ఫీ‘జులుం’ | Private, corporate, personal income | Sakshi
Sakshi News home page

ఫీ‘జులుం’

Published Tue, Jun 24 2014 2:13 AM | Last Updated on Mon, Oct 1 2018 5:40 PM

ఫీ‘జులుం’ - Sakshi

ఫీ‘జులుం’

  • ప్రయివేటు, కార్పొరేట్ స్కూళ్ల ఇష్టారాజ్యం
  •  పాఠశాలల్లో ఎక్కడా కానరాని ఫీజుల వివరాలు
  •  కొరవడిన అధికారుల పర్యవేక్షణ
  • చల్లపల్లి : తమ పిల్లలను ఇంగ్లిషు మీడియంలో చదివించాలని ఆశపడుతున్న తల్లిదండ్రులను కొన్ని ప్రయివేటు, కార్పొరేట్ స్కూళ్లు నిలువుదోపిడీ చేస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా భారీ మొత్తంలో వసూలు చేస్తున్నాయి. కొన్ని పాఠశాలల నిర్వాహకులు ముందుగా ఫీజు ఎంతో తెలుసుకుందామని వచ్చే తల్లిదండ్రులకు తరువాత చెప్తామంటూ పంపిచేస్తున్నారు.

    కొద్ది రోజుల తరువాత మళ్లీ వెళ్తే ఇప్పటికే ఆలస్యమైంది, ముందుగా వస్తే తగ్గించే అవకాశం ఉండేది, ఇప్పటికే కంప్యూటర్‌లో ఫీడైపోయింది అంటూ తాము అనుకున్న పూర్తి ఫీజును ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. స్కూళ్ల నిర్వాహకులు అధిక ఫీజులు వసూలు చేస్తున్నా ఏ అధికారీ పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్నారు.
     
    జిల్లాలో 379 జెడ్పీ ఉన్నత పాఠశాలలు, 417 ప్రయివేటు, కార్పొరేట్ హైస్కూల్స్, 625 యూపీ స్కూల్స్, 2,496 ప్రాథమిక పాఠశా ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో 5,82,863 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అయితే ప్రయివేటు, కార్పొరేట్ స్కూళ్లలో ఇంగ్లిషుమీడియంలో చదివిస్తే తమ పిల్లల భవిష్యత్ బాగుంటుందని తల్లిదండ్రులు ఆశపడుతున్నారు. రోజు కూలీలు, చిరుద్యోగులు          కూడా పిల్లలను అప్పుచేసయినా ప్రయివేటు, కార్పొరేట్ స్కూళ్లలో చేరుస్తున్నారు. వారి ఆశలను ఈ స్కూళ్ల నిర్వాహకులు సొమ్ము చేసుకుంటున్నారు.
     
    అందినకాడికి దండుకోవడమే..

    ప్రవేటు, కార్పొరేట్ స్కూళ్ల ఫీజులపై ప్రభుత్వం నిబంధనలు విధించింది. అయితే ఈ స్కూళ్ల నిర్వాహకులు వాటిని బేఖాతరుచేస్తున్నారు. తల్లిదండ్రుల బలహీనతలను ఆసరాగా చేసుకుని అందినకాడికి ఫీజులు వసూలు చేస్తున్నారు. ఈ విషయం అధికారులకు  తెలిసినప్పటికీ ఉదాశీనంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రాథమిక, ప్రాథమికోన్నత స్థాయిలో ఏడాదికి రూ.7,800 నుంచి రూ.9 వేలు మాత్రమే వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే రూ.9 వేల నుంచి రూ.16 వేలు వసూలు చేస్తున్నారు. హైస్కూల్ స్థాయిలో రూ.10,800 నుంచి రూ.12 వేలు వసూలు చేయాల్సి ఉండగా రూ.16 వేల నుంచి రూ.22 వేల వరకూ వసూలు చేస్తున్నారు.
     
    డీఎఫ్‌ఆర్‌సీకి ఫిర్యాదు చేయొచ్చు
     
    జిల్లాలో నిర్వహిస్తున్న ప్రయివేటు, కార్పొరేట్ స్కూళ్లలో వసూలు చేస్తున్న ఫీజులపై తల్లిదండ్రులకు అభ్యంతరాలు ఉంటే జిల్లా ఫీజు రెగ్యులేటరీ కమిటీ(డీఎఫ్‌ఆర్‌సీ)కి ఫిర్యాదు చేయొచ్చు. ఈ ఫిర్యాదులపై విచారణ జరిపిన అనంతరం డీఎఫ్‌ఆర్‌సీ తుదినిర్ణయం తీసుకుంటుంది. జిల్లా కలెక్టర్ లేదా జాయింట్ కలెక్టర్ చైర్మన్‌గా, జిల్లా విద్యాశాఖాధికారి కన్వీనర్‌గా, జిల్లా ఆడిట్ అధికారి, ఆర్డీవో, డెప్యూటీ విద్యాశాఖాధికారులు ఈ డీఎఫ్‌ఆర్‌సీలో సభ్యులుగా ఉంటారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement