తన భర్త అకృత్యాలను మీడియాకు తెలియజేస్తున్న కుమార్ భార్య సాయిలక్ష్మి ,టూ టౌన్ పోలీస్ స్టేషన్ గేటు ఎదుట బైఠాయించిçన విద్యార్థులు (ఇన్‌సెట్) కరస్పాండెంట్ కుమార్
విశాఖపట్నం ,అల్లిపురం : కీచక కరస్పాండెంట్‌ను శిక్షించాల్సిందే అంటూ విద్యార్థులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతతకు దారి తీసింది. టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల డాబాగార్డెన్స్‌లో ప్రేమసమాజం ఎదుట గల విశాఖ ఒకేషనల్ జూనియర్ కాలేజీ విద్యార్థులు మంగళవారం కోపోద్రిక్తులయ్యారు. కళాశాలలో చదివే విద్యార్థినులతో కరస్పాండెంట్ గాది వెంకట సత్య నరిసింహ కుమార్ అలియాస్ కుమార్ కీచకుడిలా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. మంగళవారం విద్యార్థులంతా కలిసి కళాశాలలో కుమార్‌ను నిలదీశారు. బాధితురాలి కథనం ప్రకారం...
విశాఖ ఒకేషనల్ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు చదువుతున్న బాధితురాలు కైలాసపురంలో గల కళాశాల హాస్టల్‌లో ఉండేది. అయితే హాస్టల్‌లో సౌకర్యాలు బాగోలేవని ఇటీవల బయట అద్దె గది తీసుకుని ఉంటోంది. ఈ నేపథ్యంలో ఇటీవల కుమార్ తల్లి కాలం చేయడంతో ఇంటి పనులున్నాయని బాధితురాలిని శుక్రవారం కుమార్ ఇంటికి పిలిపించాడు. ఇంటికి వెళ్లిన తర్వాత ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించి లైంగిక దాడికి యత్నించాడు. దీంతో ఆమె అతని కాళ్లు పట్టుకుని బతిమలాడి అక్కడి నుంచి బయటపడింది. జరిగిన విషయాన్ని సోమవారం కళాశాలలో సహ విద్యార్థినులకు చెప్పి... తాను చచ్చిపోవాలనుకుంటున్నట్లు తెలియజేసింది. దీంతో విద్యార్థులంతా విషయాన్ని కళాశాలలో మరో ఉపాధ్యాయుడు సురేష్‌కు వివరించారు. ఆత్మహత్య చేసుకుని సాధించేదేముంది అంటూ బాధితురాలిని వారించారు. మంగళవారం ఉదయం కళాశాలకు వచ్చిన తర్వాత విద్యార్థులంతా కరస్సాండెంట్ కుమార్ కార్యాలయంలోకి వెళ్లి నిలదీశారు. ఆ సమయంలో కళాశాల ప్రిన్సిపాల్ గ్లోరీ కూడా అక్కడే ఉన్నారు. ఆమె కుమార్‌ని హెచ్చరించాల్సిందిపోయి మద్దతుగా నిలవడంతో విద్యార్థులు కోపోద్రోక్తులయ్యారు. కుమార్‌పై వారంతా తిరగబడేసరికి టూ టౌన్ పోలీసులు విషయం తెలుసుకుని అక్కడకు చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో విద్యార్థులు టూ టౌన్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
నిందితుడిపై గతంలో మూడు కేసులు
నిందితుడు కుమార్ గతంలో నర్సీపట్నంలో కూడా కళాశాలలు నడిపినట్లు అతని భార్య సాయిలక్ష్మి తెలిపింది. అతనిపై అక్కడ కూడా లైంగిక వేధింపులపై మూడు కేసులు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. అక్కడి కళాశాలలు మూసివేసి ఇక్కడకు చేరుకున్నాడని, అతడిని కళాశాల ప్రిన్సిపాల్ గ్లోరీ వెంట తిప్పుకుంటుందని భార్య తీవ్రస్థాయిలో ఆరోపించింది. తన భర్తను తనకు కాకుండా చేస్తోందని ఆరోపించింది. వారికి శిక్ష పడేలా చూడాలని ఆమె డిమాండ్ చేసింది.
విద్యార్థులకు పలువురి మద్దతు
బాధిత విద్యార్థినితో పాటు కళాశాల విద్యార్థులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నగర అధ్యక్షుడు కొండా రాజీవ్‌గాంధీతో పాటు ఎస్‌ఎఫ్‌ఐ ప్రతినిధులు, ఐద్వా నగర కార్యదర్శి ప్రియాంక అండగా నిలబడ్డారు. కళాశాల విద్యార్థులతో కలిసి డాబాగార్డెన్స్ నుంచి ర్యాలీగా రైల్వే స్టేషన్ వరకు వెళ్లారు. అక్కడి నుంచి ఆటోలలో కంచరపాలెం పోలీస్ స్టేషన్‌కు చేరుకుని బైఠాయించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఎస్‌ఐ ఉమా వెంకటేశ్వరరావుని కోరారు. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నగర అధ్యక్షుడు కొండా రాజీవ్‌గాంధీ మాట్లాడుతూ కళాశాలకు గుర్తింపులేదన్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు నష్టపోకుండా వేరే కళా శాల ద్వారా పరీక్షలు రాసే అవకాశం కల్పించా లని డిమాండ్ చేశారు. లేకుంటే జీవీఎంసీ వద్ద భారీ ధర్నా చేస్తామని ఆయన హెచ్చరించారు.
కంచరపాలెం పోలీసుల అదుపులో నిందితుడు
బాధితురాలు ఫిర్యాదు మేరకు కంచరపాలెం ఎస్‌ఐ ఉమ వెంకటేశ్వరరావు కేసు నమోదు చేశా రు. నిందితుడిని విచారిస్తున్నట్లు ఆయన తెలిపా రు. ఈ మేరకు నగర పోలీస్ కుమార్ మహేష్‌చంద్ర లడ్డా నిందితుడిని తక్షణమే అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అతని ఆదేశాల మేరకు కంచరపాలెం పోలీసులు నిందితుడుపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
పోలీసుల ప్రవర్తనపై విద్యార్థుల ఆగ్రహం
ఫిర్యాదు తీసుకోకపోవడంతో టూ టౌన్ పోలీసులపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు నిందితుడికి కొమ్ము కాస్తున్నారని, అతడిని తప్పించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తమకు న్యాయం జరిగే వరకు కదిలేది లేదని బైఠాయించారు. మరోవైపు ఎస్‌ఐ మహేష్ విద్యార్థులకు అండగా ఉన్న అధ్యాపకుడు సురేష్ పట్ల దురుసుగా ప్రవర్తించడం, ఏ1గా సురేష్ పేరు పెడతామనడంతో పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వారిని అక్కడి నుంచి పంపించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. విషయం తెలుసుకున్న ఈస్ట్ ఏసీపీ అన్నెపు నరసింహమూర్తి స్టేషన్ వద్దకు చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. సంఘటన జరిగింది కైలాసపురం అయినందున అది ఐదో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందన్నారు. నిందితుడిని, బాధితులను అక్కడకు పంపిస్తామన్నారు. బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకుని నిందితుడిని అరెస్ట్ చేస్తామని చెప్పడంతో విద్యార్థులు అక్కడి నుంచి నిష్క్రమించారు. అనంతరం విద్యార్థులు కళాశాల వద్దకు చేరుకుని ఫ్లెక్సీలను చించివేశారు. కళాశాల అద్దాలు పగలగొట్టటంతో పోలీసులు అక్కడకు చేరుకుని విద్యార్థులను అక్కడి నుంచి పంపించి వేశా>రు. కళాశాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment