కార్పొరేటు.. యమ ఘాటు
► చుక్కలన్నంటుతున్న కార్పొరేట్ ఫీజులు
► టెన్త్‌కి పుస్తకాలతో కలిపి రూ. 60 వేలు పైమాటే
► విద్యా శాఖ పర్యవేక్షణలోపంతో అడ్డగోలు వసూలు
► రశీదులు కూడా ఇవ్వని పాఠశాలలు
► అల్లాడుతున్న మధ్య తరగతి కుటుంబాలు
మడత నలగని బట్టలు, మెడలో టై..భుజాన బ్యాగ్, కాళ్లకు షూ చేతిలో క్యారియర్..ఇలా పాఠశాలకు వెళుతున్న పిల్లలను చూసి ముచ్చట పడాలో..పాఠశాల గుమ్మం తొక్కిన వెంటనే నెత్తిన పడుతున్న ఫీజుల పిడుగు దెబ్బకు అదిరిపడాలో తెలియక సందిగ్ధంలో పడుతున్నారు తల్లిదండ్రులు. పిల్లలు ఇంటికొచ్చాక చెప్పే నాలుగు ఇంగ్లిష్ ముక్కలు విని సంబరపడాలో..ఆ నాలుగు ముక్కలు నేర్చుకోవడానికి తమకు కనపడుతున్న చుక్కలు చూసి విలవిలలాడాలో తెలియక అల్లాడుతున్నారు. మొత్తంగా తల్లిదండ్రుల ఆశలు, ఆకాంక్షలే పెట్టుబడిగా జిల్లాలో కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలలు ఫీజుల పంజా విసురుతున్నాయి.
సాక్షి, గుంటూరు: జిల్లాలో కార్పొరేట్ విద్యా సంస్థల దందా తారస్థాయికి చేరుతోంది. ఎల్‌కేజీ మొదలుకొని ఇంటర్మీడియెట్ వరకు వేలల్లో ఫీజులు ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. ఫీజులకు సంబంధించి ఎక్కడా ఎటువంటి రశీదులు కూడా ఇవ్వడం లేదు. నిబంధనల ప్రకారం నోటీసు బోర్డులో కూడా ఫీజుల వివరాలు ఉంచడం లేదు. విద్యా సంవత్సరం ప్రారంభమైతే క్లాసు రూములు, విద్యార్థుల సంఖ్యతో నిమిత్తం లేకుండా లక్షలు గడించడమే అడ్మిషన్లు ఇస్తున్నారు. విద్యాహక్కు చట్టానికి యథేచ్చగా తూట్లు పొడుస్తున్నారు.
జిల్లాలో కార్పొరేట్, ప్రైవేటు సూళ్లన్నీ కలిపి 1300 వరకు ఉన్నాయి. వీటిలో నర్సరీ నుంచి పదో తరగతి వరకు బోధిస్తున్న పాఠశాలలతోపాటు, ప్లే స్కూల్స్ పేరుతో నర్సరీ నుంచి ఐదో తరగతి వరకు సుమారు 200 వరకు ఉంటాయి. ప్రైవేటు విద్యా సంస్థలకు సంబంధించి ఫీజుల విషయంలో ప్రభుత్వ మార్గదర్శకాలు ఉన్నా, వాటిని మచ్చుకైనా అమలు చేయడం లేదు. ఇక కార్పొరేట్ స్కూల్స్‌లో సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌సీ సిలబస్ బోధించే విద్యా సంస్థల ఫీజులు వీటికి రెట్టింపులో ఉన్నాయి.
విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతి ప్రైవేటు పాఠశాలకు రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు తప్పనిసరి. పదో తరగతి ఉన్న స్కూల్స్‌లో తప్పనిసరిగా క్లాస్ రూములతోపాటు, ల్యాబ్, లైబ్రరీ, పిల్లల ఆటలకువీలుగా క్రీడా మైదానం, అగ్నిమాపక శాఖ నిబంధనలకు అనుగుణంగా అన్ని వసతులు ఉండాలి. ప్రస్తుతం అధిక సంఖ్యలోని పాఠశాలలకు గుర్తింపు ఉండటం లేదు. కార్పొరేట్ స్కూళ్లకు ఉన్న పేరుతో ఇష్టానుసారంగా బ్రాంచ్‌లు ప్రారంభించి సగటున 70 నుంచి 120 మంది విద్యార్థులతో క్లాస్‌లు నిర్వహిస్తున్నారు.
పెనుభారంగా మారుతున్న ఫీజులు
పదేళ్ల క్రితం కార్పొరేట్ విద్యా సంస్థలో పది వేల రూపాయల ఖర్చుతో పూర్తయ్యే పదో తరగతికి ఇప్పుడు కనీసం ఫీజే రూ. 40 వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఇవి కాకుండా పుస్తకాలు మొదలుకొని సాక్సుల వరకు అన్ని అక్కడే మరో రూ. 20 వేలు పెట్టి కొనుగోలు చేయాలి. జూన్ వచ్చిందంటే మధ్య తరగతి కుటుంబాలు అప్పుల పాలవుతున్నాయి. ప్రతి ఏటా సగటున పది శాతానికిపైగా ఫీజులు పెంచుతున్నా విద్యా శాఖ మాత్రం పట్టించుకోవడం లేదు.
ఏదైనా కార్పొరేట్ విద్యా సంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యలు చేసుకొంటే మినహా విద్యా శాఖ స్పందించడం లేదు. నిబంధనల ప్రకారం ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం విద్యా శాఖ అధికారులతోపాటు, పలువురితో కమిటీలు ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం కార్పొరేట్ పాఠశాలలో నర్సరీకి రూ. 24 వేల వరకు ఫీజులు వసూలు చేస్తుండగా, ప్రైవేటు పాఠశాలలో రూ. 15 వేల నుంచి రూ. 20 వేలు తీసుకొంటున్నారు. ఇవి కాకుండా రూ. 3 వేల నుంచి రూ. 10 వేల వరకు అడ్మిషన్ ఫీజులు వసూలు చేస్తున్నారు. వీటన్నింటితోపాటు పాఠశాలలు విద్యా శాఖకు సమర్పించే అకౌంట్స్ వివరాలు సక్రమంగా పర్యవేక్షించకపోవడంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది.
ఫీజుల వివరాలు ఇలా
తరగతి కార్పొరేట్ (రూ.లలో..) ప్రైవేటు (రూ..లలో)
నర్సరీ 18 వేలు 10 వేలు నుంచి 12 వేలు
ఎల్‌కేజీ 19,500 12 వేలు నుంచి 15 వేలు
యూకేజీ 20 వేలు 11 వేలు నుంచి 15 వేలు
1వ తరగతి 20 వేలు 12 వేలు నుంచి 15,500
2వ తరగతి 20 వేలు 13,500 నుంచి 16 వేలు
3వ తరగతి 22 వేలు 14 వేలు నుంచి 16 వేలు
4వ తరగతి 22 వేలు 18 వేలు నుంచి 20 వేలు
5వ తరగతి 25 వేలు 18 వేలు నుంచి 20 వేలు
6వ తరగతి 28 వేలు 19 వేలు నుంచి 22 వేలు
7వ తరగతి 30 వేలు 20 వేలు నుంచి 25 వేలు
8వ తరగతి 30 వేలు 20 వేలు నుంచి 25 వేలు
9వ తరగతి 32 వేలు 20 వేలు నుంచి 25 వేలు
10వ తరగతి 36 వేలు 25 వేలు నుంచి 30 వేలు