
అక్కడ పాఠం.. ఇక్కడ శ్రవణం
కార్పొరేషన్ స్కూళ్లలో ఆన్‌లైన్ విద్యాబోధన పెలైట్ ప్రాజెక్ట్‌గా పది స్కూళ్లు
మేలో తరగతులు ప్రారంభం ఏర్పాట్లను పరిశీలించిన కమిషనర్ వీరపాండియన్
విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థ పాఠశాలల్లో ఆన్‌లైన్ విద్యాబోధన అందుబాటులోకి రానుంది. రాబోయే రోజుల్లో ఉపాధ్యాయులు లేకుండానే బోధన చేయొచ్చు. ఒక పాఠశాలలో చెప్పే పాఠాలను మిగతా స్కూళ్ల విద్యార్థులు వినొచ్చు. ఏవైనా అనుమానాలొస్తే మైక్రోఫోన్ల ద్వారా నివృత్తి చేసుకోవచ్చు. దీనికి సంబంధించి కార్పొరేషన్ ఏర్పాట్లు పూర్తిచేసింది. పది స్కూళ్లలో పెలైట్ ప్రాజెక్ట్‌గా ఈ ఏడాది అమలుచేయనున్నారు. తొలిగా టెన్త్ విద్యార్థులకు బోధన చేయాలని నిర్ణయిం చారు. 2016-17 విద్యాసంవత్సరం నుంచి ఆన్‌లైన్ విధానాన్ని అమల్లోకి తేనున్నారు. ఇందుకుగాను తరగతి గదుల్లో స్పీకర్లు, ప్రొజెక్టర్లను ఏర్పాటుచేశారు. ఎంపిక చేసిన పాఠశాలల్లో ఆన్‌లైన్ బోధనపై ఉపాధ్యాయులకు అవగాహన కల్పించేందుకు కసరత్తు ప్రారంభిం చారు. మే నుంచి ఈ విధానాన్ని అమలుచేయనున్నారు. హైదరాబాద్‌కు చెందిన సిస్కో, ఈ-సెంట్రిక్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆన్‌లైన్ విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. గోల్డెన్‌మైల్ ప్రాజెక్ట్‌గా దీనికి నామకరణం చేశారు.
సక్సెస్ అయితే మిగతా స్కూళ్లలో..
ఆన్‌లైన్ విద్యాబోధన ఏర్పాట్లను కమిషనర్ వీరపాండియన్ మంగళవారం పరిశీలించారు. సూర్యారావుపేటలోని కర్నాటి రామ్మోహనరావు స్కూల్‌లో అమర్చిన సాంకేతిక పరికరాలను చూశారు. ఆన్‌లైన్ ద్వారా బోధన పద్ధతుల్ని ఈ-సెంట్రిక్ ప్రతినిధి కార్తీక్ కమిషనర్‌కు వివరించారు. ఉపాధ్యాయులు సెలవుల్లో ఉన్నా విద్యార్థులకు ఇబ్బంది లేకుండా బోధన సాగించవచ్చన్నారు. ఈ ఏడాది ప్రయోగాత్మకంగా పది పాఠశాలల్లో ప్రవేశపెడుతున్నామని కమిషనర్ పేర్కొన్నారు. ఈ స్కూళ్లన్నీ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటాయని, వీటికోసం రూ.40 లక్షలు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. విజయవంతమైతే మిగతా పాఠశాలల్లోనూ ఈ విధానాన్ని అందుబాటులోకి తెస్తామన్నారు.
నగరంలో ఎంపికచేసిన పాఠశాలలు ఇవే
బీవీఎస్ రెడ్డి స్కూల్, ఏపీఎస్‌ఆర్‌ఎంసీ స్కూల్ - కృష్ణలంక, వీఎంసీ హైస్కూల్, గోవిందరాజు ఇమాన్యుల్ ట్రస్ట్ స్కూల్ - పటమట, బీఎస్‌ఆర్‌కే హైస్కూల్ - మొగల్రాజపురం, కర్నాటి రామ్మోహనరావు స్కూల్ - సూర్యారావుపేట, టి.మల్లికార్జున స్కూల్ -మాచవరం, పీవీఆర్ స్కూల్, టి.వెంకటేశ్వరరావు నగరపాలక సంస్థ పాఠశాల - దుర్గాపురం, ఏకేటీపీ స్కూల్, సత్యనారాయణపురం.