో కళాశాల నచ్చకనో దాదాపు 20 శాతం మంది విద్యార్థులు ఇంటిబాట పడుతున్నారు. వీరి పేరిట చెల్లించిన ఫీజు మాత్రం యాజమాన్యాలు ఇవ్వవు.
మాయమాటలకు మోసపోవద్దు..
కళాశాలల్లో పిల్లలను చేర్చేటప్పుడు విశాలమైన తరగతి, పడక గదులు, భోజనం, అవసరాలకు, తాగడానికి నీటి సరఫరా, బాలికల కళాశాలల్లో మహిళా నిర్వహకులు, ప్రయోగశాల, అధ్యాపక బృందం, కళాశాల గుర్తింపు, ప్రతి సెక్షనుకు విద్యార్థుల సంఖ్య, మైదానం వంటి అవసరాలను ప్రత్యేకంగా తల్లిదండ్రులు వెళ్లి చూసుకోవాలి. పలు కళాశాలలు ఇంటర్ మొదటి ఏడాది చదువును ఒక బ్రాంచిలో పూర్తిచేసి, రెండో సంవత్సరం చదువును మరో బ్రాంచిలో చెబుతారు. ప్రత్యక్షంగా చూసిన తర్వాతనే నిర్ణయం తీసుకోవాలి.
కార్పొరేట్ వల
Published Fri, Feb 28 2014 2:21 AM | Last Updated on Tue, Oct 9 2018 5:27 PM
Advertisement
Advertisement