సాక్షి ప్రతినిధి, కర్నూలు: కోడుమూరు మండలంలోని ప్యాలకుర్తికి చెందిన ఒక అమ్మాయి (పేరు చెప్పేందుకు ఇష్టపడలేదు) తీవ్రస్థాయి రోగంతో ఇబ్బందులు పడుతోంది. అయితే, వీరి కుటుంబానికి రచ్చబండ కార్డు మాత్రమే ఉంది. తెల్లరేషన్ కార్డు లేదు. దీంతో కలెక్టర్ కార్యాలయం నుంచి దారిద్య్ర రేఖ దిగువన ఉన్న వారు (బీపీఎల్- పేదవాళ్లు) అంటూ ఆథరైజేషన్ లేఖ తెస్తే ఉచితంగా వైద్యం చేస్తామని ఆసుపత్రివర్గాలు పేర్కొన్నాయి. ఇందుకోసం గత నెల 20వ తేదీ నుంచి ఆమె కలెక్టరేట్ చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతోంది. ఇప్పటివరకూ ఆమెకు లేఖ అందలేదు. దీంతో వైద్యం అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
ఇది కేవలం జిల్లాలో ఒక్కరి సమస్యే కాదు. జిల్లావ్యాప్తంగా వందలాది మంది పేద రోగులు తెల్లరేషన్ కార్డులు లేక ఆరోగ్య శ్రీ (ఎన్టీఆర్ ఆరోగ్య వైద్యసేవ) కింద వైద్యం చేయించుకోలేని దుస్థితిలో ఉన్నారు. వాస్తవానికి తెల్లరేషన్ కార్డు లేకపోతే.. సంబంధిత జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి బీపీఎల్ కుటుంబం అంటూ ఆథరైజేషన్ లేఖ ఇస్తే ఈ పథకం కింద ఉచితంగా వైద్యం అందించే వారు.
వీరందరూ కలెక్టర్ నుంచి ఆథరైజేషన్ లేఖ కోసం రోజూ కలెక్టరేట్‌లో చక్కర్లు కొడుతున్నారు. అయినప్పటికీ ఫలితం దక్కడం లేదు. కొద్దిమంది నెల రోజులుగా తిరుగుతున్నా ఏదో ఒక కొర్రీ వేసి ఆథరైజేషన్ లేఖలు ఇవ్వడం లేదని రోగులు వాపోతున్నారు. మొత్తం మీద పేద రోగులకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు ఉద్దేశించి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించిన ఆరోగ్యశ్రీ పథకాన్ని ఈ ప్రభుత్వం పేరు మార్చడంతో పాటు కొత్త కొత్త సమస్యలు ృష్టిస్తోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గతంలో ఒక్క రోజులోనే...!
గతంలో కూడా తెల్లరేషన్ కార్డులేని పేదలకు ఏదైనా పెద్ద జబ్బు చేస్తే జిల్లా కలెక్టర్ నుంచి ఆథరైజేషన్ లేఖ తెస్తే.. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం (సీఎం క్యాంప్ ఆఫీసు) వద్ద ఉన్న ఆరోగ్యశ్రీ కేంద్రం వద్దకు వెళ్లి పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉండేది. అక్కడి నుంచి సంబంధిత కార్పొరేటు ఆసుపత్రికి ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్ చేయాలంటూ సిఫారసు లేఖ ఇచ్చేవారు. దీంతో పేదలకు వెంటనే ఆపరేషన్లు జరిగేవి. వాస్తవానికి గతంలో ఆథరైజేషన్ లేఖ కోసం మొదట ఎమ్మార్వో నుంచి లేఖ తీసుకుని... అక్కడి నుంచి ఆరోగ్యశ్రీ జిల్లా కో-ఆర్డినేటర్‌కు ఇచ్చేవారు. ఆయన సిఫారసు మేరకు కేవలం ఒక్క రోజులోనే కలెక్టర్ కార్యాలయం నుంచి ఆథరైజేషన్ లేఖ వచ్చేది. అయితే, ఇప్పుడు ఈ ప్రక్రియ మొత్తం నెల రోజులు గడిచినప్పటికీ పూర్తికావడం లేదు. దీంతో పేద రోగులు వైద్యం అందక తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు.
మూడు లక్షల మందికి ఇబ్బందులు!
గత ప్రభుత్వ హయాంలో రచ్చబండ నిర్వహించిన సందర్భంగా తెల్లరేషన్‌కార్డులు మంజూరు చేశారు. ఇవి సుమారు 2 లక్షల మేరకు ఉన్నాయి. ఈ కార్డులపై ఆర్‌ఏపీ అని నెంబరు ఉంటుంది. డబ్ల్యుఏపీ అని ఉన్న కార్డులను మాత్రమే తెల్లరేషన్ కార్డులుగా పరిగణిస్తారు. రచ్చబండ సమయంలో ఇచ్చిన ఆర్‌ఏపీ కార్డులను ఇప్పటివరకు రెగ్యులర్ తెల్లకార్డులుగా మార్చలేదు. దీంతో జిల్లావ్యాప్తంగా 2 లక్షల మంది రచ్చబండ కార్డులు కలిగిన కుటుంబాల్లో ఏ ఒక్కరికీ ఆరోగ్యపరంగా ఇబ్బందులు తలెత్తినా కలెక్టర్ నుంచి ఆథరైజేషన్ లేఖ తప్పనిసరి.
అంతేకాకుండా తాజాగా మన ఊరు-జన్మభూమి సందర్భంగా కొత్తగా మరో లక్ష మందికిపైగా తెల్లరేషన్ కార్డులు కావాలంటూ దరఖాస్తు చేసుకున్నారు. వీరికి కూడా ఏదైనా పెద్ద జబ్బు వచ్చి ఎన్టీఆర్ ఆరోగ్య వైద్య సేవ కింద వైద్యం అందాలంటే కలెక్టర్ నుంచి ఆథరైజేషన్ లేఖ కావాల్సిందే. మొత్తం మీద ఈ కుటుంబాలందరికీ ఆథరైజేషన్ లేఖ కావాలంటే ఇబ్బందులు తప్పడంలేదు.
నిలిచిన ఆపరేషన్లు...!
జిల్లావ్యాప్తంగా నిత్యం ఆథరైజేషన్ లేఖల కోసం కలెక్టరేట్ చుట్టూ పదుల సంఖ్యలో పేద రోగులు చక్కర్లు కొడుతున్నారు. అయినప్పటికీ వీరికి రోజులు గడుస్తున్నా కలెక్టర్ కార్యాలయం నుంచి ఆథరైజేషన్ లేఖలు లభించడం లేదు. ఏదో ఒక సాకుతో వీరిని మళ్లీ మళ్లీ తిప్పించుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. ప్రధానంగా కేన్సర్, గుండెజబ్బులు వంటి తీవ్రస్థాయి రోగాలు ఉన్న రోగుల ఇబ్బందులు వర్ణనాతీతంగా ఉన్నాయి.
ఈ ఆలస్యం వల్ల ఏకంగా కొన్నిసార్లు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉందన్న ఆందోళన వ్యక్తమవుతుంది. కేవలం కేన్సర్, గుండెజబ్బులు వంటి తీవ్రస్థాయి రోగాల బారిన పడిన వారి సంఖ్య ఏకంగా 100 మందికిపైగా ఉంటుందని సమాచారం. వీరందరూ సొంతంగా డబ్బులు చెల్లించి ఆపరేషన్లు చేయించుకోలేని దుస్థితిలో ఉన్నవారే. దీంతో రోజుల తరబడి కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరుగుతూ అధికారుల మీద భారం వేసి కాలం వెళ్లదీస్తున్నారు. ఇప్పటికైనా తమకు వెంటనే బీపీఎల్ కుటుంబాలని పేర్కొంటూ ఆథరైజేషన్ లేఖలు ఇవ్వాలని కోరుతున్నారు.
పేదలకు దూరం.. కార్పొరేట్ వైద్యం!
Published Sat, Mar 7 2015 2:31 AM | Last Updated on Thu, Mar 21 2019 8:16 PM
Advertisement