ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, ఆనందపురం (భీమిలి): మండలంలోని కుసులువాడ పంచాయతీ చిన్నయ్యపాలెం వద్ద వివాహితపై అత్యాచారం జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితురాలు మంగళవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక సీఐ వై.రవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విశాఖపట్నం జిల్లా, నర్సీపట్నానికి సమీపంలోని మర్రిపాలెం గ్రామానికి చెందిన యువకుడితో విజయనగరం బాబామెట్టకు చెందిన యువతికి నాలుగేళ్లు క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలున్నారు. కాగా ఇటీవల భర్తతో గొడవ జరగడంతో ఆ వివాహిత విజయనగరంలోని తన కన్నవారి ఇంటికి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది.
ఈ మేరకు ఆగస్టు 27న రాత్రివేళ తన ఇద్దరు పిల్లలను తీసుకొని నర్సీపట్నంలో బస్సు ఎక్కి నగరంలోని ఆర్టీసీ బస్టాండ్‌కు రాత్రి 11–30 గంటలు ప్రాంతంలో చేరుకుంది. అర్ధరాత్రి కావడంతో మధురువాడలోని తన స్నేహితుల ఇంటికి వెళ్లడానికి నిర్ణయించుకుంది. బస్సు కోసం నిరిక్షిస్తుండగా ఓ ఆటోవాలా వివాహిత వద్దకు వచ్చి ఎక్కడకు వెళ్లాలని అడిగాడు. ఆమె మధురవాడ వెళ్లాలని చెప్పగా అటు వైపే వెళ్తున్నానని చెప్పి ఆమెను, ఇద్దరు పిల్లలను ఆటోలో ఎక్కించుకున్నాడు. ఆటో హనుమంతువాక జంక్షన్‌కు చేరుకునే సరికి మధురవాడ వైపు కాకుండా సింహాచలం రూటు వైపు మళ్లించాడు. ఆ విషయం తెలుసుకున్న వివాహిత రూటు మళ్లించిన విషయమై అడగగా ఆటోకు రికార్డులు లేవని, పోలీసులతో ఇబ్బందులు ఉంటాయని వేరే మార్గంలో తీసుకెళ్తానని నమ్మించాడు.
ఈ మేరకు ఆటోను సింహాచలం జంక్షన్, సత్రవు జంక్షన్, నీళ్లకుండీలు జంక్షన్ మీదుగా తీసుకెళ్లి కుసులువాడ పంచాయతీ, చిన్నయ్యపాలెం గ్రామ సమీపంలోని తోటలు వద్ద ఆపివేశాడు. అప్పటికే తాను మోసపోయినట్టు గ్రహించిన వివాహిత ఎదురు తిరగగా ఆటోవాలా ముగ్గురిని చంపుతానని బెదిరించాడు. ముందుగా ఆమె వద్ద ఉన్న సెల్ ఫోన్‌ను, రూ.14వేలు నగదు, ఓ పాప వద్ద ఉన్న చెవిరింగులను లాక్కున్నాడు. అనంతరం ఆమెను బలవంతంగా శారీరకంగా అనుభవించి ముగ్గురిని అక్కడే వదిలిపెట్టి ఆటోతో పరారయ్యాడు. లాక్కున్న సెల్ ఫోన్‌ను అతడు అక్కడే మరిచిపోవడంతో బాధితురాలు విజయనగరంలోని తన తల్లిదండ్రులకు సమాచారం అందించింది.
ఈ మేరకు బాధితురాలు తెలిపిన ఆనవాళ్లు మేరకు రాత్రివేళ చిన్నయ్యపాలెం వచ్చి తీసుకెళ్లారు. కాగా ముందు భయపడిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకొని మొదట ఆరిలోవ పోలీస్ స్టేషన్‌ని ఆశ్రయించగా వారు కమిషనర్ కార్యాలయానికి పంపించారు. అక్కడ విచారించిన సిబ్బంది సంఘటన జరిగిన ప్రాంతం ఆనందపురం పోలీసు స్టేషన్ పరిధిలోనిదని తేల్చి బాధితురాలను పంపించారు. ఈ మేరకు ఆమె నిందితుడు ఆనవాళ్లుతోపాటు ఆటో నంబర్‌తో ఫిర్యాదు చేయగా సీఐ వై.రవి కేసు నమోదు చేశారు. బాధితురాలిని వైద్య పరీక్షలు నిమిత్తం కేజీహెచ్‌కు తరలించి నిందితుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment