భువనేశ్వర్: రాష్ట్రంలో ‘యూట్యూబ్’లో పాఠాల బోధన వ్యవస్థ అంచెలంచెలుగా విస్తరిస్తోంది. ఉన్నత పాఠశాల తరగతులకు ఈ వ్యవస్థను ఇటీవల ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఈ విధానం 1వ తరగతి నుంచి 8వ తరగతి ప్రాథమిక పాఠాల బోధనలో కూడా అమలవుతుందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 21వ తేదీ నుంచి జూలై 7వ తేదీ వరకు ఈ తరగతులకు యూట్యూట్‌లో పాఠాలు నిర్వహిస్తారు. ఈ విధానాన్ని తొలి విడతలో 8 జిల్లాలు ఖుర్దా, బలంగీరు, కటక్, కేంద్రాపడ, గంజాం, పూరీ, ఢెంకనాల్, సుందరగడ్‌లలో ప్రవేశపెడతారు.
ఈ విధానంలో సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజూ 3 పిరియడ్లు నిర్వహిస్తారు. ఒక్కో పిరియడ్ 30 నిమిషాలు. ఉదయం 9 గంటల నుంచి 10.30 గంటల వరకు యూట్యూట్ బోధన సాగుతుంది. వారాంతపు రెండు రోజులు శని, ఆదివారాలు సెలవు. ఒడిశా పాఠశాల విద్యా అథారిటీ (ఒసెపా) ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేసింది. జిల్లా విద్యాధికారులు, జిల్లా ప్రాజెక్టు సమన్వయకర్తలు యూట్యూబ్ పాఠాల కార్యక్రమం బాధ్యతలు నిర్వహిస్తారు. జిల్లా విద్యాధికారులు యూట్యూబ్ తరగతి గదులు ఏర్పాటు చేస్తారు. 1వ తరగతి నుంచి 3వ తరగతి వరకు నిత్యం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు, 4వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఉదయం 9 గంటల నుంచి 10.30 గంటల వరకు తరగతులు నిర్వహిస్తారు.
పాఠాల నిర్వహణకు ప్రత్యేక కమిటీ
యూట్యూబ్ పాఠాల నిరంతర నిర్వహణను ప్రత్యేక కమిటీ పర్యవేక్షిస్తుంది. జిల్లా విద్యాధికారు (డీఈఓ)ల ఆధ్వర్యంలో ఏర్పాటయ్యే ప్రత్యేక కమిటీ యూట్యూబ్ పాఠాలు బోధించే ఉపాధ్యాయునికి సహాయకారిగా వ్యవహరిస్తుంది. నిత్యం యూట్యూబ్ పాఠాలకు హాజరైన విద్యార్థుల వివరాలు, బోధనలో ఒడిదుడుకులు వగైరా అంశాల్ని కమిటీ పరిశీలిస్తుంది. తరగతుల తర్వాత విద్యార్థుల సందేహాలను వాట్సాప్, వాయిస్ కాల్ ఆధ్వర్యంలో సంధిత ఉపాధ్యాయులు నివృత్తి చేస్తారు. పాఠశాల ఉపాధ్యాయులు సబ్జెక్టు, క్లాస్‌వారీగా వర్క్‌షీట్లు తయారు చేసి విద్యార్థులకు అందజేస్తారు. వాటి ఆధారంగా విద్యార్థులు సాధించిన మార్కుల వివరాల్ని భద్రపరచాల్సి ఉంటుంది. ఈ వివరాల్ని సమితి, జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులు సమీక్షిస్తారు. రోజువారీ తరగతుల వివరాలు జిల్లా విద్యాధికారి ఆధీనంలో ఉంటాయి.
చదవండి: Zomato Girl: ఆకలి చూపిన ఉపాధి
Comments
Please login to add a commentAdd a comment